close

తాజా వార్తలు

విద్య.. శిక్షణల్లో కొలువుల కళ!

యువతరానికి ఆసక్తినీ, ఉత్సుకతనూ కలిగించేవైవిధ్యమైన కెరియర్లకు విద్యా, శిక్షణ రంగాలు వేదికలవుతున్నాయి. అందరికీ తెలిసిన బోధన, బోధనేతర ఉద్యోగాలతో పాటు ఎడ్‌టెక్‌, అడ్మినిస్ట్రేషన్‌ వర్క్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌ మొదలైన విభిన్న విభాగాల్లో సవాళ్లతో కూడుకున్న ఎన్నో కొలువులు ఈ రంగంలో ఏర్పడ్డాయి. విద్యాసంస్థల్లోనే కాకుండా ఆ రంగానికి సేవలందించే వివిధ స్టార్టప్‌ కంపెనీల్లోనూ ఉపాధికి ద్వారాలు తెరుచుకున్నాయి. పోస్టును బట్టి ఎంబీఏ, ఇంజినీరింగ్‌, స్టాటిస్టిక్స్‌, పీజీ అర్హతలతో పాటు భావ వ్యక్తీకరణ, నాయకత్వ నైపుణ్యాలున్నవారిని అవకాశాలు స్వాగతిస్తున్నాయి. జాతీయ విద్యాదినోత్సవ సందర్భంగా విద్యా, శిక్షణ రంగాల్లో పెరుగుతున్న ఉపాధి అవకాశాలేమిటో తెలుసుకుందాం!

రికొత్త సాంకేతికతలు ఉద్యోగాల స్వభావాల్లో మార్పులు తెస్తున్నాయి. ఆ నైపుణ్యాలను విద్యాభ్యాస దశలోనే నేర్చుకునే ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. విస్తరిస్తున్న విద్యారంగంలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగం అనివార్యమైపోయింది. ఈ పరిణామాల మూలంగా విద్యా, శిక్షణ రంగాల్లో నియామకాలు పుంజుకుంటున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క మనదేశంలో విద్యా, శిక్షణ రంగాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్‌ షైన్‌.కామ్‌ సర్వే చెబుతోంది.

ఈ రెండు రంగాల్లో పెద్ద సంఖ్యలో సాంకేతిక అంకుర సంస్థలు (టెక్‌ స్టార్టప్స్‌) ఆరంభమయ్యాయి. ఒక అంచనా ప్రకారం మనదేశంలో స్టార్టప్‌లు ఎడ్యుకేషనల్‌ కంటెంట్‌పై 32 శాతం, టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌, సేవలపై 25 శాతం, స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌పై 22 శాతం దృష్టిపెడుతున్నాయి. బైజూస్‌ లాంటివి అంకుర సంస్థలుగా మొదలైనవే. దీంతో పాటు మొబైల్‌ లర్నింగ్‌, ఈ-లర్నింగ్‌ల లాంటి నూతన విధానాల వినియోగం పెరగటం ఈ రంగాల్లో ఉద్యోగాల సృష్టికి దోహదపడుతున్నాయి. అంకుర సంస్థల్లో డెవలపర్లుగా, సేల్స్‌ మార్కెటర్లుగా నూతన అవకాశాలు ఏర్పడ్డాయి.

మనదేశంలో డిజిటల్‌ లర్నింగ్‌ వేగంగా విస్తరిస్తోంది. ఈ-లర్నింగ్‌ మార్కెట్‌లో ప్రథమ స్థానం అమెరికాదైతే, తర్వాతి స్థానం భారత్‌దే! దేశజనాభాలో సగానికి పైగా యువతే. అంతే కాదు; 5-24 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు 50 కోట్ల మంది. పాఠశాలలూ, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా సుశిక్షితులైన బోధన సిబ్బందీ, మౌలిక సదుపాయాలూ లేవు. అందుకే విద్యా, శిక్షణ రంగాల అభివృద్ధికి ఇక్కడున్న అవకాశాలు అపారమని చెప్పొచ్ఛు ముఖ్యంగా... నూతన సాంకేతికత వినియోగం, సాంప్రదాయిక బోధనా పద్ధతుల స్థానంలో మెరుగైన విధానాలను పాటించే క్రమంలో అత్యధిక ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి.

సరికొత్త ధోరణులు

పర్సనలైజ్డ్‌ లర్నింగ్‌ : విద్యార్థులందరూ ఒకే స్థాయిలో నేర్చుకోలేరు. ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరి పరిమితి వారిది. అందుకే ఉపాధ్యాయులూ, శిక్షకులూ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ పెడుతూ అందుకు తగ్గట్టుగా బోధించటానికి డిజిటైజేషన్‌ వీలు కల్పిస్తోంది. ఇప్పుడు ఎన్నో కంపెనీలు పర్సనలైజ్డ్‌ లర్నింగ్‌కు ప్రాధాన్యమిస్తూ సొల్యూషన్లను రూపొందిస్తున్నాయి.

ఇంటిగ్రేటెడ్‌ లర్నింగ్‌: వివిధ సబ్జెక్టులను కలిపి నేర్చుకోవటం విద్యార్థులకు ఆసక్తికరంగా ఉండటమే కాకుండా వాటిపై సమగ్రమైన అవగాహనా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ అమలుకు బోధనలో వినూత్న పద్ధతులూ, టీచింగ్‌-లర్నింగ్‌ ఉపకరణాలూ ఎంతో ఉపకరిస్తాయి.

ఇంటరాక్టివ్‌ తరగతులు: ఉపాధ్యాయుల, విద్యార్థుల మధ్య ఇంటరాక్టివ్‌గా నడిచే తరగతులు ఒత్తిడి వాతావరణాన్ని దూరం చేస్తాయి. బోధనాంశాలను ఆసక్తికరంగా నేర్చుకునేలా చేస్తాయి. ఈ పద్ధతిలో టీచింగ్‌-లర్నింగ్‌ ఉపకరణాల వినియోగం సబ్జెక్టును విద్యార్థులకు హత్తుకునేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ సొల్యూషన్లకు గిరాకీ పెరిగింది.

ఏయే అవకాశాలు?

విద్యారంగానికి ఉపాధ్యాయులు వెన్నెముకలాంటివారనేది నిస్సందేహం. వీరూ, పరిమితంగా ఉండే బోధనేతర సిబ్బంది మాత్రమే కాకుండా ప్రముఖ పాఠశాలలూ, కళాశాలలూ తమ అవసరాలకు అనుగుణంగా అకౌంటెంట్లు, మార్కెటింగ్‌ మేనేజర్లు, హెచ్‌.ఆర్‌ స్పెషలిస్టులను నియమించుకుంటున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు మార్కెటింగ్‌, పీఆర్‌ స్పెషలిస్టులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మారుతున్న పరిస్థితుల్లో మేనేజర్లు, అనలిస్టులు, ట్రెయినర్లు, కంప్యూటర్‌ టెక్నీషియన్లు, ఇతర వృత్తి నిపుణులూ ఈ రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ కొలువుల్లో చేరటానికి సంబంధిత విద్యార్హతలతో పాటు భావ వ్యక్తీకరణ, సహనం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటంపై శ్రద్ధ అవసరం. ముందస్తు సన్నద్ధత, కష్టపడే స్వభావం తప్పనిసరి. ఇలాంటి కొన్ని ఉద్యోగాలూ, వాటి విధులను చూద్దాం.

అకడమిక్‌ రిసెర్చి రైటర్‌

విద్యార్థులు ఆధునిక కోర్సులను సులువుగా, సమగ్రంగా నేర్చుకునే అవకాశం ఉండటం వల్ల ఆన్‌లైన్‌ లర్నింగ్‌ విధానం ప్రాచుర్యంలోకి వచ్చేసింది. దీంతో అకడమిక్‌ రైటర్‌ ఉద్యోగాలు పెరుగుతున్నాయి. స్టడీ మెటీరియల్స్‌, థీసిస్‌, బ్లాగ్స్‌, ఆర్టికల్స్‌ రాయటం వీరి విధులు. సంబంధిత అంశంలో పరిజ్ఞానం ఉండటంతో పాటు, గ్రామర్‌, పంక్చువేషన్‌లాంటివి కచ్చితంగా తెలిసివుండాలి. అలాగే అకడమిక్‌ రైటింగ్‌ నిబంధనలు పాటించాల్సివుంటుంది. ఇది వెబ్‌ కంటెంట్‌ రైటింగ్‌కు భిన్నమైనది. తగిన నైపుణ్యాలతో పాటు పీజీ ఉన్నవారు ఈ పోస్టుకు అర్హులవుతారు.

