close

తాజా వార్తలు

రొనాల్డో, మెస్సి.. మధ్యలో ఛెత్రి..!

ప్రస్తుతం ఫుట్‌బాల్‌లో కొనసాగుతున్న స్టార్లలో అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ సాధించిన ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. అతను 85 గోల్స్‌ కొట్టాడు. మరి రెండో స్థానంలో ఎవరుంటారో ఊహించండి? మెస్సి..? నెయ్‌మార్‌..? సురెజ్‌..?వీళ్లెవ్వరూ కాదు.. సునీల్‌ ఛెత్రి..! మన ఫుట్‌బాలర్‌ రొనాల్డో తర్వాతి స్థానంలో ఉన్నాడంటే నమ్మకం కలగడం లేదు కదూ! కానీ ఇది నిజం. తాజాగా ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ తొలి మ్యాచ్‌లో రెండు గోల్స్‌ కొట్టిన ఛెత్రి.. మొత్తంగా 67 గోల్స్‌తో మెస్సి (65) లాంటి సూపర్‌ స్టార్‌ను వెనక్కి నెట్టేశాడు. ప్రపంచ స్థాయి ఫుట్‌బాల్‌ ప్రమాణాలకు భారత్‌ చాలా దూరంలో ఉండొచ్చు. ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్‌ స్థానం (97) వందకు చేరువగా ఉండొచ్చు. భారత ఫుట్‌బాల్‌ జట్టుకు అభిమానుల ఆదరణ అంతగా లేకపోవచ్చు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా అవకాశం వచ్చిన ప్రతిసారీ సత్తా చాటుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు మన సాకర్‌ హీరో.

రొనాల్డో, మెస్సి.. మధ్యలో ఛెత్రి..!

భారత ఫుట్‌బాల్‌లో తిరుగులేని స్థాయిని అందుకున్న ఆటగాడు బైచుంగ్‌ భుటియా. అతడికి ముందు ఎందరో భారత జట్టుకు ఆడారు. కానీ భుటియా అంత పేరు ఎవ్వరికీ రాలేదు. భుటియా తర్వాత అతడిలా ప్రపంచ స్థాయిని ఇంకెవ్వరూ అందుకోలేరని అంతా అనుకున్నారు. కానీ సునీల్‌ ఛెత్రి వచ్చాడు. భుటియాను మించి పోయాడు. ఎన్నో ఘనతలు సాధించాడు. భారత ఫుట్‌బాల్‌ అనగానే తన పేరే గుర్తుకొచ్చేలా చేశాడు. ప్రపంచ ఫుట్‌బాల్‌లో ప్రస్తుతం భారత్‌ స్థానమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత దేశ జనాభాలో పదో వంతు కూడా లేని దేశాలు మన కన్నా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాయి. ఐతే జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా.. ఛెత్రి మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. చాలా ఏళ్లుగా భారత జట్టు ఛెత్రి మీదే ఆధారపడుతోంది. అతను బాగా ఆడితే గెలుస్తోంది. అతను విఫలమైతే దెబ్బ తింటోంది. భారత్‌ పది మ్యాచ్‌ల్లో గెలిస్తే.. అందులో ఏడెనిమిది విజయాల్లో ఛెత్రి పాత్ర కీలకంగా ఉంటోంది. నిరుడు భారత్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ గెలిచిందంటే అందుకతనే కారణం. టోర్నీ మొత్తంలో భారత్‌ 11 గోల్స్‌ కొడితే అతనొక్కడే 8 సాధించడం విశేషం. ప్రస్తుత ఆసియాకప్‌లోనూ ఛెత్రి సత్తాచాటుతున్నాడు. 34 ఏళ్ల ఛెత్రి పేరు తొలిసారి మార్మోగింది 2007 నెహ్రూ కప్‌లో. ఆ ఏడాది భారత్‌ టైటిల్‌ గెలిచింది అతడి వల్లే. ఆపై జట్టుకు ఇంకో రెండు నెహ్రూ కప్‌లు (2009, 2012) అందించాడు.  2008 ఏఎఫ్‌సీ ఛాలెంజ్‌ కప్‌లో భారత్‌ నెగ్గి.. 27 ఏళ్ల తర్వాత ఏఎఫ్‌సీ ఆసియా కప్‌కు అర్హత సాధించిందన్నా ఛెత్రీనే కారణం. భారత్‌ నుంచి విదేశీ లీగ్‌లకు ఎంపికైన అతి కొద్దిమంది ఆటగాళ్లలో ఛెత్రి ఒకడు.
అతను పిలిస్తే స్టేడియాలు నిండాయ్‌
‘‘మమ్మల్ని తిట్టండి. విమర్శలు చేయండి. కానీ దయచేసి స్టేడియాలకు రండి’’.. గత ఏడాది ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ సందర్భంగా సునీల్‌ ఛెత్రి భారత అభిమానుల్ని ఉద్దేశించి ఇచ్చిన పిలుపు ఇది. సొంతగడ్డపై ఓ పెద్ద టోర్నీ జరుగుతుంటే.. భారత్‌ ఆడే మ్యాచ్‌లకు కూడా జనాలు రాకపోవడం, స్టేడియాలు వెలవెలబోతుండటంతో ఛెత్రి ఆవేదనతో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఒక జాతీయ జట్టు కెప్టెన్‌ ఇలా అడగాల్సి రావడం బాధాకరమే కానీ.. ఛెత్రి పిలుపు బాగానే పని చేసింది. తర్వాతి మ్యాచ్‌ నుంచి స్టేడియాలు నిండిపోయాయి. టోర్నీలో మిగతా మ్యాచ్‌లన్నీ అభిమానులతో కళకళలాడిపోయాయి. ఐతే అభిమానుల్ని స్టేడియాలకు పిలిచేసి వాళ్లనేమీ నిరాశ పరచలేదు ఛెత్రి. టోర్నీ ఆద్యంతం రాణించాడు. ఫైనల్లోనూ సత్తా చాటి భారత్‌కు కప్పు అందించాడు. ఛెత్రి వందో అంతర్జాతీయ మ్యాచ్‌ రికార్డును అందుకోవడంతో పాటు.. ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో కొనసాగుతున్న ఆటగాళ్లలో రొనాల్డో తర్వాత అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాడిగా మెస్సిని సమం చేసింది కూడా ఆ టోర్నీలోనే. ఇప్పుడు ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి మెస్సిని అధిగమించాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.