రసవత్తరంగా మారనున్న ఖమ్మం పోరు

తాజా వార్తలు

Published : 01/01/2021 01:27 IST

రసవత్తరంగా మారనున్న ఖమ్మం పోరు

ఖమ్మం: ఖమ్మం, వరంగల్‌ నగరపాలక సంస్థలతోపాటు మరో నాలుగు పురపాలికలకు ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. నిర్దేశించిన గడువులోపే ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న వేళ ఖమ్మం బల్దియా పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. వార్డులను పునర్విభజించేందుకు బల్దియా యంత్రాంగం చర్యలకు శ్రీకారం చుట్టింది. పునర్విభజనపై పురపాలక శాఖకు లేఖ రాయడంతో ఖమ్మంలో అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. మరోవైపు ఎన్నికల సంఘం కదలికలతో నగర పోరుపై పార్టీలన్నీ దృష్టిపెట్టాయి. 

60కి పెరగనున్న నగరపాలక డివిజన్లు..

నగరపాలికలు ప్రస్తుతం 50 డివిజన్లు ఉండగా కొత్త పురపాలక చట్టం ప్రకారం డివిజన్ల సంఖ్య 60కి పెరగనుంది. ఇప్పటికే అందిన ప్రాథమిక సమాచారంతో డివిజన్లలో ఎంతమేర ఓటర్లు ఉండాలి? పెద్ద డివిజన్లలో ఓటర్ల సంఖ్యను ఎలా తగ్గించాలన్న అంశాలపై కసరత్తు చేసిన అధికారులు పునర్విభజనపై ఆదేశాలు రాగానే ప్రక్రియను మరింత ముమ్మరం చేయనున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌కు 2016 మార్చి 6న ఎన్నికలు జరిగితే మార్చి 15న కొత్త పాలక వర్గం కొలువుదీరింది. 2021 మార్చి 15తో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. త్వరలోనే ఎన్నికల నగారా మోగుతుందన్న సమాచారంతో రాజకీయ పక్షాలన్నీ ఎన్నికల భేరీకి సై అంటున్నాయి. 

అభివృద్ధి అజెండాతో ముందుకు..

గత ఎన్నికల్లో 50డివిజన్లకు గానూ 34 స్థానాలు గెలుచుకున్న తెరాస పార్టీ బల్దియాపై గులాబీ జెండా ఎగురవేసింది. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో నగరపాలక సంస్థలో ప్రస్తుతం తెరాసకు 42మంది కార్పొరేటర్ల బలం ఉంది. కాంగ్రెస్‌ 3, వామపక్షాలు 5, తెలుగుదేశం ఒకటి చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో పువ్వాడ అజయ్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నారు. అభివృద్ధి అజెండాతో ఓట్లు అభ్యర్థించేందుకు తెరాస సిద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాలోని ముఖ్య నేతలందరినీ రంగంలోకి దించిన తెరాస.. ఒక్కో నేతకు ఐదు డివిజన్లు చొప్పున బాధ్యతలు అప్పగిస్తోంది. కొత్తగా మరో పది డివిజన్లు పెరగనున్నందున ఆ ప్రాంతంలో అభ్యర్థుల అన్వేషణ చురుగ్గా సాగుతోంది. 

సత్తాచాటేందుకు విపక్షాలు సై

విపక్షాలు సైతం బల్దియా పోరులో సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. 50 డివిజన్లకు ఒక్కొక్కరిని చొప్పున జిల్లా నేతలను ఇన్‌ఛార్జిలుగా ప్రకటించింది. దుబ్బాక గెలుపు, గ్రేటర్‌లో సత్తా చాటి ఊపుమీదున్న భాజపా సైతం ఈ సారి ఖమ్మంపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా నగర శాఖలకు కొత్త కమిటీలను ప్రకటించి ఎన్నికలకు సమాయత్తమవుతోంది. వామపక్షాలు, తెలుగుదేశం సైతం సత్తా చాటేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. 

ఇవీ చదవండి..
సీఎం కేసీఆర్‌తో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ

‘సుబ్బయ్య హత్యతో నాకేం సంబంధం’
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని