అఫ్గాన్‌లో మళ్లీ ఆటవిక చర్యలు

ప్రధానాంశాలు

Published : 26/09/2021 05:37 IST

అఫ్గాన్‌లో మళ్లీ ఆటవిక చర్యలు

క్రేన్‌కు వేలాడిన మృతదేహం

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో ఏదైతే జరగకూడదని ప్రపంచం ఆందోళన చెందుతోందో.. మళ్లీ అదే జరగబోతోందా! గత ఆగస్టు 15న కాబుల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత ప్రపంచ దేశాల దృష్టి మొత్తం ఈ దేశం వైపు మళ్లింది. పాతికేళ్ల కిందట తొలిసారి అధికారంలోకి వచ్చినపుడు క్రూరమైన శిక్షలతో ఆటవిక పాలన సాగించిన తాలిబన్లు ఇపుడు మళ్లీ అదే బాటలోకి వెళుతున్నారా? ఈ సందేహాలకు బలం చేకూర్చేలా పశ్చిమ అఫ్గానిస్థాన్‌లోని హెరాత్‌ నగర ప్రధాన కూడలిలో తాలిబన్లు శనివారం ఓ మృతదేహాన్ని క్రేన్‌కు వేలాడదీశారు. కూడలిలో ఓవైపు మందుల దుకాణం నడుపుతున్న వజీర్‌ అహ్మద్‌ సిద్దీఖి ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. నాలుగు మృతదేహాలను అక్కడికి తీసుకువచ్చి, మిగతా మూడింటిని నగరంలోని ఇతర కూడళ్లలో ప్రదర్శనకు తరలించినట్లు వెల్లడించారు. ఈ నలుగురూ ఓ కిడ్నాప్‌ వ్యవహారంలో పాల్గొంటూ.. పోలీసు కాల్పుల్లో మృతిచెందినట్లు తాలిబన్లు ప్రకటించారని ఆయన చెప్పుకొచ్చారు. తాలిబన్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా నూరుద్దీన్‌ తురాబీ కొద్దిరోజుల కిందట మీడియాతో మాట్లాడుతూ.. అఫ్గానిస్థాన్‌లో చట్టాన్ని అమలు చేయడంలో మునుపటి కఠిన వైఖరే కొనసాగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. 20 ఏళ్ల కిందట తాలిబన్లు మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు ఇస్లాం చట్టాన్ని అత్యంత కఠినంగా అమలుచేసిన ముఖ్యుడు ఈయన. మరణశిక్షలు, చేతులు నరకడం వంటివి ఇపుడు కూడా ఉంటాయని.. కాకపోతే బహిరంగంగా అమలు చేయబోమని నూరుద్దీన్‌ తురాబీ ఇటీవల ప్రకటించారు. గత 20 ఏళ్లలో ముఖ్యంగా సామాజిక మాధ్యమం రాకతో ప్రపంచం ఎంతో మారింది. తాలిబన్లు కూడా ఈ విషయాన్ని గుర్తించినా.. తమ చుట్టూ  ఏర్పాటు చేసుకొన్న సురక్షిత వలయం నుంచే ప్రపంచాన్ని చూస్తున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన