close

తాజా వార్తలు

అలాగైతే సినిమా చేస్తానని బాలకృష్ణతో చెప్పా

మా మధ్య గొడవేమీ లేదు: వర్మ

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా ప్రచారంలో భాగంగా వర్మ శుక్రవారం విలేకర్లతో ముచ్చటించారు. తన సినిమా విశేషాలు పంచుకున్నారు.

సమస్యలేమీ రావు
‘తొలి విడత ఎన్నికలు పూర్తయ్యే వరకు మా సినిమాని సెన్సార్‌ బోర్డు పరిశీలించదనే సమాచారం నాకు అందింది. అందుకే సెన్సార్‌ బోర్డుపై కోర్టుకెళతాం అన్నాను. కానీ నా దగ్గరికొచ్చిన ఆ సమాచారం తప్పని ఆ తర్వాత తెలిసింది. సినిమాపై కోర్టులో ఉన్న కేసులు తొలగిపోయాయి. సెన్సార్‌ పరంగా కూడా సమస్యలేమీ రావు. ఎలాంటి సన్నివేశాలుంటే సెన్సార్‌ సమస్యలొస్తాయో అలాంటి వేవీ లేకుండా సినిమా తీశాం’.

అవి అంతర్భాగంగా ఉంటాయి
 ‘ఎన్టీఆర్‌ జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చాక ఏర్పడిన పర్యవసనాలు ఎలాంటివన్నది ఈ సినిమాలో చూడొచ్చు. ఎన్టీఆర్‌-లక్ష్మీపార్వతిల బంధం, చివరి రోజుల్లో ఎన్టీఆర్‌ మానసికంగా ఎదుర్కొన్న క్షోభతోపాటు, కుట్రలు.. ఆ మూడూ ఈ సినిమాలో అంతర్భాగంగా ఉంటాయి’.

మా మధ్య గొడవేమీ లేదు
‘ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీస్తున్నప్పుడు ఈ అంశం (లక్ష్మీపార్వతితో బంధం) లేకపోతే.. అందులో ఒక కథకి కావల్సిన భావోద్వేగాలు, సంఘర్షణ అంటూ ఏమీ ఉండవు. అందుకే అది ఉంటేనే సినిమా చేస్తానని బాలకృష్ణతో చెప్పా. ఆయన స్ట్రెయిట్‌ లైన్‌లో సినిమా చేస్తేనే బాగుంటుందన్నారు. అంతే తప్ప మా మధ్య గొడవేమీ లేదు’.

చెప్పుకోదగ్గ బాధలేమీ లేవు
‘70 ఏళ్ల వరకు కూడా ఎన్టీఆర్‌ జీవితంలో చెప్పుకోదగ్గ బాధలేమీ లేవు. ‘పల్లెటూరి పిల్ల’ నుంచి ఆయన తిరుగులేని విజయాలు సాధిస్తూ... స్టార్‌గా ఎదిగారు. వారి అబ్బాయి మరణం తప్పిస్తే.. ఎన్టీఆర్‌కి ఇలాంటి కష్టాలు వచ్చాయట అని వినిందంటూ లేదు. తెలుగుదేశం పార్టీని స్థాపించాక కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించారు. ఆ తర్వాత ఎదురైన నాదెండ్ల భాస్కరరావు సంఘటన నుంచి కూడా త్వరగానే బయటపడ్డారు. లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి వచ్చాక మాత్రం అనేక సంక్షోభాల్ని ఎదుర్కొన్నారు. అందుకే 1989లో ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగు పెట్టినప్పట్నుంచి, ఆయన మరణించేవరకు జరిగిన సంఘర్షణనే ఈ చిత్రం కోసం ఎంచుకున్నా’.

అదే తెరపైకి తీసుకొచ్చా
‘ఈ సినిమా కోసం 30, 40 మందిని కలిశా. అప్పట్లో బహిరంగంగా చెప్పిన విషయాల్నీ, రాసిన పుస్తకాల్ని చాలా చదివాను. లైమ్‌లైట్‌లో లేనివాళ్లనే ఎక్కువగా సంప్రదించి సమాచారం సేకరించాను. ఎవరిని కలిసినా ఎవరికివాళ్లు అనుకూలంగా చెప్పే అవకాశముంది. అందుకే అన్ని విషయాల్నీ సేకరించి, ఏది నమ్మగలిగేలా అనిపించిందో అదే తెరపైకి తీసుకొచ్చా’.

ఆపడం ఎవ్వరివల్లా కాదు
‘నేను ఎవరి సలహాలు వినేవాణ్ని కాదు. న్యాయం, ప్రజాస్వామ్యం కోణంలో ఆలోచించి, అన్ని విషయాల్నీ అర్థం చేసుకొని ఈ సినిమా చేశా. ఈ సినిమాని ఆపాలని కోర్టులో కేసు వేయడం, ఆమధ్య యూట్యూబ్‌లో ‘దగా..’ పాటని తీసివేయాలని కోరడం మినహాయిస్తే మిగతా హెచ్చరికలు, ఒత్తిళ్లన్నీ కూడా ఛైల్డిష్‌గా అనిపించాయి. ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నాం. ఈ సినిమా విడుదలని ఆపడం ఎవ్వరివల్లా కాదు. ఆ విషయంలో నా నమ్మకం ఏంటంటే చంద్రబాబు నాయుడు. ఆయన ఒక ముఖ్యమంత్రి. శాంతిభద్రతల్ని కాపాడి, రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఆయనే దగ్గరుండి ఈ సినిమాని విడుదల చేయిస్తారని నా నమ్మకం’.

అందుకే బాలకృష్ణకి అంకితం చేస్తున్నానని చెప్పా
‘ఈ చిత్ర నిర్మాత వైకాపాకి చెందిన వ్యక్తి అని నాకు ముందు తెలియదు. తెలిసినా చేయనని మాత్రం చెప్పేవాణ్ని కాదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమనేది అత్యంత సహజం. కానీ ఒక దర్శకుడిగా నేను 25 ఏళ్ల కిందట జరిగిన, అందరికీ తెలిసిన కథే చెప్పాను. నిర్మాత ఏ పార్టీకి చెందిన వ్యక్తి, నేను ఏ కోణంలో సినిమా చేశాననే విషయానికి సంబంధమే లేదు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ గురించి బాలకృష్ణ నన్ను కలిశారు. ఆయన పరిచయం చేసిన కొద్దిమంది వ్యక్తుల నుంచి కొంత సమాచారం సేకరించాక, అక్కడ్నుంచి మరింత లోతుగా వెళ్లిపోయింది. అందుకే ఈ సినిమాని బాలకృష్ణకి అంకితం చేస్తున్నానని చెప్పా. ఆయన లేకపోయుంటే ఈ సినిమా వచ్చుండేది కాదు’.

బాలకృష్ణ మిమ్మల్ని కలవలేదని చెబుతున్నారని ప్రశ్నించగా.. 
‘ఆయనైనా అబద్ధం చెబుతుండొచ్చు, నేనైనా అబద్ధం చెబుతుండొచ్చు. ఏది నిజం అన్నది ఎప్పుడూ ఎవ్వరికీ తెలియడానికి ఆస్కారం ఉండదు. అందుకే మీరు నమ్మిందే నిజమనుకోండి’.

ఎన్టీఆర్‌ బయోపిక్‌పై మీ అభిప్రాయం..
‘‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చూశాను. కానీ ఎందుకు విజయవంతం కాలేదని చెప్పేంత సమర్థత నాకు లేదు. నా ఉద్దేశం ప్రకారం బయోపిక్‌ తీస్తున్నప్పుడు భావోద్వేగంతో కూడిన సంఘర్షణ లేకుండా, సన్నివేశాల్ని పేర్చుకుంటూ వెళ్లినట్టు అనిపించింది. దానివల్లే ఆడలేదని మాత్రం చెప్పలేను’.

ఎన్టీఆర్‌ పాత్ర కోసం కొత్త నటుడ్ని ఎంపిక చేసుకోవడానికి కారణం ప్రశ్నించగా..
‘ఒక వాస్తవికతతో కూడిన పాత్రని తెరపై చూపిస్తున్నప్పుడు.. అందులో కొత్త నటుడైతేనే ప్రేక్షకుడు నమ్ముతాడని నా అభిప్రాయం. అందుకే ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’,  ‘వంగవీటి’ చిత్రాల్లో కూడా కొత్తవాళ్లని ఎంపిక చేసుకొన్నా. విజయ్‌ కుమార్‌ (ఎన్టీఆర్‌ పాత్ర చేసిన నటుడు) రెండు నెలలు శిక్షణ పొంది, ఈ సినిమా చేశారు’.

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలుస్తారని అడగగా..
‘నేను జ్యోతిష్యుడిని కాదు. ఎవ్వరు వచ్చినా నాపై ప్రభావం ఏమీ ఉండదు, అసలేం మారదని నా ఉద్దేశం. ఏదైనా ఒక దశలో మారుతుంది కానీ, ప్రత్యేకంగా ఒక ప్రభుత్వంతో ఏదీ మారదు. ముఖ్యమంత్రిగా నా ఎంపికైతే ఒకరు పవన్‌కల్యాణ్‌, మరొకరు కె.ఎ.పాల్‌. పవన్‌కల్యాణ్‌ అందంగా ఉంటాడు కాబట్టి పేపర్‌ తీసినప్పుడు సినిమా పేజీ వరకు వెళ్లకుండా మొదటి పేజీలోనే చూడొచ్చు. ఇక కె.ఎ.పాల్‌ ముఖ్యమంత్రి అయితే కామెడీ సినిమాల కోసం రూ. వంద రెండొందలు పెట్టేబదులు రోజూ కామెడీని ఆస్వాదించొచ్చు’.

కేసీఆర్‌ బయోపిక్‌ తీస్తానని చెప్పారుగా అని ప్రశ్నించగా..
‘ఆ ఆలోచన ఉంది. దానిపై ఇంకా పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేదు. నేను ముంబైలో ఉన్నప్పుడు కె.ఎ.పాల్‌ బయోపిక్‌ తీయమని వచ్చారు. 60 వేల ఏళ్ల కిందట నుంచి మనిషి ఉన్నాడట. నా ఉద్దేశంలో అప్పట్నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కె.ఎ.పాల్‌ కంటే అబద్ధాలు చెప్పిన మరొక వ్యక్తి పుట్టుండడని నా నమ్మకం. ఆ అబద్ధాలు విని ఉద్వేగం ఆపుకోలేక ఆయన కాళ్లు పట్టుకొన్నా. కాళ్లు పట్టుకొన్నప్పుడు కిందపడి, తన మైండ్‌ అయినా సెట్‌ అవుతుందని నా ఆశ. కానీ మళ్లీ ఆయన జీసస్‌కి చెప్పి, నాపైన శాపం కురిపించి నరకానికి పంపిస్తాడనే భయంతో అలా ఆపేశా’.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.