మేం మాట్లాడేందుకు 6 నిమిషాలేనా?:భట్టి

తాజా వార్తలు

Published : 08/09/2020 17:02 IST

మేం మాట్లాడేందుకు 6 నిమిషాలేనా?:భట్టి

ఇది చాలా దారుణమన్న సీఎల్పీ నేత

హైదరాబాద్‌: ప్రజా సమస్యలకు పరిష్కారం లభించేది దేవాలయం లాంటి శాసనసభలోనేనని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెరాస ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం గన్‌పార్కులో తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. 19 మంది ఎమ్మెల్యేలున్న తమ పార్టీలో కొందరిని కేసీఆర్‌ తెరాసలో చేర్చుకున్నారని.. 19 మంది ప్రాతిపదికన కాకుండా ఇప్పుడున్న సభ్యుల ప్రకారమే సమయం కేటాయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడేందుకు కాంగ్రెస్‌కు కేవలం ఆరు నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నారని.. ఇది చాలా దారుణమని భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు.  

మీడియా పాయింట్‌ను పునరుద్ధరించాలి: జీవన్‌రెడ్డి

కరోనా సాకుతో అసెంబ్లీ మీడియా పాయింట్‌ను తాత్కాలికంగా తొలగించడం అప్రజాస్వామికమని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదని చెప్పారు. ప్రభుత్వం నియంతృత్వ ఆలోచనలను అమలు చేస్తోందని మండిపడ్డారు. వెంటనే అసెంబ్లీ మీడియా పాయింట్‌ను పునరుద్ధరించేలా స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
 
మా గొంతు నొక్కుతున్నారు: సీతక్క

అసెంబ్లీలో మాట్లాడనీయకుండా తమ గొంతు నొక్కుతున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. సభలో విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారని.. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన చర్చలను జరగనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లో పీవీ చనిపోయినప్పుడు తెరాస నేతలు కనీసం అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదన్నారు. సీఎం కేసీఆర్‌కు నైతిక విలువలుంటే సభలో మాట్లాడేందుకు కాంగ్రెస్‌కు సమయం ఇవ్వాలని సీతక్క డిమాండ్‌ చేశారు. 

దానివల్లే కేసీఆర్‌కు గుర్తింపు: జగ్గారెడ్డి

అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ఏం చేసిందని పదేపదే ప్రశ్నిస్తున్నారని.. కాంగ్రెస్-తెరాస పొత్తుతో కేసీఆర్‌కు కేంద్రమంత్రి పదవి దక్కిందని చెప్పారు. దానివల్లే ఆయనకు గుర్తింపు వచ్చిందన్నారు. 

12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా జగ్గారెడ్డి గుర్తు చేశారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని