close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌  @ 5 PM

1. ‘మోదీకి కుటుంబం ఉంటే దాని విలువ తెలిసేది’

మోదీకి కుటుంబం ఉంటే దాని విలువ తెలిసేదని.. తాము కూడా వ్యక్తిగత దాడి మొదలుపెడితే ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ పాలనలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తిరగబడుతున్నారని చంద్రబాబు అన్నారు.  ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి ఇన్నాళ్లూ మోసం చేశారని.. విభజన చట్టం హామీలను అమలు చేయకుండా రాష్ట్రాన్ని కేంద్రం అవమానిస్తోందని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ఆరోపించారు. విభజన హామీలను అమలు చేయాలంటూ దిల్లీలో చంద్రబాబు తలపెట్టిన ‘ధర్మపోరాట దీక్ష’ కొనసాగుతోంది. వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు దీక్షా వేదిక వద్దకు వచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నేతలు చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.

2. ‘ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదు’ 
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదని  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదని ఆయన నిలదీశారు. గాంధీభవన్‌లో వీహెచ్‌ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే తెలంగాణకు ఇచ్చిన విభజన హామీల పరిష్కారంతో పాటు ఏపీకి ప్రత్యేకహోదా సాధ్యమవుతాయని చెప్పారు. మంత్రివర్గం లేకుండా సీఎం కేసీఆర్‌ కొత్త సంప్రదాయానికి తెరతీశారని..  ప్రధాని మోదీకి తెలంగాణలో అవినీతి, కుటుంబపాలన కనిపించడం లేదా అని వ్యాఖ్యానించారు.

3. టీపీసీసీ సమావేశాలు వాయిదా

 హైదరాబాద్ గాంధీభవన్‌లో ఇవాళ జరగాల్సిన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం, మంగళవారం సాయంత్రం  జరగాల్సిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడ్డాయి. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రధాన కార్యదర్శుల సమావేశం ఉండడంతో ఈ సమావేశాలు వాయిదా పడినట్లు గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 15, 16, 17 మూడు రోజుల పాటు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు జరగనున్నాయి.

4. లఖ్‌నవూలో ప్రియాంక రోడ్‌ షో

 కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరప్రదేశ్‌ తూర్పు విభాగానికి ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా లఖ్‌నవూలో రోడ్‌ షో చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం లఖ్‌నవూ చేరుకున్న ప్రియాంక.. సోదరుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తోడుగా ఈ రోడ్‌ షో ప్రారంభించారు. బస్సుపైన నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. ఈ రోడ్‌షోలో పార్టీ ఉత్తరప్రదేశ్‌ పశ్చిమ విభాగం ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా, ఇతర కాంగ్రెస్‌ నేతలు కూడా పాల్గొన్నారు. నగరంలోని అమౌసి ఎయిర్‌పోర్టు నుంచి కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వరకు 25 కిలోమీటర్ల మేర ఈ ప్రదర్శన సాగుతుంది.

5. కార్యకర్తలందరూ గర్వంగా చెప్పుకునేలా..

ఎన్నికల కోసం దాతల నుంచి పార్టీ సేకరించే విరాళాల విషయంలో పారదర్శకత ఉండాలని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తమ కార్యకర్తలకు సూచించారు. నాటి భారతీయ జన సంఘ్‌ అధ్యక్షుడు దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌ 51వ వర్థంతి సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘విరాళాల విషయంలో ఇతర పార్టీలకు మన పార్టీ.. మార్గదర్శకంగా ఉండాలి. దేశంలోని ఒక్కో బూత్‌ నుంచి కనీసం ఇద్దరు భాజపా కార్యకర్తలు నమో యాప్‌ ద్వారా రూ.1,000 సాయం చేయాలని వ్యాఖ్యానించారు.

6. చోరీకి చౌకీదారే స్వయంగా తలుపు తెరిచారు

రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైన రఫేల్‌ ఒప్పందం విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనిల్‌ అంబానీ రూ. 30వేల కోట్లు దోచుకునేందుకు చౌకీదారే స్వయంగా తలుపు తెరిచారంటూ దుయ్యబట్టారు. రఫేల్‌ ఒప్పందంపై ‘ద హిందూ’ ప్రచురించిన తాజా కథనమే ఇందుకు కారణం. భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య రఫేల్‌ ఒప్పందం జరగడానికి కొద్ది రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం అవినీతి నిరోధక నిబంధనలను తొలగించిందంటూ ‘ద హిందూ’ కథనం పేర్కొంది. దీనిపై స్పందించిన రాహుల్‌ ట్విటర్‌ వేదికగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.  

7. కులం పేరెత్తితే కొడతా:నితిన్‌ గడ్కరీ

దేశంలో కుల వివక్షను రూపుమాపాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పిలుపునిచ్చారు. ఎవరైనా కులం గురించి మాట్లాడితే వారిని కొడతానని హెచ్చరించానని.. అందుకే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నాగ్‌పూర్‌ ప్రాంతంలో ఎవరూ కులం గురించి మాట్లాడరని తెలిపారు. పుణెలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఎన్ని కులాలు ఉన్నాయో కూడా తనకు తెలియదన్నారు. కుల, వర్గ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. 

8. విద్యార్థులకు భోజనం వడ్డించిన ప్రధాని

 దేశం నుంచి ఆకలిని పారదోలడానికి అక్షయ పాత్ర ఫౌండేషన్‌  చేస్తోన్న కృషిని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. బృందావన్‌లో పర్యటించిన ఆయన ఎన్జీఓ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేద విద్యార్థులకు భోజనం వడ్డించారు. ‘అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన ‘థర్డ్ బిలియన్త్‌ మీల్’ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ రోజు బృందావన్‌లో ఉన్నాను. ఈ కార్యక్రమంలో భాగమైన వారందరికి అభినందనలు. ఆకలిని పారదోలడానికి వారు చేస్తున్న కృషి అమోఘం’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

9. విభజన హామీలు నెరవేర్చాలి: శరద్‌యాదవ్‌

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు జేడీయూ మాజీ నేత శరద్‌యాదవ్‌ మద్దతు తెలిపారు. దీక్షా శిబిరానికి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ..‘‘ఏపీ ప్రజల ధర్మ పోరాట దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాం. పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరం ఏపీ విభజన హామీలు నెరవేర్చే వరకు అండగా ఉంటాం’’ అని శరద్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

10. ట్విటర్‌లో ప్రియాంక.. వేలల్లో ఫాలోయింగ్‌

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ సోమవారం తన అధికారిక ట్విటర్‌ ఖాతాను ప్రారంభించారు. కాగా ఖాతాను మొదలుపెట్టిన కొద్ది క్షణాల్లోనే ఆమెను వేల మంది అనుసరించారు. ప్రియాంక గాంధీ వాద్రా అధికారిక ట్విటర్‌ ఖాతాను ప్రారంభించినట్లు సోమవారం ఉదయం 11.49 గంటలకు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. అయితే 15 నిమిషాల్లోనే ఆమె ఖాతా‌ ఫాలోవర్ల సంఖ్య 5వేలను దాటింది. ప్రియాంక ఇంతవరకూ ఒక్క ట్వీట్‌ కూడా చేయనప్పటికీ.. మధ్యాహ్నం 12.45 గంటల సమయానికి ఆమె ఖాతాను 24వేల మంది అనుసరిస్తున్నారు. కాగా.. ప్రియాంక ఏడుగురిని ఫాలో అవుతున్నారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.