
తాజా వార్తలు
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చింది. ఇరు రాష్ట్రాలకు అంతంత మాత్రంగానే కేటాయింపులు చేసింది. ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.13 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.8 కోట్లు కేటాయించారు. ఐఐటీ తిరుపతికి నిధులు కేటాయించలేదు. మరోవైపు తెలంగాణలోని హైదరాబాద్ ఐఐటీకి మాత్రమే ఈఏపీ కింద రూ.80 కోట్లు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఐఐఎం, ఎన్ఐటీ, ఐఐఎస్ఆర్, ట్రిపుల్ ఐటీలకు అవసరమైన నిధులను కేటాయింపుల్లో ఎక్కడా పేర్కొనలేదు. విభజన చట్టంలోని హామీల అమలుపైనా కేంద్రం ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రెవెన్యూ లోటు అంశాలకు తెలుగింటి కోడలి పద్దులో ఎక్కడా చోటుదక్కలేదు.
బడ్జెట్‌పై పెదవి విరిచిన వైకాపా, తెరాస
కేంద్ర బడ్జెట్‌పై ఏపీ, తెలంగాణలోని అధికార పార్టీలు పెదవి విరిచాయి. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచేయి చూపిందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు తమను నిరాశ పరిచాయని.. ఏపీకి అదనంగా ఏమీ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. విభజన చట్టంలోని అంశాలనూ ఎక్కడా ప్రస్తావించలేదని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశనే మిగిల్చిందని తెదేపా ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఎప్పటిలాగానే ఏపీకి ఈసారి కూడా అన్యాయం జరిగిందన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణం, విభజన చట్టం అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
కేంద్ర బడ్జెట్ తెలంగాణకు నిరాశాజనకంగానే ఉందని తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు రాయితీలు ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పారు. కొన్ని ప్రాజెక్టులైనా తమకు ఇస్తారనుకున్నామని.. కానీ అవేమీ ఇవ్వలేదన్నారు. తెలంగాణకు ఎంతో కొంత ప్రత్యేకత ఉంటుందని భావించిన తమకు నిరాశే మిగిలిందని చెప్పారు. రాష్ట్రంపై భాజపా కపట ప్రేమకు బడ్జెట్ నిదర్శనమని మరో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా బడ్జెట్ కేటాయింపులపై మండిపడ్డారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి సహాయం చేయలేదన్నారు. బడ్జెట్లో విద్య, ఉద్యోగాలకు ప్రోత్సాహం అందించే ఎలాంటి పథకాలూ లేవని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు రూ.1 పన్ను చెల్లిస్తే 65 పైసలే ఇస్తున్నారని రేవంత్ ఆరోపించారు.