బిహార్‌ పోరులో..ముస్లిం ఓటరు..ఎటువైపు?
close

తాజా వార్తలు

Updated : 31/10/2020 12:07 IST

బిహార్‌ పోరులో..ముస్లిం ఓటరు..ఎటువైపు?

పట్నా: గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తిగా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండే ముస్లింలు ఈసారి ఎవరివైపు మొగ్గుచూపుతారనే విషయంపై అన్ని పార్టీల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా-జేడీయూ, ఆర్జేడీ-కాంగ్రెస్‌ మహాకూటమి, థర్డ్‌ఫ్రంట్‌ వంటి పార్టీలు ముస్లిం ఓట్లు తమకే అనుకూలంగా ఉన్నాయంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను విరివిగా ఎన్డీఏ తమ ప్రచారంలో చెప్పుకుంటోంది. ఈనేపథ్యంలో బిహార్‌ ఎన్నికల్లో ముస్లిం ఒటరు ఈసారి ఎటువైపు మొగ్గుచూపుతారన్న విషయం ఆసక్తిగా మారింది.

రాష్ట్రంలో 17శాతం ఉన్న ముస్లిం ఓటర్లు బిహార్‌ ఎన్నికల పోరులో ఎల్లప్పుడూ నిర్ణయాత్మకంగానే ఉంటారు. 1989 సంవత్సరంలో భగల్‌పూర్‌లో జరిగిన మత ఘర్షణల ఘటన కన్నా ముందు, బిహార్‌ ముస్లిం ఓటర్లు కాంగ్రెస్‌వైపే ఉన్నారు. కానీ, భగల్‌పూర్‌ ఘటన తర్వాత ముస్లింలు ఆ పార్టీకి దూరమయ్యారు. అనంతరం అధికారంలోకి వచ్చిన జనతాదళ్‌ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ముస్లింలకు మరింత దగ్గరయ్యారు. ఇలా ముస్లింలలో లాలూ ప్రసాద్‌ ఇమేజ్‌ 2005 వరకు చెక్కుచెదరకుండా కొనసాగింది. అనంతరం బిహార్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నితీశ్‌ కుమార్‌ కూడా ముస్లింలకు వెన్నుదన్నుగా నిలిచారు. 2005-2010 మధ్యకాలంలో భాజపా సహాయంతో కొనసాగుతున్నప్పటికీ, ముస్లింలను విస్మరించే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఈ సమయంలో 2010 అసెంబ్లీ ఎన్నికల తీర్పు మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. లాలూ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌ నితీశ్‌ కుమార్‌ కోటను కదిలించలేకపోయింది. ముస్లిం ఆధిపత్య అసెంబ్లీ స్థానాలను అధిక సంఖ్యలో కైవసం చేసుకోవడంతోపాటు మొత్తం 243 స్థానాల్లో 206 స్థానాలను నితీశ్‌ భాగస్వామిగా ఉన్న ఎన్‌డీఏ గెలుపొందింది.

అనంతరం 2015లోనూ ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ముస్లింలు స్పష్టంగానే ఉన్నారు. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా.. ముస్లింల కోసం హామీ ఇస్తూ వస్తోన్న కాంగ్రెస్‌, ఆర్జేడీ, జేడీయూ మూడుపార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయి. దీంతో బిహార్‌ ముస్లింలు మహాకూటమికే జై కొట్టారు. 243 మంది సభ్యుల అసెంబ్లీలో 24మంది ముస్లింలు విజయం సాధించారు. వీరిలో మహాకూటమి నుంచి 23మంది కాగా, ఒకరు సీపీఐ-ఎంఎల్‌ నుంచి గెలుపొందారు. ఆర్జేడీ నుంచి 12 మంది, కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు, జేడీయూ నుంచి ఐదుగురు గెలుపొందారు. ఈ సమయంలో ఎన్డీఏలో మిత్రపక్షాలైన భాజపా, ఎల్‌జేపీ, ఆర్‌ఎల్‌ఎస్‌పీ, హిందుస్థానీ ఆవామీ మోర్చా నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి గెలుపొందలేదు. ప్రస్తుతం 2020 ఎన్నికల్లోనూ తొలి దశలో భాజపా ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బరిలోకి దించలేదు.

మారిన సమీకరణలు..?
గత ఎన్నికలను పరిశీలిస్తే, రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారినట్లే కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన నితీశ్‌ కుమార్‌, ఆర్‌జేడీతోనూ దూరమయ్యారు. చివరకు భాజపాతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఇది నితీశ్‌ కుమార్‌పై ముస్లింల ఆగ్రహానికి కారణమయ్యింది. అయితే, దీన్ని గ్రహించిన నితీశ్‌.. పలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆ వర్గానికి  దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కానీ, ఆర్టికల్‌ 370, త్రిపుల్‌ తలాక్‌ వంటి బిల్లుల విషయంలో మాత్రం కేంద్రంలో భాజపాకే మద్దతిచ్చారు. దీంతో ముస్లింల నుంచి ఆయన కొంత అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, భాజపాతో దగ్గరగా ఉన్నంత మాత్రాన నితీశ్‌ కుమార్‌కు ముస్లింలు ఓటు వేయరని అనుకోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే, సుపాల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తోన్న జేడీయూ అభ్యర్థి బిజేంద్ర ప్రసాద్‌ యాదవ్‌కు మద్దతుగా ముస్లిం ఓటర్లు నిలవడమే ఇందుకు నిదర్శనం. ఆయనకు ప్రత్యర్థిగా మిన్నాత్‌ రెహమానిని కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. అయినప్పటికీ, బిజేంద్ర యాదవ్‌కు ముస్లిం వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా అతనివైపే మొగ్గుచూపుతున్నారు. ఇలా సుపాల్‌ లాంటి మరికొన్ని స్థానాల్లో జేడీయూ గెలుపొందే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆశాజనకంగా మహాకూటమి..!
ఇలా ముస్లిం ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారన్న సందిగ్ధం నెలకొన్న సమయంలో.. ఆర్‌జేడీ, కాంగ్రెస్‌, సీపీఐ ఎంఎల్‌తో ఏర్పడ్డ మహాకూటమి కూడా ముస్లిం వర్గానికి చెందిన ఓట్లపై ధీమా వ్యక్తంచేస్తోంది. భాజపాను ఓడించేందుకు ముస్లిం ఓటర్లే కీలకమని భావిస్తోంది. ఎందుకంటే, ముస్లింలు ఆర్‌జేడీతోనే స్వేచ్ఛగా ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్జేడీ 18 ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించింది. జేడీయూ మాత్రం 11మందిని నిలబెట్టింది. కాంగ్రెస్‌ కూడా మరో 10మంది ముస్లిం అభ్యర్థులకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ముస్లిం ఓటర్లను దూరం చేసుకోకుండా ఉండేందుకు జేడీయూ తన మిత్రపక్షమైన భాజపాను ముందుగానే హెచ్చరించింది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో, ముస్లిం వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని గట్టిగా సూచించింది. అందుకే ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన గిరిరాజ్‌ సింగ్‌ వంటి నేతలను కూడా ప్రచారంలో పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

ఓవైసీ ప్రభావం ఎంత..?
ఎన్‌డీఏ, మహాకూటమి పరిస్థితి ఇలా ఉంటే, ఆర్‌ఎల్‌ఎస్‌పీ, బీఎస్‌పీ, ఎఐఎంఐఎంతోపాటు మరికొన్ని చిన్న పార్టీలు కలిసి థర్డ్‌ ఫ్రంట్‌గా బరిలోకి దిగాయి. వీరు కూడా ముస్లిం ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో కష్టపడుతున్నారు. అయితే, ఇది ఎంతవరకు సాధ్యమనే విషయం ఎన్నికల ఫలితాల తర్వాతే తేలే అవకాశం ఉంది. ఈ కూటమి కూడా అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఎంఐఎం 24 మంది అభ్యర్థులను బరిలోకి దించగా, అసదుద్దీన్‌ ఓవైసీ వీరి తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. హెలికాప్టర్‌లో తిరుగుతూ అన్ని స్థానాలను కవర్‌చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైసీ వచ్చే ప్రచార సభలకు భారీ సంఖ్యలో ముస్లిం ఓటర్లు తరలివస్తున్నారు. అయితే, భాజపాను ఓడించే సామర్థ్యం తమకే ఉందని, అందుకే ముస్లిం ఓటర్లు ఈ కూటమికి అనుకూలంగా ఓట్లు వేస్తారని థర్డ్‌ ఫ్రంట్‌ నేతలు భావిస్తున్నారు. ఈ కూటమిలో మొత్తం 40మంది అభ్యర్థులు ముస్లింలే ఉన్నారు.

ఇదిలాఉంటే, రెండో దశ పోలింగ్‌ జరుగుతోన్న జిల్లాల్లో ముస్లిం ఓట్ల శాతం ఎక్కువగా ఉండడంతో పార్టీలన్నీ వారిని ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని