close

తాజా వార్తలు

ఉద్యోగుల ఫిర్యాదుపై సెబీ దర్యాప్తు..?

ముంబయి: దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కలకలానికి కారణమైన ఉద్యోగుల ఫిర్యాదుపై సెబీ స్పందించింది. కంపెనీ సీఈవో, సీఎఫ్‌వోపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తును మొదలుపెట్టినట్లు ఆంగ్ల పత్రిక బిజినెస్‌ స్టాండర్డ్‌ వెల్లడించింది. ఇప్పటికే ఫిర్యాదు చేసిన ఉద్యోగుల బృందం సెబీకి లేఖతోపాటు, కొన్ని వాయిస్‌ రికార్డులు, ఇ-మెయిల్స్‌ను ఆధారాలుగా పంపింది. ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో దీనిపై దర్యాప్తు అవసరమని సెబీ భావించింది. దీనిపై ప్రాథమిక దర్యాప్తునకు పరిశీలిస్తామని వెల్లడించినట్లు ఆ పత్రిక పేర్కొంది. 
ఇన్ఫీ ఇప్పటికే అమెరికాలోని నాస్‌డాక్‌లో కూడా నమోదై ఉండటంతో అక్కడికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజి కమిషన్‌(ఎస్‌ఈసీ)కు లేఖ అందింది. దీంతో సెబీ, ఎస్‌ఈసీలు ఇంటర్నెషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ సెక్యూరిటీ కమిషన్‌ మల్టీలాటరల్‌ మెమొరాండమ్‌ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ఈ రెండు సంస్థలు సంతకాలు చేశాయి. దీనిని వాడుకుంటే కేసు దర్యాప్తు విషయంలో ఇరు సంస్థలు సమన్వయం చేసుకోవచ్చు. అవసరమైతే ఎస్‌ఈసీ సాయం తీసుకొంటామని సెబీ అధికారులు చెబుతున్నారు. 
రంగంలోకి అమెరికా సంస్థ
ఐటీ దిగ్గజం ‘అనైతిక కార్యకలాపాలకు’ పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా మదుపర్లు పొందిన నష్టాలను రికవరీ చేసేందు కోసం ఆ దేశానికి చెందిన రోజెన్‌ లా ఫిమ్‌ దావా(క్లాస్‌ యాక్షన్‌ సూట్‌) సిద్ధం చేస్తోంది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌వైఎస్‌ఈ)లో ఇన్ఫీ షేర్లు ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. ‘ప్రజావేగు ఫిర్యాదు’లు అక్కడికీ చేరడంతో సోమవారం అమెరికాలో ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు కుప్పకూలిన విషయం విదితమే. దీంతో ఇన్ఫోసిస్‌ మదుపర్లు పొందిన నష్టాలను రికవరీ చేయించేందుకు ఒక క్లాస్‌ యాక్షన్‌ సూట్‌ను సిద్ధం చేస్తున్నట్లు అమెరికా కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 
ఆరోపణలు ఇవీ..
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ప్రధాన అధికారులపై ఉద్యోగులమని చెప్పుకుంటున్న గుర్తు తెలియని బృందం ఒకటి తీవ్ర ఆరోపణలు చేసింది. స్వల్పకాలంలో ఆదాయ, లాభాలను పెంచడం కోసం కంపెనీ సీఈఓ సలీల్‌ పరేఖ్‌, సీఎఫ్‌ఓ నీలాంజన్‌ రాయ్‌లు ‘అనైతిక కార్యకలాపాల’కు పాల్పడ్డారంటూ బోర్డుతో పాటు అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థకు ఆ బృందం లేఖ రాసింది. ఇటీవలి కొన్ని