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అనలిస్ట్‌

వినియోగదారుల స్వభావాన్నీ, మార్కెట్‌ ధోరణులనూ అర్థం చేసుకుని భవిష్యత్‌ ప్రణాళికలను తయారుచేసుకోవటానికి బిగ్‌డేటా అనలిటిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. విద్యారంగం కూడా దీన్ని విస్తృతంగా వినియోగిస్తోంది. విద్యాసంస్థలు అనలిస్టును నేరుగా నియమించుకోకపోవచ్చు గానీ ఈ రంగంలో నిపుణులైన కన్సల్టెంట్ల సేవలను ఉపయోగించుకుంటున్నాయి. ఏదైనా ప్రముఖ విద్యాసంస్థ నుంచి స్టాటిస్టిక్స్‌లో డిగ్రీ చేసినవారికి మంచి వేతనాలతో అవకాశాలుంటాయి.

ఎడ్యుకేషన్‌ కౌన్సెలర్‌

చాలా విద్యాసంస్థలు ఎడ్యుకేషన్‌ కౌన్సెలర్లను నియమించుకుంటున్నాయి. విద్యార్థులకు క్యాంపస్‌లో, ఇతరత్రా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి వీరు సహాయపడతారు. కెరియర్‌ కౌన్సెలర్లయితే ఈ ఆటోమేషన్‌ యుగంలో భవితకు పనికొచ్చే అంశాల్లో విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటారు. ఐచ్ఛిక సబ్జెక్టుల ఎంపికలోనూ సహకరిస్తారు. డిగ్రీ లేదా పీజీ విద్యార్హతలతో పాటు విభిన్న కోర్సులు, ఉద్యోగ నియామకాల పరిజ్ఞానం, తాజా ధోరణులపై పట్టు వీరికి అవసరం.

అకడమిక్‌ మేనేజర్‌

నాణ్యతకు ప్రాముఖ్యమిచ్చి ప్రామాణిక విద్యను అందించే పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో అకడమిక్‌ మేనేజర్‌ పోస్టులకు ఎక్కువ గిరాకీ ఉంది. విద్యాసేవలను సక్రమంగా అందించేలా, సంస్థ పనితీరు మెరుగుపరిచేలా చూడటం వీరి ప్రధాన బాధ్యతలు. విద్యాసంస్థల నిర్వహణపై పూర్తి అవగాహన ఉన్నవారు ఈ పోస్టుకు అర్హులవుతారు. సహజంగానే మంచి సాఫ్ట్‌ స్కిల్స్‌, శిక్షణానుభవం అవసరమవుతాయి. ఈ పోస్టుకు పీజీ చేసివుండాలి. అయితే ఎంబీఏ ఉన్నవారికి ప్రాధాన్యం లభిస్తుంది.

ప్రొడక్ట్‌ మేనేజర్‌ ఫర్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ సొల్యూషన్స్‌

డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ సొల్యూషన్‌ కంపెనీలు ప్రొడక్ట్‌ మేనేజర్లను ఆకర్షణీయమైన వేతనాలతో నియమించుకుంటున్నాయి. ప్రొడక్ట్‌ విజయవంతమవటం ప్రధానంగా వీరిపై ఆధారపడివుంటుంది. ప్రొడక్ట్‌ను వృద్ధి చేసే తొలిదశ దగ్గర్నుంచి తుది అమలు వరకూ మేనేజర్‌ నేతృత్వం వహిస్తాడు. అవసరమైన టెక్నాలజీని గుర్తించటం, డిజిటల్‌ టీమ్‌తో సమన్వయం విధుల్లో భాగం. ఏదైనా ప్రసిద్ధ విద్యాసంస్థ నుంచి ఎంబీఏతో పాటు డేటా అనలిటిక్స్‌/అనలిటిక్స్‌పై అవగాహన ఉన్నవారు ఈ పోస్టుకు పోటీపడవచ్ఛు.

మేనేజర్‌- ఎడ్యుకేషన్‌ అండ్‌ స్కిల్‌ ట్రెయినింగ్‌

నైపుణ్య శిక్షణ విభాగం విద్యాసంస్థల్లో ముఖ్యమైనది. శిక్షణ కార్యక్రమాలను రూపొందించటం, వాటిని నిర్వహించటం, ట్రెయినర్ల పనితీరును పర్యవేక్షించటం, వారికి తగిన సూచనలు ఇవ్వటం లాంటివి ఈ మేనేజర్ల విధులు. సైన్స్‌/మ్యాథ్స్‌/సోషల్‌ సైన్సెస్‌లో పీజీతో పాటు నిర్వహణ, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు తప్పనిసరి. అధిక సంఖ్యాకులతో సమన్వయం చేయాల్సిరావటానికి రిలేషన్‌షిప్‌ బిల్డింగ్‌ నైపుణ్యాలు అవసరమవుతాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.