close

తాజా వార్తలు

అలా ప్రపోజల్స్‌ వస్తున్నాయ్‌

తెలుగు సినిమాలతో ఎంతోమంది కథానాయికలుగా పరిచయమవుతుంటారు. వారిలో మన అమ్మాయిలాగే ఉందనిపించుకొనే భామలు అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి అమ్మాయే ప్రియాంక అరుల్‌ మోహన్‌. ఆమెను చూస్తే అచ్చమైన తెలుగమ్మాయనే అనుకుంటారు. నానీ ‘గ్యాంగ్‌లీడర్‌’తో పరిచయమైందీ ముద్దుగుమ్మ. అందం, అమాయకత్వం, సహజత్వం ఆమె నటనలో ఒదిగిపోయాయి. ఈ సందర్భంగా ఆమెని ‘హాయ్‌’ పలకరించగా చెప్పిన విషయాలివీ...

తొలి సినిమాకే తెలుగు నేర్చుకున్నారు. ఎలా సాధ్యమైంది?
నేర్చుకోవడమే కాదు, నా పాత్రకి డబ్బింగ్‌ నేనే చెప్పుకొన్నా. తెలుగు నాకు ముందే వచ్చు.. అయితే పూర్తి పట్టు లేదు. నేను బెంగళూరులో చదువుకున్నా. హైదరాబాద్‌లో మా బంధువులు ఉన్నారు, ఇక్కడికొచ్చినప్పుడంతా వాళ్లతో కలిసి తెలుగు సినిమాలు చూసేదాన్ని. అలా తెలుగు మాట్లాడటం వచ్చేసింది.

మీరు కన్నడ అమ్మాయా?
మా నాన్నది తమిళనాడు. మా అమ్మ కన్నడిగ. మా నాన్న తరఫు బంధువులంతా తమిళనాడులో, మా అమ్మ తరఫువాళ్లంతా బెంగళూరులో ఉంటారు. నేను పెరిగింది, చదివిందంతా బెంగళూరులోనే. ఇప్పుడైతే చెన్నైలో ఉంటున్నా.

మీ కుటుంబానికి సినిమా నేపథ్యం ఉందా?
వాళ్లకి సినిమా పరిశ్రమతో సంబంధమే లేదు.  అమ్మానాన్నలు ఐటీ రంగంలో ఉన్నారు. నేను చదువుకొనేటప్పుడు థియేటర్స్‌ ఆర్ట్స్‌లో చురుగ్గా వ్యవహరించేదాన్ని. అలా నటనపై మక్కువ పెరిగింది. అదే చిత్ర పరిశ్రమకి రావడానికి దారితీసింది.

ఈ రంగంలోకి వస్తానన్నప్పుడు ఇంట్లోవాళ్లు ఎలా స్పందించారు?
బయో టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ చేశాను. ఆ తర్వాత ఎమ్‌.ఎస్‌ చేయాలని ఉండేది. ఇంజినీరింగ్‌ చేస్తున్నప్పుడే నాకు సినిమా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అక్కడే నా జీవితం మలుపు తిరిగింది. చిత్ర పరిశ్రమకి నేను నచ్చాను, అవకాశాలు వస్తున్నాయి... అలాంటప్పుడు ఎందుకు ప్రయత్నించకూడదు? అనిపించింది. అలా మొదట కన్నడలో అతిథి పాత్ర  చేశా. ఆ తర్వాత ‘గ్యాంగ్‌ లీడర్‌’లో అవకాశం అందుకొన్నా.

‘గ్యాంగ్‌ లీడర్‌’ వేడుకలో చాలా కష్టాలు ఎదుర్కొని వచ్చానని చెప్పారు. కథానాయికగా మీకెలాంటి కష్టాలు ఎదురయ్యాయి?
కష్టాలంటే అవి అందరికీ ఉండేవే. ఎవరి జీవితమైనా రాత్రికి రాత్రే మారిపోదు కదా. సరైన సమయం, అవకాశం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఆ ప్రయాణం కష్టంగా అనిపిస్తుంటుంది. ‘గ్యాంగ్‌ లీడర్‌’ రాగానే ఇదే నాకు సరైన అవకాశం అనిపించింది.

చిన్నప్పుడు సినిమా కలలు కనేవారా?
సినిమాల్ని బాగా చూసేదాన్ని. తెరపై కథానాయికలు కనిపిస్తున్నప్పుడు ఒక ఆరాధన భావం కలిగేది. అంతే కానీ... నేను కథానాయికని కావాలని ఎప్పుడూ అనిపించేది కాదు. అయితే ఒక్కసారైనా తెరపై కనిపించే అవకాశం వస్తే బాగుండని అనిపించేదంతే. డ్రామాల్లో నటిస్తున్నప్పుడూ సినిమా కెరీర్‌ గురించి అంత ఆలోచన ఉండేది కాదు.

సినిమాలోలాగా, మీ వ్యక్తిగత జీవితంలో గ్యాంగ్‌ ఏమైనా ఉందా?
నాకు స్నేహితులు తక్కువే. అలాగని చదువులో టాప్‌ విద్యార్థినేమీ కాను.  అల్లరి పనులకి ఆమడ దూరం. కొన్నేళ్లు హాస్టల్‌లో ఉన్నా. మా అమ్మానాన్నలకి ఒక్క అమ్మాయినే అయినా.. వాళ్లెప్పుడూ నన్ను గారాబం చేయలేదు. మధ్య తరగతి జీవితాన్ని అలవాటు చేస్తూనే పెంచారు. నాకు సౌకర్యంగా అనిపిస్తేనే ఎవరితోనైనా స్నేహం చేసేదాన్ని. ఇంజినీరింగ్‌ చేసేటప్పుడు నాకొక బ్యాచ్‌ ఉండేది. అందులో నలుగురం ఉండేవాళ్లం. వాళ్లంతా ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. నేను కథానాయికని అయ్యానని తెలిశాక చాలా సంతోషించారు.

సినిమాలోనేనా... నిజ జీవితంలోనూ మీరు అమాయకంగానే ఉంటారా?
తెరపై కనిపించేది అచ్చంగా నేనే. దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ నన్నే నాకు తెరపైన చూపించారు. నిజ జీవితంలోనూ నేనంతే. చాలా తక్కువగా మాట్లాడుతుంటా. ప్రేమ, బాధని దిగమింగుకుంటూ కనిపించే సన్నివేశాల్లో దర్శకుడి సలహాల్ని పాటించాను. ఆయన మనసులో ఏమనుకొంటే అది నటుల నుంచి రాబడుతుంటారు.

నానితో కలిసి నటిస్తున్నప్పుడు సెట్‌లో వాతావరణం ఎలా ఉండేది?
నాని చాలా స్నేహంగా ఉంటారు. అప్పుడప్పుడు ఆట పట్టిస్తుంటారు.  నానికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. మా గ్యాంగ్‌లో చిన్న పాప ఉంటుంది కాబట్టి, తనతో మేమంతా ఆడుకొనేవాళ్లం. లక్ష్మి మేడమ్‌, శరణ్య మేడమ్‌ చిన్న పిల్లలుగా మారిపోయేవాళ్లు. నానిని నేచురల్‌ స్టార్‌ అని ఎందుకంటారో సెట్‌లో ఉన్నప్పుడు బాగా అర్థమైంది.

సినిమా విడుదల తర్వాత మీకు వచ్చిన మంచి ప్రశంస...?
మన ఇంటి అమ్మాయి అనీ, నాకు పెళ్లాం అంటూ వస్తే ఇలాగే రావాలనీ... ఇలా రకరకాల మీమ్స్‌తో సామాజిక మాధ్యమాల్లో నన్ను మెచ్చుకుంటున్న కొన్ని సందేశాలు చూసి చాలా ఆనందం కలిగింది. పెళ్లి ప్రపోజల్స్‌తో కొన్ని సందేశాలు వచ్చాయి (నవ్వుతూ). వాళ్లకి నేను ఎంత బాగా కనెక్ట్‌ అయ్యానో చెప్పే సందేశాలు అవి.  వాటిని చూస్తే చాలా ఆనందం కలిగింది.

వ్యక్తిగతంగా మీకు ఎలాంటి సినిమాలంటే ఇష్టం?
నీట్‌గా సాగే కథ ఉంటే చాలు. ఇంకేమీ అవసరం లేదు. ఏ జోనర్‌ అయినా పట్టించుకోను. నేను అమాయకంగా, ప్రేమకథలకి తగ్గట్టుగా కనిపించినా... కామెడీ బాగా చేయగలను. ‘గ్యాంగ్‌ లీడర్‌’ తరహాలోనే నేను సీరియస్‌గా కనిపించాలి, కానీ ప్రేక్షకులు నవ్వుకోవాలి. అలాంటి సినిమాలంటే చాలా ఇష్టం.

కొత్తగా అవకాశాలు వచ్చాయా?
ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి ‘శ్రీకారం’లో నటిస్తున్నా.

ఏదో ఉందన్నారు

‘‘మొదట ‘గ్యాంగ్‌ లీడర్‌’కి పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడు. విక్రమ్‌ నన్ను ఎంపిక చేసినా... ఫొటో షూట్‌ పీసీ ఆఫీసులోనే జరిగింది. అక్కడ పీసీ  నన్ను ఫొటో తీశారు. ‘ఈ అమ్మాయిలో ఏదో ఉంది, నేను కెమెరాని క్లిక్‌ చేయడం ఆపలేకపోతున్నా’ అని దర్శకుడితో అన్నారట. ఆ మాట తర్వాత చెప్పారు అక్కడున్నవాళ్లు. అది నాకు గొప్ప కాంప్లిమెంట్‌ అనిపించింది. ఈ అవకాశం వస్తుందో రాదో తెలియదు, కనీసం పీసీ శ్రీరామ్‌ని అయినా చూస్తాను కదా అని ఫొటోషూట్‌కి వెళ్లిన నేను, ఆయన ఫొటో తీయడంతో ఇంక ఇంతకంటే ఏం కావాలి అనిపించింది. ఆ తర్వాత సినిమాలో నేనే నటించా. పీసీ శ్రీరామ్‌ సినిమా చేయలేదు కానీ, ఆయన నా ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో పాటు, విడుదల సమయంలో ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు’’.
‘‘ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూశా. నేను ఈలోకంలోనే ఉన్నానా? ఇదంతా నిజమా అనిపించింది. నేను తెరపై కనిపిస్తున్నప్పుడు, డైలాగులు చెబుతున్నప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం, నవ్వుకోవడం ఒక కొత్త అనుభూతినిచ్చింది’’.
‘‘సంగీతం అంటే ఇష్టం. సినిమాలు బాగా చూస్తా. ప్రయాణాలు, కొత్త రుచుల్ని ఆస్వాదించడం అంటే ఇంకా ఇష్టం. కథానాయికల్లో స్ఫూర్తి అంటూ ఏమీ లేదు కానీ... నిత్యామేనన్‌, అనుష్క, నజిరియాల్ని చూసినప్పుడు ఒక కనెక్షన్‌ ఉన్నట్టు అనిపిస్తుంది’’.
- నర్సిమ్‌ ఎర్రకోట
ఫొటోలు: మధు

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.