త్రైమాసికాలతో పాటు.. ప్రస్తుత త్రైమాసికంలోనూ అదే తరహా చర్యలు చేపట్టినట్లు సెప్టెంబరు 20 తేదీతో ఉన్న ఆ లేఖలో వారు ఆరోపించారు. ‘నైతిక ఉద్యోగులు’, ‘ప్రజావేగులు’గా తమకు తాము చెప్పుకున్న ఆ బృందం.. ఇందుకు సంబంధించి సాక్ష్యాలుగా పలు ఇమెయిళ్లు; వాయిస్‌రికార్డులు ఉన్నట్లు తెలిపింది. బోర్డు తక్షణం దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
లేఖలోని ఆరోపణలు..
* వీసా ఖర్చుల వంటి వాటిని పూర్తిగా గుర్తించరాదని గత త్రైమాసికంలో కంపెనీ కోరింది. అయితే ఆడిటర్‌ ససేమిరా అనడంతో.. ఆ విషయాన్ని వాయిదా వేశారు.
* ఈ త్రైమాసికంలోనూ ఎఫ్‌డీఆర్‌ కాంట్రాక్టుకు సంబంధించిన 50 మి. డాలర్ల చెల్లింపుల ఖాతాకు సంబంధించి కూడా ఖాతా ప్రమాణాలకు వ్యతిరేకంగా మాపై చాలా ఒత్తిడి తెచ్చారు. ఎందుకంటే వాటిని ఫలితాల్లో గుర్తిస్తే లాభాలు తగ్గి.. షేర్లపై ప్రభావం పడుతుంది.
* వెరిజోన్‌, ఇంటెల్‌, జపాన్‌లో కొన్ని జేవీల వంటి పెద్ద కాంట్రాక్టులు, ఏబీఎన్‌ ఆమ్రో కొనుగోలు.. వంటి వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఆడిటర్లకు, బోర్డుకు తెలియకుండా తొక్కిపట్టారు.
* పెద్ద స్థాయి ఒప్పందాలకు సంబంధించిన సమాచారాన్ని ఆడిటర్లకు చెప్పరాదని మాపై ఒత్తిడి తీసుకొచ్చారు. ‘బోర్డులో ఎవరూ వీటిని అర్థం చేసుకోలేరు.. షేర్ల ధరలు పెరిగినంత కాలం వాళ్లు సంతోషంగానే ఉంటార’ని సీఈఓ మాతో అన్నారు.
* గత కొన్ని త్రైమాసికాలుగా పలు భారీ ఒప్పందాలకు మార్జిన్లు చాలా తక్కువ(సున్నా)గా ఉన్నాయి. ఒప్పంద ప్రతిపాదనలు, మార్జిన్లు, బయటకు వెల్లడించని చెల్లింపు మొత్తాలు తదితరాల గురించి ఆడిటర్లను తనిఖీ చేయమని బోర్డు కోరాలి. ఎందుకంటే ఆడిటర్లకు మొత్తం సమాచారాన్ని వెల్లడించలేదు.
* విధానాల్లో మార్పు చేయడం ద్వారా ఎక్కువ లాభాలను చూపాలని సీఈఓ, సీఎఫ్‌ఓలు మమ్మల్ని కోరారు. దీని వల్ల స్వల్పకాల లాభాలు కనిపిస్తాయి. 20ఎఫ్‌లో కీలక సమాచారాన్ని వెల్లడించొద్దని వారు మమ్మల్ని కోరారు. మంచి, అసంపూర్తి సమాచారాన్నే మదుపర్లు, విశ్లేషకులతో పంచుకోవాలని సూచించారు.
* ఎవరైనా వారు చెప్పినట్లు వినకపోతే వారిని లీవులో పంపిస్తారు. లేదంటే పక్కనపెడతారు. చాలా మంది ఉద్యోగులు ఈ ఒత్తిడి భరించలేకే బయటకు వెళ్లారు.
* మా వద్ద వీటన్నిటికి సంబంధించిన వాయిస్‌ రికార్డులు, ఇమెయిళ్లు ఉన్నాయి. దర్యాప్తు సమయంలో వాటిని బట్టబయలు చేస్తాం.
అమెరికాకు చెందిన విజిల్‌బ్రోవర్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రామ్‌కు కూడా ఈ ‘ప్రజావేగులు’ అక్టోబరు 3నే ఫిర్యాదు చేశారు. గత రెండు త్రైమాసికాలుగా ఉద్దేశపూర్వక తప్పుడు ప్రకటనలు, ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లు అందులో పేర్కొన్నారు.

పూర్తి స్థాయి దర్యాప్తు: ఛైర్మన్‌
మరో పక్క, సీఈఓ సలీల్‌ పరేఖ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఖాతాల విషయంలో అవకతవకలకు పాల్పడడం ద్వారా లాభాలను ఎక్కువ చేసి చూపి, ‘అనైతిక కర్యాకలాపాలు’ పాల్పడ్డారని సీఈఓ సలీల్‌ పరేఖ్‌పై ‘నైతిక ఉద్యోగుల’ బృందం ఒకటి  కంపెనీ బోర్డుకు లేఖ రాసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే.. పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతున్నట్లు సంస్థ ఛైర్మన్‌, సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం సెలవు అనంతరం మంగళవారం ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లో ఇన్ఫీ షేరు ఒక రోజులోనే రూ.127.90 కోల్పోయింది.

భారీ స్థాయి కాంట్రాక్టుల నుంచి ఆదాయాలను గుర్తించే విషయంలో ఖాతా ప్రమాణాలకు విరుద్ధంగా నడుచుకోవాలని పరేఖ్‌, సీఎఫ్‌ఓ నీలాంజన్‌ రాయ్‌ తమపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సెప్టెంబరు 20 తేదీతో ‘నైతిక ఉద్యోగుల’ పేరిట ఒక లేఖ బోర్డుకు వెళ్లింది. అవకతవకలకు సంబంధించిన ఇ-మెయిళ్లు, కాల్‌ రికార్డులు తమ వద్ద ఉన్నట్లు తెలిపారు. 
ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారమిదీ..
సెప్టెంబరు 20 తేదీతో సెప్టెంబరు 30 తేదీన ఒక బోర్డు సభ్యుడికి రెండు గుర్తు తెలియని ఫిర్యాదులు అందాయని.. ‘కలతపెడుతున్న అనైతిక చర్యలు’ , ‘ప్రజా వేగు ఫిర్యాదు’ శీర్షికలతో అవి ఉన్నాయని ఆయన వివరించారు. ఈ రెండింటిని అక్టోబరు 10, 2019న ఆడిట్‌ కమిటీ ముందు; ఆ తర్వాతి రోజు నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుల ముందు ఉంచినట్లు తెలిపారు. అక్టోబరు 11, 2019 నాటి బోర్డు సమావేశానంతరం స్వతంత్ర ఆడిటర్‌ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌(ఈవై)తో ఆడిట్‌ కమిటీ చర్చలు జరిపి స్వతంత్ర సంస్థ అయిన శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ అండ్‌ కోకు స్వతంత్ర దర్యాప్తు పనులు అప్పగించినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు నీలేకని సమాచారం అందించారు. దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలపై ఆడిట్‌ కమిటీతో చర్చించి బోర్డు చర్యలు చేపడుతుందని వివరించారు. కాగా, వాషింగ్టన్‌ డీసీలోని ‘ఆఫీస్‌ ఆఫ్‌ విజిల్‌బ్లోవర్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రామ్‌’కు సైతం అక్టోబరు 3 తేదీతో ఒక లేఖ వెళ్లినట్లు తమకు తెలిసిందని నీలేకని స్పష్టం చేశారు.
 ‘సీఈఓ, సీఎఫ్‌ఓలను దూరం పెడతాం’

కాగా, ‘ఫిర్యాదులకు సంబంధించిన ఎటువంటి ఇమెయిళ్లు, వాయిస్‌ రికార్డులు మాకు అందనప్పటికీ.. ఈ ఫిర్యాదులపై పూర్తి స్థాయిలోనే దర్యాప్తు చేస్తాం. దర్యాప్తు స్వతంత్రతను కాపాడడం కోసం సీఈఓ, సీఎఫ్‌ఓలను ఈ అంశాలకు దూరంగా ఉంచనున్నామ’ని నీలేకని తెలిపారు. ఇన్ఫోసిస్‌కు చట్టబద్ధ ఆడిటర్లయిన డెలాయిట్‌ ఇండియాకు ఈ అంశంపై మొత్తం సమాచారాన్ని అక్టోబరు 11 నాటి సమావేశానంతరం అందజేశామని నీలేకని వెల్లడించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.