పట్టు జారే.. పసిడి చేజారే

ప్రధానాంశాలు

Updated : 06/08/2021 09:02 IST

పట్టు జారే.. పసిడి చేజారే

రవి దహియాకు రజతం

చిబా (జపాన్‌)


‘‘రవి కుమార్‌ ఓ విశేషమైన రెజ్లర్‌. అతని పోరాట స్ఫూర్తి, పట్టుదల అద్భుతం. టోక్యోలో రజతం గెలిచిన అతనికి అభినందనలు. అతని విజయం పట్ల దేశం గర్విస్తోంది’’   - ప్రధాని మోదీ


అయ్యో రవి దహియా..! ఆడుతున్న తొలి ఒలింపిక్స్‌లోనే ఫైనల్‌కు చేరిన ఈ కుర్రాడిపై అభిమానులకు కొండంత ఆశలు! ఈ క్రీడల్లో అభినవ్‌ బింద్రా తర్వాత వ్యక్తిగత స్వర్ణం గెలుస్తాడనే ఎదురు చూపులు! అందుకే రవి బౌట్‌ మొదలవగానే దేశం అతడి గెలుపు కోసం ప్రార్థించింది. టీవీలకు అతుక్కుపోయింది. రవి పోరాడుతుంటే కళ్లప్పగించి ప్రతి క్షణం ఉత్కంఠను అనుభవించింది. కానీ అతడు ప్రత్యర్థితో కొదమ సింహంలా తలపడినా నిరాశ తప్పలేదు. అభిమానుల ఆశ తీరలేదు.. పసిడి కల నెరవేరలేదు. ఫైనల్లో హోరాహోరీ పోరాడినా రవికి రజతమే దక్కింది. సుశీల్‌కుమార్‌ తర్వాత ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో రజతం గెలిచిన ఘనత దహియాదే. మరో కుర్రాడు దీపక్‌ పునియా త్రుటిలో పతకం కోల్పోవడం.. టాప్‌సీడ్‌ వినేశ్‌ ఫొగాట్‌ క్వార్టర్‌ఫైనల్లోనే పోటీల నుంచి నిష్క్రమించడం అభిమానులకు శరాఘాతం.

రవి దహియా పసిడి కల నెరవేరలేదు. సామర్థ్యానికి మించి పోరాడినా విజయం దక్కలేదు. గురువారం హోరాహోరీగా సాగిన 57 కిలోల ఫైనల్లో రవి 4-7తో ప్రపంచ ఛాంపియన్‌ జవుర్‌ యుగెవ్‌ (రష్యా ఒలింపిక్‌ కమిటీ) చేతిలో పరాజయం చవిచూశాడు. తుది పోరులో ఆరంభం నుంచి యుగెవ్‌ దూకుడు ప్రదర్శించగా.. రవి మాత్రం ఆచితూచి ఆడాడు. ఒకటి రెండుసార్లు ప్రత్యర్థి కాలును అతడు చేజిక్కించుకున్నా యుగెవ్‌ ఒడుపుగా తప్పించుకున్నాడు. దహియా చురుకుగా లేకపోవడాన్ని ఆసరాగా తీసుకున్న యుగెవ్‌ అతడిని రెండుసార్లు వృత్తం బయటకు తీసుకెళ్లి రెండు పాయింట్లు సాధించాడు. కానీ లెగ్‌ అటాక్‌తో రవి 2-2తో స్కోరు సమం చేశాడు. అయితే వెంటనే ప్రత్యర్థికి అవకాశం ఇచ్చిన దహియా విరామ సమయానికి 2-4తో వెనకబడ్డాడు. ఆ తర్వాత రవి దూకుడు పెంచాడు. ప్రత్యర్థిని దొరకబుచ్చుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కానీ పటిష్టమైన డిఫెన్స్‌ ప్రదర్శించిన యుగెవ్‌.. దహియాకు చిక్కలేదు. పైగా ఎదురుదాడికి దిగి 7-2తో రవిపై మరింత ఒత్తిడి పెంచాడు. బౌట్‌ ముగియడానికి సెకన్లే మిగిలున్న స్థితిలో సెమీఫైనల్లో మాదిరే ప్రత్యర్థిని పిన్‌ (వీపు నేలకు తాకించడం) చేయడానికి రవి చాలా ప్రయత్నాలే చేసినా రక్షణాత్మకంగా ఆడిన యుగెవ్‌ ఆ ప్రయత్నాలను తిప్పికొట్టి విజేతగా నిలిచాడు. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సెమీఫైనల్లోనూ యుగెవ్‌ చేతిలోనూ రవి ఓడడం గమనార్హం.


