close

తాజా వార్తలు

చెన్నైకి రోజూ 900 లారీలతో తాగునీరు

●ప్రతిపక్షాల దుష్ప్రచారం అవాస్తవం

మంత్రి ఎస్పీ వేలుమణి వెల్లడి

మాట్లాడుతున్న ఎస్పీ వేలుమణి

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో చెన్నై మహా నగరానికి ప్రతిరోజు 900 లారీలతో తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు రాష్ట్ర స్థానిక స్వపరిపాలనశాఖ మంత్రి ఎస్పీ వేలుమణి పేర్కొన్నారు. తాగునీటి సమస్యపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, అందులో వాస్తవం లేదన్నారు. కోయంబత్తూరు జిల్లా అన్నాడీఎంకే నిర్వాహకుల సమావేశం కోయంబత్తూరులోని ఇదయదైవం మాళిగైలో శనివారం రాత్రి జరిగింది. మంత్రి ఎస్పీ వేలుమణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోయంబత్తూరు నగర జిల్లా నిర్వాహకులు, శివారు జిల్లా నిర్వాహకులు పాల్గొన్నారు. సమావేశం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై ఎస్పీ వేలుమణి విలేకరులతో మాట్లాడారు. చెన్నై జనాభా ప్రస్తుతం 74.38 లక్షలు కాగా 2016 డిసెంబరు వరకు ప్రతిరోజు 830 మిలియన్‌ లీటర్ల తాగునీటిని సరఫరా చేశామన్నారు. చెన్నై తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కండలేరు జలాశయం నుంచి ఏటా 12 టీఎంసీల నీటిని పొందుతున్నామని పేర్కొన్నారు. 2018- 19వ ఏడాదిలో 1.98 టీఎంసీల నీటిని మాత్రమే పొందామన్నారు. కండలేరు జలాశయంలో 6.40 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే చెన్నైకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుందని, ప్రస్తుతం 4.58 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండటంతో ఆంధ్ర ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదన్నారు. రుతుపవనాల ప్రభావంతో ఆశించిన మేరకు వర్షాలు కురవక పోవడంతో అన్ని జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం నిర్లవణీకరణ పథకం, వీరాణం ప్రాజెక్టు, నైవేలి పరివాహక ప్రాంతాల్లో అదనంగా గొట్టపు బావుల ఏర్పాటు, వ్యవసాయ బావులను అద్దెకు తీసుకోవడం, చిక్కరాయపురం రాళ్ల క్వారీ తదితర తాగునీటి ఆధారాల ద్వారా ప్రతిరోజు చెన్నైకి 525 మిలియన్‌ లీటర్ల నీటిని సరఫరా చేయడానికి చర్యలు చేపట్టామని వివరించారు. పూండి, తామరైపాక్కం వాటి పరిసరాల్లోని వ్యవసాయ బావుల ద్వారా 95 మిలియన్‌ లీటర్ల నీటిని తీసుకోవడానికి పనులు జరుగుతున్నాయని, అందులో భాగంగా ప్రస్తుతం రోజుకు 65 మిలియన్‌ లీటర్ల నీటిని పొందుతున్నామన్నారు. ఎరుమైయూర్‌ రాళ్ల క్వారీ నుంచి రూ.19.17 కోట్లతో జులై నుంచి 10 మిలియన్‌ లీటర్ల నీటిని పొందడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. రెట్టేరి, పెరుంబాక్కం, అయనంపాక్కం జలాశయాల నుంచి 30 మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధిచేసి సరఫరా చేయడానికి రూ.53 కోట్లతో పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. చెన్నైలో 900 లారీ ట్యాంకర్లను అద్దెకు తీసుకొని ప్రతిరోజు 9100 ట్రిప్పుల చొప్పున తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. శివారు ప్రాంతాల్లోని రాళ్ల క్వారీల నీటిని శుద్ధిచేసి పమ్మల్‌, అనకాపుత్తూర్‌, చిట్లపాక్కం తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాగునీటి సమస్య గురించి ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, చెన్నైలో పలువురు ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తాగునీటి ఎద్దడి పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.