12వ రోజూ పెట్రో బాదుడు

ప్రధానాంశాలు

Published : 21/02/2021 05:28 IST

12వ రోజూ పెట్రో బాదుడు

హైదరాబాద్‌లో 40 పైసల చొప్పున..

దిల్లీ: దేశంలో పెరుగుతున్న ఇంధనం ధరలు సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరుసగా 12వ రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు సంస్థలు పెంచాయి. శనివారం లీటర్‌ పెట్రోల్‌పై 39 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెరిగింది. ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97కి, డీజిల్‌ రూ.88.06కి చేరింది. దిల్లీలో పెట్రోల్‌ 90.58, డీజిల్‌ రూ.80.97కి పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌, డీజిల్‌పై 40 పైసల చొప్పున ధరను పెంచారు. దీంతో పెట్రోల్‌ ధర 94.18కి డీజిల్‌ 88.31కి ఎగబాకింది.
కాంగ్రెస్‌ ధర్నా
పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పలు రాష్ట్రాల్లో ఆందోళనలు చేశారు. రాజస్థాన్‌లోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. మధ్యప్రదేశ్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో బంద్‌ నిర్వహించారు. దిల్లీలో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన చేశారు. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చమురు ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేంద్రంపై ధ్వజమెత్తారు. ఇది ద్రవ్యోల్బణ పెరుగుదలకు దారి తీస్తుందని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ పెరుగుతున్న కారణంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల చిత్రాన్నీ జతచేశారు.
అందుకే ధరల్లో పెరుగుదల: గహ్లోత్‌
కేంద్రం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ విమర్శించారు. 2014లో యూపీఏ హయాంలో ఎక్సైజ్‌ సుంకం లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.20 ఉంటే.. ప్రస్తుతం రూ.32.90 ఉందని.. ఈ మేర సుంకాలు విధించడం కారణంగా సామాన్యుడు బలవుతున్నాడని ట్విటర్‌ ద్వారా గహ్లోత్‌ మండిపడ్డారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎక్సైజ్‌ సుంకాలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన