close

తాజా వార్తలు

జయవర్ధనే మాటలు ఆశ్చర్యపరిచాయి: మాథ్యుస్‌

ప్రపంచకప్‌ నేపథ్యంలో శ్రీలంక ఆటగాళ్లకి సలహాలు

లండన్‌: శ్రీలంక లెజెండరీ బ్యాట్స్‌మన్‌ మహేలా జయవర్ధనే చేసిన వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించాయని, అయితే వాటిని పట్టించుకోనని అంటున్నాడు ఆ జట్టు మాజీ కెప్టెన్‌ ఏంజిలో మాథ్యుస్‌. ప్రపంచకప్‌లో తమ జట్టు ప్రదర్శనే ముఖ్యమని అందుకు జయవర్ధనే తన అనుభవం రిత్యా జట్టు విజయానికి కృషి చేయాలని కోరాడు. అసలేం జరిగిందంటే.. 2015లో జయవర్ధనే రిటైరయ్యాక శ్రీలంక కెప్టెన్‌ స్థానం కూర్చీలాటగా మారిన విషయం తెలిసిందే. 

చండిమాల్‌, తిసెరా పెరీరా, లసిత్‌ మలింగ, చమర కపుగెదరా చివరగా దిముత్‌ కరునరత్నే ఆ జట్టు పగ్గాలు చేపట్టినా శ్రీలంక వన్డేల్లో తన పూర్వ వైభవాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలోనే జయవర్ధనే ఆదివారం మాట్లాడుతూ.. శ్రీలంక మాజీ కెప్టెన్లు ఏంజిలో మాథ్యుస్‌, దినేశ్‌ చండిమాల్‌లను తీవ్రస్థాయిలో విమర్శించాడు. వారిద్దరూ క్రికెట్‌ రాజకీయాలకు బాధితులయ్యారని వ్యాఖ్యలు చేశాడు. దీనికి స్పందించిన మాథ్యుస్‌.. ‘ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. అలాగే జయవర్ధనే కూడా. ఆయన వ్యాఖ్యాలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అయినా వాటిని పట్టించుకోను. ప్రపంచకప్‌లో మా జట్టు ప్రదర్శనే నా ముఖ్యం. కాబట్టి జయవర్ధనే జట్టు విజయానికి కృషి చేసి తన అనుభవాన్ని పంచుకోవాలి. జట్టుకి విలువైన సూచనలు చేసి ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన చేసేలా ముందుకురావాలి’ అని ట్విటర్‌లో పేర్కొన్నాడు.

అలాగే ప్రపంచకప్‌ నేపథ్యంలో శ్రీలంక ఆటగాళ్లకూ మాథ్యుస్‌ విలువైన సలహాలు ఇచ్చాడు. ఐసీసీతో ఆయన పేర్కొన్న సమాచారం ప్రకారం.. ప్రపంచకప్‌లాంటి పెద్ద ఈవెంట్లలో ఒత్తిడికి గురవకుండా స్వచ్ఛగా ఆడి, మంచి ఫలితాలు సాధించాలని చెప్పాడు. ఒత్తిడికి గురైతే అది మరింత భారంగా మారుతుందని, దేశ ప్రయోజనాల కోసం స్వేచ్ఛగా ఆడేందుకు ఇదొక వేదికని తెలిపాడు. తమ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ పిచ్‌లకు కొత్త కాదని, చాలా మంది ఇదివరకు అక్కడ ఆడారన్నాడు. కాబట్టి ఇంగ్లాండ్‌లోని పరిస్థితులు ఎలా ఉంటాయో శ్రీలంక ఆటగాళ్లకి తెలుసని, ఒత్తిడిని జయించి పరిస్థితులకు తగ్గుట్టు ఆడటమే సవాల్‌గా మారుతుందని ఆయన స్పష్టంచేశాడు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.