Indegene IPO: ఇండీజీన్‌ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం

Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్‌ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్‌) బిడ్లు దాఖలు చేయాలి.

Updated : 06 May 2024 10:29 IST

Indegene IPO | ముంబయి: ఆరోగ్యసంరక్షణ రంగంలోని సంస్థలకు సాంకేతిక సేవలు అందించే ఇండీజీన్‌ లిమిటెడ్ ఐపీఓ సోమవారం ప్రారంభమైంది. రూ.1,842 కోట్లు సమీకరించేందుకు సిద్ధమైంది. మే 8న పబ్లిక్‌ ఇష్యూ ముగియనుంది. ధరల శ్రేణి రూ.430-452గా నిర్ణయించింది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్‌) బిడ్లు దాఖలు చేయాలి.

ఈ ఐపీఓలో (Indegene IPO) రూ.760 కోట్ల విలువ చేసే కొత్త షేర్లను జారీ చేస్తున్నారు. మరో రూ.1,082 కోట్ల షేర్లను ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌’ కింద విక్రయిస్తున్నారు. పబ్లిక్‌ ఇష్యూలో 50 శాతం షేర్లను అర్హతగల సంస్థాగత మదుపర్లు (QIBs), 15 శాతం సంస్థాగతేతర మదుపర్లు (NIIs), 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు రిజర్వ్‌ చేశారు. ఈ కంపెనీ ఇప్పటికే యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.549 కోట్లు సమీకరించింది. రూ.452 ధర వద్ద 1.21 కోట్ల షేర్లను విక్రయించింది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, మూలధన అవసరాలు, గత కొనుగోళ్ల బకాయిలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇండీజీన్‌ను 1998లో స్థాపించారు. ఈ కంపెనీ బయోఫార్మా, బయోటెక్‌, వైద్య పరికరాల తయారీ రంగంలోని సంస్థలకు టెక్‌ ఆధారిత సేవలు అందిస్తుంది. ఉత్పత్తుల అభివృద్ధి, వాటిని మార్కెట్‌లోకి విడుదల చేయడం, క్లినికల్‌ ట్రయల్స్‌, నియంత్రణాపరమైన అంశాలు, ఫిర్యాదులు, అమ్మకాల వంటి విభాగాల్లో కంపెనీలకు తోడ్పాటునందిస్తుంది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆస్తుల విలువ రూ.2,203 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.2,364 కోట్లు, పన్నేతర లాభం రూ.266 కోట్లుగా నమోదైంది.

ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • ఐపీఓ తేదీలు: మే 6-8
  • ధరల శ్రేణి: రూ.430-452
  • షేరు ముఖ విలువ: రూ.2
  • కనీసం కొనాల్సిన షేర్ల సంఖ్య: 33 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి: రూ.14,916
  • అలాట్‌మెంట్ తేదీ: మే 9
  • రిఫండ్‌ తేదీ: మే 10
  • డీమ్యాట్‌ ఖాతాలకు షేర్ల బదిలీ: మే 10
  • లిస్టింగ్‌ తేదీ: మే 13

(గమనిక: ఐపీఓలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. పై వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. ఐపీఓలో మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని