close
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుకు ‘అనుమానపు వైరస్‌’!

హైదరాబాద్‌ ‘వనిత’ అమెరికాలో మృతి

నాగోలు: అమెరికా వెళ్లినా.. పెద్ద సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నా అతగాడి అనుమానపు బుద్ధి మాత్రం పోలేదు.. భార్యను అవమానించడం.. హింసించడంతో మొదలైన అతడి ఆగడాలు చివరకు ఆమె అనుమానాస్పద మృతికి దారి తీశాయి. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా పుట్టపాక గ్రామానికి చెందిన గజం కృష్ణయ్య హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయన రెండో కుమార్తె వనిత(38)కు పదిహేనేళ్ల క్రితం యాదాద్రి జిల్లా రఘునాథపురం గ్రామానికి చెందిన రాచకొండ శివకుమార్‌తో పెళ్లయింది. అతడు అమెరికాలోని నార్త్‌ కరోలినాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అతని తల్లిదండ్రులు కొత్తపేటలో ఉంటారు. పెళ్లయ్యాక నెలరోజుల తర్వాత శివకుమార్‌ ఒక్కడే అమెరికాకు వెళ్లాడు. నిత్యం వీడియో కాల్‌లో వనితతో మాట్లాడేవాడు. ఎవరితో మాట్లాడొద్దు.. ఎక్కడికి వెళ్లొద్దంటూ ఆంక్షలు పెట్టేవాడు. ఆరు నెలల తర్వాత వనితకు వీసా రావడంతో అక్కడికి వెళ్లింది. అక్కడా ఇదే తంతు. బంధువులూ, స్నేహితులతో కలవవద్దని చెప్పేవాడు. అనుమానించి తిట్టి కొట్టేవాడు. వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చిన వనితను కుటుంబసభ్యులు సముదాయించి తిరిగి పంపారు. వారికి సింధు (13), సిద్ధార్థ్‌ (8) సంతానం. భర్త వేధింపులు ఆగకపోవడంతో దాదాపు నాలుగేళ్లక్రితం పిల్లలతో పుట్టింటికి వచ్చేసింది. కొత్తపేటలోని శివకుమార్‌ తల్లిదండ్రులు వారాంతాల్లో పిల్లలను తమ ఇంటికి తీసుకువెళ్లేవారు. ఓరోజు హైదరాబాద్‌ వచ్చిన శివకుమార్‌ వనితకు చెప్పకుండానే పిల్లలను తనతో అమెరికాకు తీసుకెళ్లిపోయాడు. పిల్లలను తలచుకొంటూ ఆమె కుమిలిపోతుండేది. ఆర్నెల్ల క్రితం పిల్లల నుంచి ఫోన్‌ వచ్చింది. అమెరికాకు వచ్చేయాలన్న వారి కోరికను కాదనలేకపోయింది. శివకుమార్‌ సైతం ఫోనుచేసి రావాలని కోరడంతో అన్నీ మరచిపోయి.. ఈ ఏడాది జూన్‌ 12న అక్కడికి వెళ్లింది. ఎయిర్‌పోర్టులో దిగాక భర్త రిసీవ్‌ చేసుకున్నాడంటూ తండ్రికి ఫోనుచేసింది ఆమె. తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యింది. అప్పటినుంచి ఎలాంటి సమాచారమూ లేదు. ఈనెల 4న వనిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు అక్కడి బంధువుల నుంచి తల్లిదండ్రులకు సమాచారం అందింది. దీంతో ఒక్కసారిగా వారు కుప్పకూలిపోయారు. తమ కుమార్తె చావుకు భర్త వేధింపులే కారణమని ఆరోపిస్తూ, తమకు న్యాయం చేయాలని రాష్ట్ర డీజీపీని కోరారు. మృతదేహాన్ని నగరానికి రప్పించాలని విన్నవించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని