ఖగోళశాస్త్ర పరిశోధనలకు కొత్తతరం ఉపగ్రహం!

ప్రధానాంశాలు

Published : 29/09/2021 05:31 IST

ఖగోళశాస్త్ర పరిశోధనలకు కొత్తతరం ఉపగ్రహం!

కసరత్తు చేస్తున్న ఇస్రో

బెంగళూరు: విశ్వంలో అంతుచిక్కని అంశాలను శోధించేందుకు కొత్తతరం ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) యోచిస్తోంది. భారత్‌ మొట్టమొదటిసారిగా రూపొందించిన ఖగోళ పరిశోధన ఉపగ్రహం ‘ఆస్ట్రోశాట్‌’.. మంగళవారంతో ఆరేళ్లు పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఐదేళ్ల పాటు పనిచేసేలా రూపొందించారు. అది మరికొన్నేళ్ల పాటు సేవలు అందించే అవకాశం ఉందని ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఆస్ట్రోశాట్‌ను ప్రయోగించినప్పుడు సంస్థకు ఆయనే నేతృత్వం వహించారు. ప్రస్తుతం ఇస్రోలో ‘అపెక్స్‌ సైన్స్‌ కమిటీ’కి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రోశాట్‌ ఉపగ్రహం నుంచి మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కిరణ్‌ కుమార్‌ చెప్పారు. దీనికి కొనసాగింపుగా ఆస్ట్రోశాట్‌-2ను ప్రయోగించే అవకాశం ఉందా అని ప్రశ్నించినప్పుడు.. ‘‘ఆస్ట్రోశాట్‌-2 కాదు.. అది కొత్తతరం ఉపగ్రహమవుతుంది. దీనిపై ఆలోచనలు సాగుతున్నాయి. ఆస్ట్రోశాట్‌కు తదుపరి ఉపగ్రహాన్ని పూర్తి భిన్నంగా రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

బహుళ తరంగదైర్ఘ్యాల్లో పరిశీలనలు చేపట్టగల ఈ అబ్జర్వేటరీలో ఐదు ప్రత్యేక ఎక్స్‌రే, అతినీల లోహిత టెలిస్కోపులు ఉన్నాయి. భూమికి 9.3 బిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలోని ఏయూడీఎఫ్‌ ఎస్‌01 అనే నక్షత్ర మండలంలో అసాధారణ స్థాయి అతినీలలోహిత కాంతిని ఈ ఉపగ్రహం కనుగొంది. 2015 సెప్టెంబరు 28న ఆస్ట్రోశాట్‌ను ఇస్రో నింగిలోకి పంపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన