close

తాజా వార్తలు

ఈ ఎన్నికల్లో పోటీ చేయని హేమాహేమీలు వీళ్లే 

 ‘హసన్‌ నియోజవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే అది జేడీఎస్‌కే సాధ్యం. నాకు ఓటేయండి’ అని మాజీ ప్రధాని హెడ్‌.డి దేవెగౌడ ఓటర్లను కోరరు. ‘ఈ సారి లోక్‌ సభ ఎన్నికల్లో నన్ను దీవించండి’ అని శరద్‌ పవార్‌ మాదా ప్రజలను అభ్యర్థించరు. ఎందుకంటే వీళ్లు ఈ లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ ముగ్గురే కాదు ఈ లోక్‌ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్న హేమాహేమీలు ఇంకా ఉన్నారు. 

మన్మోహన్‌ సింగ్‌

మన్మోహన్‌ సింగ్‌ అంటే మొదటగా గుర్తొచ్చేది ఆయనో మంచి ఆర్థిక వేత్త అని. అలాంటి వ్యక్తి యూపీఏ హయాంలో ఏకంగా రెండు దఫాలు భారత ప్రధానిగా ఉన్నారు. వరుసగా పదేళ్ల పాటు ప్రధాని హోదాలో ఉన్న అతి కొద్ది మంది ప్రధానుల్లో మన్మోహన్‌ ఒకరు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా పదవి చేపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆర్థిక మంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. 1999లో దక్షిణ దిల్లీ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2004లో జరిగిన 14వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించడంతో మన్మోహన్‌ తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టారు. ఆ తర్వాత 2014 వరకు ఆయన ప్రధానిగా ఉన్నారు. దాదాపు 28 ఏళ్ల పాటు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ ప్రకటించారు.

 హెచ్‌.డీ దేవెగౌడ..

1953లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిన దేవెగౌడ గత సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రెండేళ్ల పాటు 11వ భారత ప్రధానిగా ఈయన కొనసాగారు. రాజకీయ ప్రవేశం తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఈయనకు దాదాపు దశాబ్ద కాలం పట్టింది.  కర్ణాటకలోని హోళెనరసిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1962లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి 1989వరకు ఆరు సార్లు  అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అధికార పక్షానికి సవాలుగా మారారు. 1994-96వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1996-97వరకు ప్రధానిగా పనిచేశారు. 1991నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం జనతా దళ్‌ సెక్యులర్‌ జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న గౌడ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తన హసన్‌ లోక్‌సభ స్థానాన్ని మనవడు ప్రజ్వల్‌కు ఇస్తున్నట్లు తెలిపారు.

 శరద్‌ పవార్‌

కొత్త తరానికి అవకాశం ఇవ్వడానికి తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్ వారం రోజుల క్రితం ప్రకటించారు. 1967లో తొలిసారిగా మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగిడిన పవార్‌..అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో కీలక పదవులను అధిరోహించారు. బారామతి నియోజకవర్గం నుంచి దాదాపు 11 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగారు. అనంతరం 1978లో తొలిసారిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలందించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మాదా నియోజక వర్గం నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. 

రజినీ కాంత్‌..

తమిళనాట సూపర్‌ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న రజినీ కాంత్‌ ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఈయనకు రాజకీయానుభవం లేకపోయినప్పటికీ దేశ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారే అవకాశాలున్నట్లు రాజకీయ పండితులు అభిప్రాయపడ్డారు. ఈయన ఇప్పటివరకు తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించలేదు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రజినీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఈ ఎన్నికల్లో పోటీ చేయనని కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే బరిలోకి దిగుతానని స్వయంగా స్పష్టం చేశారు. 

 సుష్మా స్వరాజ్‌ 

 నిలువెత్తు ఆత్మ స్థైర్యానికి, ముక్కుసూటి తనానికి మారుపేరైన సుష్మా స్వరాజ్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేసేది లేదంటూ గతేడాది ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి పదవీ విరమణ తీసుకోవట్లేదని ఈ ఎన్నికలకు మాత్రమే రిటైర్‌మెంట్‌ ప్రకటించానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళా మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారీ సుప్రీం కోర్టు మాజీ న్యాయవాది.1970ల్లోనే ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు.

 

మాయావతి

దేశంలోని శక్తిమంతమైన మహిళా రాజకీయ నేతల్లో మాయావతి ఒకరు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రిగా కొనసాగుతున్న మాయా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోరని ఆ పార్టీ ప్రతినిధి పేర్కొన్నారు. విపక్షాల కూటమిలో ప్రధాని అభ్యర్థిగా మాయావతి పేరు వినిపిస్తోంది. దీనికి తోడు రెండు రోజుల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. మాయను ప్రధానిగా చూడాలని ఉందని పేర్కొన్నారు.1984లో తొలిసారి రాజకీయాల్లోకి ప్రవేశించిన మాయ..అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగారు.


ఉమాభారతి

గ్వాలియర్‌ రాజమాత విజయ రాజే సింధియా ప్రోత్సాహంతో ఉమాభారతి భారతీయ జనతా పార్టీలోకి అడుగు పెట్టారు.1984లో తొలిసారిగా ఆమె లోక్‌ సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఎల్‌కే అడ్వాణీతో పాటు రామ్‌ జన్మభూమి పోరాటంలో కీలక పాత్ర పోషించడంతో సంఘ్‌పరివార్‌లో ముఖ్య నేతగా ఎదిగారు. అనంతరం 2003లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతి భాజపా 173 సీట్లు సంపాదించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. పదేళ్ల తర్వాత 2014లో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఝాన్సీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఎన్డీయే ప్రభుత్వంలో ఈమెకు జలవనరుల శాఖ మంత్రి పదవి దక్కింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని భారతి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.