
తాజా వార్తలు
వేగవంతమైన ఇంటర్నెట్ అందించడమే లక్ష్యం
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగ సంస్థ ‘స్పేస్ ఎక్స్’ 60 చిన్న కృత్రిమ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కవరేజీ కోసం ఉద్దేశించిన స్టార్‌లింక్ నెట్‌వర్క్‌లలో ఇది రెండో ప్రయోగం. ఈ మేరకు ‘స్పేస్ ఎక్స్’కు చెందిన ఫాల్కన్ రాకెట్ ద్వారా వీటిని రోదసిలోకి ప్రవేశ పెట్టారు. ప్రపంచంలోని ఏమూలకైనా అధిక వేగంతో ఇంటర్నెట్ అందించాలన్న సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆలోచన మేరకు వీటిని రూపొందించారు. ఉత్తర అమెరికా, కెనడాలో ఈ ఏడాది వచ్చే నాటికి ఈ సేవల్ని ప్రారంభించాలని ఎలన్ భావిస్తున్నారు. మొత్తం 24 ప్రయోగాల తర్వాత ఈ సేవలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. తొలి ప్రయోగం గత మేలో జరగ్గా.. తాజా ప్రయోగం రెండోది.
ఈ ప్రయోగంలో మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. దీనిలో ఉపయోగించిన బూస్టర్‌ని ఇప్పటికే నాలుగుసార్లు వినియోగించారు. ఇది తిరిగి సురక్షితంగా సముద్రంలో పడడంతో దీన్ని మరోసారి ఉపయోగించే అవకాశం ఏర్పడింది. ఇలా మొత్తం 10సార్లు వాడుకునేలా రూపొందించినట్లు ప్రయోగ సమయంలో సంస్థ వ్యాఖ్యాత వెల్లడించారు. అలాగే ఈ ప్రయోగంలో రాకెట్ ముక్కు భాగాన్ని రెండోసారి వినియోగించారు.