close

తాజా వార్తలు

ఐపీఎల్‌ 12 విజేత ముంబయి ఇండియన్స్‌

హైదరాబాద్‌: ఆహా..! ఏం ఫైనల్‌ ఇది! నరాలు తెగే ఉత్కంఠ! బంతి బంతికీ గుండె వేగం మరింత పెరిగింది. ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి. చివరి వరకు చెన్నై సూపర్‌కింగ్స్‌దే విజయమేమో అనిపించింది. కానీ బుమ్రా వచ్చిన ప్రతిసారీ మ్యాచ్‌ను ముంబయి వైపు మలుపుతిప్పాడు. ఆఖరి ఓవర్‌ను అద్భుతంగా విసిరి మలింగ తన అనుభం ఏంటో చాటిచెప్పాడు. చివరికి ముంబయి ఇండియన్స్‌ ‘మహాసేన’ ఐపీఎల్‌ 12 విజేతగా ఆవిర్భవించింది. పటిష్ఠ చెన్నై సూపర్‌ కింగ్స్‌పై పరుగు తేడాతో విజయం సాధించి నాలుగోసారి ఛాంపియన్‌గా అవతరించింది. రోహిత్‌ బౌలర్లను అత్యంత వ్యూహాత్మకంగా వినియోగించి తానెంత విలువైన సారథో మరోసారి అందరికీ నిరూపించాడు. ఈ సీజన్‌లో చెన్నైపై ముంబయికిది మూడో విజయం కావడం గమనార్హం.

కీరన్‌పొలార్డ్‌ (41*; 25 బంతుల్లో 3×4, 3×6), డికాక్‌(29; 17 బంతుల్లో 4×4), ఇషాన్‌ కిషన్‌ రాణించడంతో తొలుత ముంబయి 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. దీపక్‌ చాహర్‌ 3 వికెట్లతో చెలరేగాడు. చెన్నై బౌలర్లు  కీలక సమయాల్లో వికెట్లు తీసి రోహిత్‌ సేనను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. అయితే చెన్నై ఛేదన అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఆఖరి బంతి వరకు పోరాడింది.  షేన్‌ వాట్సన్‌ (80; 59 బంతుల్లో 8×4, 4×6) మరోసారి ఫైనల్లో తన ఆటతీరుతో అదరగొట్టాడు. ముంబయిని భయపెట్టాడు. డుప్లెసిస్‌ (26; 13 బంతుల్లో 3×4, 1×6) రాణించాడు. అయితే మహీ (15), రైనా (8) త్వరగా ఔటవ్వడం ముంబయి అవకాశాలను మెరుగుపరిచింది. చేజారిపోయిందుకున్న ప్రతిసారీ జస్ప్రీత్‌ బుమ్రా (2/14) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. రాహుల్‌ (1/14) పొదుపుగా బౌలింగ్‌ చేసి చెన్నైపై ఒత్తిడి పెంచాడు.

చెన్నై విజయానికి 18 బంతుల్లో 38 పరుగులు అవసరమైనప్పుడు  కృనాల్‌  వేసిన 18వ ఓవర్‌లో 20 పరుగులు రాబట్టారు వాట్సన్‌, బ్రావో. అయితే 19వ ఓవర్‌లో బుమ్రా మళ్లీ మాయ చేసి వికెట్‌ తీసి 9 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్‌లో 6 బంతుల్లో 9 పరుగులు కావాలి. 16వ ఓవర్‌లో మలింగ 20 పరుగులు ఇవ్వడంతో అతడికి రోహిత్‌ బంతి ఇస్తాడో లేదో అనుకున్నారు. చివరికి అతడికే బంతిని అప్పగించాడు. మూడు బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి వాట్సన్‌ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. చివరి బంతికి శార్దూల్‌ను ఎల్బీ చేయడంతో చెన్నై 147/7కు పరిమితం అయింది. విజయం ముంబయిని వరించింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.