Revanth Reddy: కేసీఆర్‌ కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారు: రేవంత్‌రెడ్డి

తాజా వార్తలు

Published : 18/09/2021 01:11 IST

Revanth Reddy: కేసీఆర్‌ కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారు: రేవంత్‌రెడ్డి

గజ్వేల్‌: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెరాస పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఇవాళ తెలంగాణ గడ్డకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. కానీ రాష్ట్రంలో  ప్రజలకు స్వేచ్ఛలేదు. దమ్ముంటే గజ్వేల్‌కు రావాలని తెరాస నేతలు సవాల్‌ విసిరారు. ఇసుక వేస్తే రాలనంత జనం గజ్వేల్‌ సభకు పోటెత్తారు. స్వయం పాలనకోసం నాడు రజాకార్లను తరిమికొట్టారు. గజ్వేల్‌ అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది. 1980లో మెదక్‌ నుంచి ఇందిరాగాంధీ గెలిచారు. మెదక్‌ జిల్లాలో 25 పెద్ద తరహా పరిశ్రమలు పెట్టించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియాది. కానీ, రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రంలో 12 శాతం ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవైనా ఇచ్చారా? మీ ఇంట్లో వాళ్లందరికీ పదవులు ఇచ్చారు. కొండపోచమ్మ ప్రాజెక్టు కింద 14 గ్రామాలను నట్టేట ముంచి కట్టుబట్టలతో వెళ్లగొట్టారు. 14 గ్రామాల ప్రజలకు నిలువనీడ లేకుండా చేశారు.

హరితహారం పేరుతో పోడు భూములను గుంజుకుంటున్నారు. పీజు రీయింబర్స్‌ ఇవ్వాలి, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి. ఆరోగ్యశ్రీని తక్షణమే రూ.5లక్షలకు పెంచాలి. కేసీఆర్‌ వైద్యం చేయించుకునే కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పేదలందరికీ వైద్యం అందాలి. కేసీఆర్‌ మనుమడు తినే సన్న బియ్యం మాకొద్దు. కేసీఆర్‌ మనుమడు చదివే బడుల్లో బడుగులు చదువుకోవాలి. మారుమూల పల్లెల్లో 4వేలకు పైగా బడులు బంద్‌ చేశారు. ఆ పాపం కేసీఆర్‌ది కాదా? మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే. మైనార్టీలకు రిజర్వేషన్లు 12శాతం చేస్తామని చెప్పి ఏడేళ్లు దాటింది ఇప్పటి వరకు చేయలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ తుంగలో తొక్కారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష కోట్లు బకాయి పడ్డారు’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు దామోదర రాజనర్సింహ, వి.హనుమంతరావు, గీతారెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏడున్నరేళ్ల తెరాస పాలనపై  కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన ఛార్జిషీట్‌ను మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. ఛార్జిషీట్‌లోని అంశాలను దామోదర రాజనర్సింహ ప్రజలముందుంచారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని