close

తాజా వార్తలు

జగన్‌ మౌనం.. కుట్రలో భాగమే:అచ్చెన్నాయుడు

విజయవాడ: ‘ప్రజారాజధాని అమరావతి’ పేరిట గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సమావేశానికి 17 పార్టీలతో పాటు 22 విభాగాలు, సంఘాలకు ఆహ్వానం పంపామన్నారు. విజయవాడ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపద సృష్టి, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన అజెండాగా సమావేశం నిర్వహిస్తామని అచ్చెన్న వివరించారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. వైకాపా గెలుపు నిజమైన గెలుపు కాదనే భావన ప్రజల్లో ఉందని.. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పారు. అత్యంత ప్రాధాన్యం కలిగిన రాజధాని అమరావతిని వైకాపా చంపేసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాజధానిపై మంత్రులు తలోమాట మాట్లాడుతుంటే సీఎం జగన్‌ మౌనంగా ఉన్నారని.. ఆయన మౌనం కుట్రలో భాగమేనని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం వచ్చి 6నెలలు అవుతున్నా అమరావతిలో తట్టెడు మట్టి పని కూడా చేయలేదన్నారు. రాజధాని ఒకట్రెండు జిల్లాలకే అంటూ వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాజధాని ప్రాంతం రాష్ట్రానికి ఆదాయ వనరు అనే విషయాన్ని అధికార పార్టీ నేతలు గ్రహించాలని హితవు పలికారు.

పవన్‌పై మంత్రుల మూకుమ్మడి దాడి సరికాదు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంటే.. ఆయనపై మంత్రులు మూకుమ్మడిగా దాడి చేయడం సరికాదన్నారు. మంత్రులు ప్రతి విమర్శలతో తప్పించుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. మరోవైపు తెదేపా, భాజపా, జనసేన గతంలో పెట్టుకున్న పొత్తు అంశంలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు స్పందించారు. పొత్తుల గురించి తాము ఇప్పుడు ఆలోచించడం లేదని.. ప్రస్తుతం పార్టీ దృష్టంతా రాష్ట్రాభివృద్ధిపైనే ఉందని స్పష్టం చేశారు. మూడు పార్టీలు మళ్లీ కలిసి పనిచేస్తే బాగుండేదన్న భావన ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతోందని ఆయన చెప్పారు. గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము భాజపాను వీడి బయటకొచ్చినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.