Shreyas Iyer: టాస్‌ ఓడితేనేం.. మ్యాచ్‌లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్

హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్‌కతా ప్లేఆఫ్స్‌ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్‌ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు.

Published : 06 May 2024 10:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌ పాయింట్ల పట్టికలో కోల్‌కతా అగ్రస్థానానికి చేరుకుంది. లఖ్‌నవూపై 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హ్యాట్రిక్‌ విక్టరీతో దాదాపు ప్లేఆఫ్స్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. గత ఆరు మ్యాచుల్లో ప్రతిసారి కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్‌ను ఓడిపోయాడు. అయితే, రెండు మినహా నాలుగు మ్యాచుల్లో కోల్‌కతా విజేతగా నిలిచింది. లఖ్‌నవూతో పోరు అనంతరం శ్రేయస్ ఇదే విషయంపై స్పందించాడు. 

‘‘మాకు మరోసారి పవర్‌ప్లేలో గొప్ప శుభారంభం దక్కింది. సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ దూకుడుగా ఆడేశారు. మా టైమౌట్‌ సమయంలో ఈ పిచ్‌పై 200 స్కోరు చేస్తే సరిపోతుందని నరైన్ అన్నాడు. కుడి, ఎడమ కాంబినేషన్‌తో ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బంది అవుతుంది. మేం చాలా మ్యాచుల్లో టాస్‌ ఓడిపోయాం. కానీ, విజేతగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. మా బౌలర్లు కట్టుదిట్టంగా ప్రణాళికలను అమలు చేశారు. ఎప్పటికప్పుడు ప్లాన్స్‌ను మార్చుకుంటూ ముందుకు సాగాం. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు స్వేచ్ఛ ఇస్తే మరింత అద్భుతంగా రాణిస్తారు. కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. సానుకూల దృక్పథంతో మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది’’ అని శ్రేయస్‌ తెలిపాడు. 

సపోర్ట్ స్టాఫ్‌ వల్లే ఇదంతా: నరైన్

‘‘టోర్నీలో మేం మెరుగైన స్థితిలో ఉన్నాం. ప్రతి మ్యాచ్‌లోనూ శుభారంభం చేయడం ముఖ్యం. అయితే, బ్యాక్‌ఎండ్‌లో సిబ్బంది సహకారం చాలా అవసరం. వారి వల్లే ఇలా రాణించేందుకు ఆస్కారం కలుగుతుంది. మన బలాలను గుర్తెరిగి అనుగుణంగా షాట్లను ఎంపిక చేసుకోవాలి. ప్రతిసారీ వర్కౌట్‌ అవుతుందని అనుకోలేం. కానీ, ప్రయత్నం మాత్రం మానుకోకూడదు. వరుణ్ చక్రవర్తి అత్యుత్తమంగా బౌలింగ్‌ చేస్తాడు. అతడు వికెట్లను తీయడంతోనే నా పని సులువైంది. జట్టులోని ప్రతి ఆటగాడు తమను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సవాళ్లను ఎదుర్కొని జట్టును విజయపథంలో నడిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు’’ అని సునీల్ నరైన్ తెలిపాడు. బ్యాటింగ్‌లో 81 పరుగులు చేసిన నరైన్... బౌలింగ్‌లో ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. 

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు.. 

  • ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల తేడాతో (98 రన్స్) విజయం సాధించడం కోల్‌కతాకిది మూడోసారి. బెంగళూరుపై (2008లో) 140 పరుగులు, దిల్లీపై (2024లో) 106 పరుగుల తేడాతో గెలిచింది.
  • కోల్‌కతా తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులను గెలుచుకున్న వారిలో ఆండ్రి రస్సెల్‌తో (15) సునీల్ నరైన్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. 
  • ఐపీఎల్‌లో లఖ్‌నవూ ఇదే అత్యధిక తేడాతో ఓడిన మ్యాచ్‌. గతంలో (2023) చెన్నై చేతిలో 81 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. అంతకుముందు గుజరాత్ చేతిలో (2022, 2023), రెండుసార్లూ 62 పరుగుల తేడాతో ఓడింది. 
  • ఐపీఎల్‌లో కోల్‌కతా - లఖ్‌నవూ మధ్య ఐదు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మూడింట్లో లఖ్‌నవూ గెలవగా.. తర్వాత రెండు మ్యాచుల్లో కోల్‌కతా విజయం సాధించింది. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో సొంతమైదానం వేదికగా జరిగిన ఏడు మ్యాచుల్లో లఖ్‌నవూ విజయాల నిష్పత్తి 4-3గా ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని