close

తాజా వార్తలు

ఓట్లు కురిపించని ‘ప్రియాంకాస్త్రం’


ఇంటర్నెట్ డెస్క్‌: ఒత్తైన జుట్టు, నేత చీరలు, నానమ్మను పోలిన రూపం ఇవన్నీ  ప్రియాంకా గాంధీని చూడగానే మనసులో మెదిలే వర్ణనలు. నిత్యం రాజకీయాల గురించే చర్చలు జరిగే కుటుంబం నుంచి వచ్చినా పదవుల మీద ఆసక్తి కనబర్చలేదు. కానీ కాంగ్రెస్‌ను మరింత పటిష్టం చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు సోదరుడు రాహుల్‌గాంధీ పిలుపు మేరకు క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించారు. అయితే పోటీకి మాత్రం దూరంగా ఉండి, పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టారు. ఇందిర మీద అభిమానంతో ఆమె ర్యాలీలకు జనాలు కిక్కిరిస్తుండటం కాంగ్రెస్‌ శ్రేణులు గత వైభావాన్ని గుర్తు చేసుకున్నాయి. పార్టీకి మంచిరోజులు రానున్నాయని ఆశించాయి. మరి ఈ ఎన్నికల్లో ఆమె ప్రచారం పూర్వ వైభవాన్ని కట్టబెడుతుందన్న అంశంపై విశ్లేషకుల ముందున్న ప్రశ్నకు మే 23న సమాధానం దొరికింది. దేశరాజకీయాలకు దిక్చూచిగా ఉన్న ఉత్తర్‌ ప్రదేశ్‌లో మూడు దశాబ్దాల క్రితం వరకు కాంగ్రెస్‌ది అగ్రస్థానం. అనంతరం కాంగ్రెస్‌ అక్కడ తన ప్రాభవాన్ని కోల్పోయింది. 2009 ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినా 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రం నుంచి కేవలం అమేఠీ, రాయబరేలి  స్థానాలను మాత్రమే గెలుపొందింది. ఈ పరిస్థితుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో పునర్‌వైభవం కోసం ప్రియాంకాగాంధీని రంగంలోకి దించారు. ప్రత్యేకించి తూర్పు ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రచార బాధ్యతలను ఆమెకు అప్పగించారు. 

కలుపుగోలుగా ప్రజల్లోకి ప్రియాంక:
‘మీ ఓటే మీ ఆయుధం’ అంటూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తరవాత ప్రియాంక గాంధీ.. మోదీ రాష్ట్రం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన మొదటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సోదరీసోదరులారా అని పలకరించి తాను మహిళల పక్షమేనని వెల్లడించి, ఆ వర్గాన్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.  ఏ మాత్రం తడబాటు లేకుండా సహజ శైలిలో, మోదీ పేరు ప్రస్తావించకుండా అక్కడ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేంద్రంలో అధికారాన్ని నిర్ణయించే రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆమె ముందుకు కదిలారు. అక్కడ మూడు రోజుల పాటు గంగా యాత్రను చేపట్టి, తీర ప్రాంత ప్రజలతో మమైకమయ్యారు.  స్వపక్షం, విపక్షం అన్న తేడా లేకుండా అన్ని పార్టీల మద్దతుదారులకు ఆత్మీయ కరచాలనం ఇస్తూ, ఆప్యాయంగా పలకరించారు. పాములు ఆడించే వారితో సంభాషించడం,  రోడు పక్కన మంచం మీద కూర్చున్న ముసలావిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, బారికేడ్లు దాటి ప్రజల్లోకి వెళ్లడం, యువతులతో కలిసి సెల్ఫీలు దిగడం..ఇలా కొత్తాపాతా లేకుండా ఆమె మసులుకున్న తీరు ఆకట్టుకుంది.  ఆమెకు భద్రత కల్పించడానికి సిబ్బంది పరుగులు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. హుషారుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆమె సభలకు ప్రజలకు కిక్కిరిసివచ్చారు. ఇదంతా నాణేనికి ఒకవైపు.

మోదీ దృఢ వైఖరి ముందు వారసత్వం నిలబడలేదు
ఆమె రాకతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త వచ్చిందని కొందరు నాయకులు భావించగా, మరికొందరు మాత్రం ఇంకా ముందే క్రీయాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిందని అభిప్రాపడ్డారు. గత సంవత్సరం జరిగిన మూడురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయబావుటా ఎగరేసిన తరవాత కొంతకాలం ఆలోచించి అధికారికంగా పార్టీలోకి అడుగుపెట్టారని ఓ కాంగ్రెస్‌ నేత వెల్లడించారు. ఓ వైపు భాజపా ఆమె రాకకు అంత ప్రాముఖ్యత ఏమీ లేదంటూ కొట్టిపారేసింది.  విపక్షాలన్నీ భాజపాను గద్దె దించాలని గట్టి పట్టుతో ఉన్నా..ఐక్యతలో మాత్రం తలోదారి చూసుకున్నాయి. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి, దిల్లీలో ఆప్‌ నుంచి నుంచి కాంగ్రెస్‌కు తగిలిన దెబ్బే అందుకు ఉదాహరణ. న్యాయ్‌ పథకం, భాజపా విధానాల మీద విమర్శలతో ముందుకు సాగిన కాంగ్రెస్‌ పార్టీ ప్రియాంక ఛరిష్మా మీద కూడా నమ్మకం పెట్టుకుంది. అయితే మోదీ ప్రజాకర్షణ ముందు ప్రియాంక వారసత్వం తేలిపోయింది. గాంధీ-నెహ్రూ కుటుంబం మీద అభిమానంతో సభలకు వచ్చిన ప్రజలు, ఓటు మాత్రం   భాజపాకే వేశారు. దాయాది దేశం పాకిస్థాన్‌ మీద మోదీ ప్రదర్శించిన కఠిన వైఖరి, విపక్షాల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను లెక్క చేయకుండా తీసుకునే నిర్ణయాల ముందు ప్రియాంక ఆగమనం, ప్రసంగాలు, పర్యటనలు ప్రభావం చూపలేకపోయాయి. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.