దీపక్‌.. చివరి 10 సెకన్లలో!

దురదృష్టం అంటే దీపక్‌ పునియాదే. ఈ టీనేజర్‌ కొద్దిలో ఒలింపిక్‌ పతకాన్ని చేజార్చుకున్నాడు. చివరి 10 సెకన్లే అతడిని పరాజితుడిగా మిగిల్చాయి. 86 కిలోల కాంస్య పతక పోరులో దీపక్‌ 2-4తో నజీమ్‌ (సాన్‌మారినో) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. ఈ బౌట్లో ఎక్కువ శాతం దీపక్‌దే ఆధిపత్యం. లెగ్‌ అటాక్‌ ద్వారా ఆరంభంలోనే 2-0తో ఆధిక్యంలోకి వెళ్లాడతను. కానీ విరామానికి ముందు ఒక పాయింట్‌ గెలిచిన నజీమ్‌.. రెండో రౌండ్లోనూ ప్రమాదకరంగా కనిపించలేదు. పైగా సమయం మించిపోతుండడంతో పునియాదే విజయంగా కనిపించింది. చివరి 10 సెకన్లలో ఫలితం మారిపోయింది. అటాక్‌ చేయకుండా డిఫెన్స్‌పై దృష్టి పెట్టడం దీపక్‌ను దెబ్బ తీసింది. ఆఖరి సెకన్లలో అతడి కాలుని చేజిక్కించుకున్న నజీమ్‌.. మూడు పాయింట్లు గెలిచి కాంస్యాన్ని ఎగరేసుకుపోయాడు.


చెదిరిన వినేశ్‌ కల

2016 రియో ఒలింపిక్స్‌లో అనూహ్యంగా గాయంతో వైదొలిగి.. ఈసారి ఎలాగైనా పతకం సాధించాలనే పట్టుదలతో టోక్యోకు వచ్చిన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ కల చెదిరింది. ఆమె క్వార్టర్‌ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. ప్రిక్వార్టర్స్‌లో 7-1తో సోఫియా (స్వీడన్‌)ను చిత్తు చేసి జోరు మీద కనిపించిన టాప్‌సీడ్‌ వినేశ్‌కు క్వార్టర్స్‌లో అదృష్టం కలిసి రాలేదు. ఆమె 3-9తో వెనెసా (బల్గేరియా) చేతిలో అనూహ్యంగా పరాజయం చవిచూసింది. మ్యాచ్‌లో 2-7తో వెనకబడిన వినేశ్‌ చివరి 50 సెకన్లలో ప్రత్యర్థిని పడేయడానికి ప్రయత్నించగా.. అది ఫలించకపోగా.. ఆమెనే వెనెసా వెల్లికిలా పడేసి విజయాన్ని సొంతం చేసుకుంది. వెనెసా ఫైనల్‌ చేరితే వినేశ్‌కు రెపిచేజ్‌ ఆడే అవకాశం లభించేది. కానీ ఆమె సెమీఫైనల్లోనే ఓడడంతో భారత స్టార్‌ కథ ముగిసింది. మరో అమ్మాయి అన్షు మలిక్‌ కూడా ఓడిపోయింది. 57 కిలోల రెపిచేజ్‌ తొలి రౌండ్లో అన్షు 1-5తో కోబ్లోవా (రష్యా ఒలింపిక్‌ కమిటీ) చేతిలో పరాజయం చవిచూసింది.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన