close

తాజా వార్తలు

దర్శక, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు, నిర్మాత, తెలుగు సినీ పరిశ్రమకు పలు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన విజయ బాపినీడు కన్నుమూశారు. అనారోగ్య కారణంతో ఆయన ఈ ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. చిత్రపరిశ్రమలో విజయబాపినీడుగా సుపరిచితమైన ఆయన 1936 సెప్టెంబర్‌ 22న ఏలూరు సమీపంలోని చాటపర్రులో జన్మించారు. ఏలూరులోని సీఆర్‌ఆర్‌ కళాశాలలో బీఏ వరకు చదివి కొంతకాలం వైద్యారోగ్య శాఖలో పనిచేశారు. గుత్తా బాపినీడు పేరుతో పలు రచనలు చేశారు. మద్రాస్‌లో బొమ్మరిల్లు, విజయ పత్రికలను సంపాదకుడిగా ఆయన వ్యవహరించారు.

మొత్తం 22 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్‌ బాబు చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు. గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇండియన్‌ ఫిల్మ్‌, నీలిమ పత్రికలకు సంపాదకునిగానూ వ్యవహరించారు. నటుడు కృష్ణతో కృష్ణ గారడీ, రాజేంద్ర ప్రసాద్‌తో వాలు జడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశారు.

చంద్రబాబు, కేసీఆర్‌ సంతాపం

విజయ బాపినీడు మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పలు పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ఉత్తమ అభిరుచితో కుటుంబ కథా చిత్రాలను నిర్మించిన కొద్దిమంది నిర్మాతల్లో ఆయన ఒకరని అన్నారు. బాపినీడు కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన సానుభూతి తెలియజేశారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని బాపినీడు తన ఇంటి పేరుగా మార్చుకున్నారని.. తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ చెరగని ముద్ర వేశారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. బాపినీడు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 

గురువారం అంత్యక్రియలు

విజయ బాపినీడు అంతక్రియలు గురువారం హైదరాబాద్ మహా ప్రస్థానంలో నిర్వహిస్తారు. అమెరికాలో ఉన్న ఆయన పెద్ద కుమార్తె రావడానికి సమయం పడుతున్న కారణంగా అంత్యక్రియలు గురువారం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.