వనితా.. వందనం

ప్రధానాంశాలు

Updated : 03/08/2021 22:06 IST

వనితా.. వందనం

చరిత్ర సృష్టించిన అమ్మాయిల జట్టు

ప్రపంచం చాలా మారింది. భారతీయ సమాజమూ ఎంతో మారింది. అయినా సరే..  ఇప్పటికీ ‘ఆమె’ ఆటల్లోకి వెళ్తానంటే.. ‘‘అమ్మాయిలకెందుకు ఆటలు. చక్కగా చదువుకోకుండా’’ అనే వ్యాఖ్యలే వినిపిస్తుంటాయి చాలా చోట్ల! మైదానంలో ప్రత్యర్థులతోనే కాక బయట వ్యవస్థతోనూ పోరాడాల్సిన భారత్‌ లాంటి దేశంలో అబ్బాయిల్ని ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే సవాలంటే.. ఇక ఓ అమ్మాయికి ఆట నేర్పి, అందులో ఓ స్థాయికి తీసుకురావడమంటే.. ఆషామాషీ విషయం కాదు. ఇక ప్రపంచ స్థాయిలో సత్తా చాటేలా తీర్చిదిద్దాలంటే ఎన్నెన్ని అడ్డంకులో! కానీ అన్నింటినీ దాటిస్తే.. అమ్మాయిలు ఏం సాధిస్తారనడానికి అయిదేళ్ల కిందటి రియో ఒలింపిక్స్‌.. ప్రస్తుత టోక్యో క్రీడలే నిదర్శనం. రియోలో ఒక్క పతకమూ లేక పన్నెండు రోజులు గడిచిపోయి దేశమంతా నైరాశ్యంలో కూరుకుపోయిన వేళ.. ఒకే రోజు రెండు పతకాలతో ఊరటనిచ్చిన ఇద్దరూ అమ్మాయిలే. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌ పతక ఆశలు నెరవేరుస్తున్నదీ మహిళలే. వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను తొలి రోజే రజతంతో మురిపిస్తే.. ఆపై బాక్సర్‌ లవ్లీనా పతకం ఖాయం చేసి సంతోషంలో  ముంచెత్తింది. తాజాగా షట్లర్‌ సింధు కాంస్యంతో మెరిసింది. ఇప్పుడిక హాకీలో అమ్మాయిలు చరిత్రాత్మక విజయంతో అబ్బురపరిచారు. పతకంపై ఆశలు రేపారు. పురుషుల హాకీ జట్టు కూడా సెమీస్‌ చేరినా అమ్మాయిలు సాధించిన విజయం అసాధారణం. ఈ ఊపులో ఇంకో విజయం సాధిస్తే.. ఈ ఒలింపిక్స్‌లో మరో పతకం మహిళల ఖాతాలోకి చేరుతుంది. ఇంకా రెజ్లింగ్‌లో నలుగురమ్మాయిలు పతకాశలు రేపుతున్నారు. రియోలో మాదిరే టోక్యోలోనూ 135 కోట్లమంది ఆకాంక్షలను నెరవేరుస్తున్న వనితలకు దేశం సలాం చేస్తోందిప్పుడు. ఆటల్లో తమ అభిరుచిని ప్రోత్సహించి, తమ ఆశలకు రెక్కలు తొడిగితే ఏం  సాధించగలమో చూపించిన అమ్మాయిలకు మున్ముందు మరింత ప్రోత్సాహం అందుతుందని.. వారు మరిన్ని అద్భుతాలను ఆవిష్కరిస్తారని ఆశిద్దాం!

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన