ఫోరం వద్దనుకుంటే చట్టాన్నే రద్దు చేయండి

ప్రధానాంశాలు

Updated : 23/10/2021 05:55 IST

ఫోరం వద్దనుకుంటే చట్టాన్నే రద్దు చేయండి

ఖాళీల భర్తీలో జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి
వారంలోగా సమాచారం ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశం

దిల్లీ: జిల్లా, రాష్ట్ర స్థాయి వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ల (వినియోగదారుల ఫోరం) పదవుల నియామకంలో బాగా ఆలస్యం జరుగుతుండడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఈ ట్రైబ్యునళ్లను వద్దనుకుంటే ఏకంగా వినియోగదారుల పరిరక్షణ చట్టాన్నే రద్దు చేస్తే మంచిదని వ్యాఖ్యానించింది. ఖాళీల భర్తీపై సుప్రీంకోర్టు పరిశీలించాల్సి రావడం దురదృష్టకరమని శుక్రవారం జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. వినియోగదారుల ఫోరాల అధ్యక్షులు, సభ్యుల పదవులు భర్తీ కాకపోవడంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరుపుతోంది.

తొలుత కోర్టు సహాయకునిగా వ్యవహరిస్తున్న సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకర్‌నారాయణ్‌ మాట్లాడుతూ వినియోగదారుల పరిరక్షణ చట్టంలోని కొన్ని నిబంధనలను కొట్టివేస్తూ బొంబాయి హైకోర్టు పరిధిలోని నాగ్‌పుర్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ఫోరం సభ్యులుగా నియమించాలంటే కనీసం 20 ఏళ్లు, జిల్లా ఫోరం సభ్యులకు కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలని నూతన నిబంధనల్లో పేర్కొన్నారని, వాటిని కొట్టివేస్తూ హైకోర్టు బెంచ్‌ తీర్పు ఇచ్చిందని చెప్పారు. మద్రాసు బార్‌ అసోసియేషన్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునల్‌ సంస్కరణల చట్టంలో కొన్ని నిబంధనలు తీసుకువచ్చిందని చెప్పారు. అయితే ఈ తీర్పుతో సంబంధం లేకుండా గతంలో తాము ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పదవులు భర్తీ చేయవచ్చని ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అమన్‌ లేఖి వాదనలు వినిపిస్తూ నాగ్‌పుర్‌ బెంచ్‌ తీర్పుపై అప్పీలు చేసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. మద్రాసు బార్‌ అసోసియేషన్‌ కేసులో ఇచ్చిన తీర్పునకు అనుగుణంగానే ట్రైబ్యునల్‌ సంస్కరణల చట్టాన్ని తీసుకువచ్చినట్టు తెలిపారు. ఖాళీల విషయమై నిర్ణీత నమూనాలో వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ సుందరేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఫోరాలు బదులు శాశ్వత కోర్టులు ఎందుకు ఉండకూదని ప్రశ్నించారు. రిటైర్డు న్యాయాధికారుల బదులు జడ్జీలను నియమించొచ్చని అభిప్రాయపడ్డారు.


సీబీఐని అడ్డుకునేలా రాష్ట్రాలకు అపార అధికారాల్లేవ్‌: కేంద్రం 

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో కేసులు దర్యాప్తు చేయకుండా సీబీఐకి అనుమతి నిరాకరించేందుకు సంపూర్ణమైన అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలు, దేశవ్యాప్త ప్రభావం ఉన్న అంశాలపై దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి ఉందని పేర్కొంది. ఎన్నికల అనంతర హింస సంఘటనలపై తమ అనుమతి లేకుండానే సీబీఐ కేసులు నమోదు చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తెలిపింది. ఈ మేరకు 60 పేజీల ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. ఈ కేసును జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. పశ్చిమ బెంగాల్‌ వ్యవహారాలపై తాము ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఎలాంటి విచారణా జరిపించడం లేదని, కేంద్రం తెలిపింది. సీబీఐ మాత్రమే కేసులు పెట్టిందని అదే దర్యాప్తు చేస్తోందని పేర్కొంది. కానీ ఈ కేసులో సీబీఐని పార్టీగా పేర్కొనకపోవడం గమనార్హమని ప్రస్తావించింది. కేంద్ర ఉద్యోగులపైనా, ఇతర రాష్ట్రాలపై ప్రభావం చూపే అంశాలపైనా దర్యాప్తు చేయడం రాష్ట్ర హక్కులను తీసుకోవడం కిందికి రాదని తెలిపింది. కొన్ని కేసులపై దర్యాప్తునకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోరినా ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలేవీ లేవని తెలిపింది. ఇందుకు కారణాలను చెప్పాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఈ కేసుపై తదుపరి విచారణను నవంబరు 16కు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది.


 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన