కోల్‌కతా నం.1

కోల్‌కతాది అదే జోరు. ఈ సీజన్‌లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్‌రైడర్స్‌.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్‌ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది.

Updated : 06 May 2024 06:51 IST

ప్లేఆఫ్స్‌లో చోటు దాదాపు ఖాయం
98 పరుగుల తేడాతో లఖ్‌నవూ చిత్తు
ఎనిమిదో విజయంతో పట్టికలో పైకి
లఖ్‌నవూ

కోల్‌కతాది అదే జోరు. ఈ సీజన్‌లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్‌రైడర్స్‌.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్‌ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో లఖ్‌నవూను ఏకంగా 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది నైట్‌రైడర్స్‌. బ్యాటుతో రెచ్చిపోతున్న నరైన్‌ మరోసారి విధ్వంసం సృష్టించడంతో కొండంత లక్ష్యాన్ని నిర్దేశించిన కోల్‌కతా.. వరుణ్‌, రసెల్‌, నరైన్‌ల సూపర్‌ బౌలింగ్‌తో సూపర్‌జెయింట్స్‌ను కట్టిపడేసింది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయాల హ్యాట్రిక్‌ కొట్టింది. సునీల్‌ నరైన్‌ (81; 39 బంతుల్లో 6×4, 7×6) రెచ్చిపోవడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 98 పరుగుల తేడాతో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. నరైన్‌ మెరుపులతో మొదట కోల్‌కతా 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. నవీనుల్‌ హక్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో లఖ్‌నవూ తడబడింది. హర్షిత్‌ రాణా (3/24), వరుణ్‌ చక్రవర్తి (3/30), రసెల్‌ (2/17) ధాటికి 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. 36 పరుగులు చేసిన స్టాయినిస్‌ టాప్‌ స్కోరర్‌. లఖ్‌నవూకు 11 మ్యాచ్‌ల్లో ఇది అయిదో ఓటమి. భారీ తేడాతో ఓడడం లఖ్‌నవూ నెట్‌రన్‌రేట్‌ను బాగా దెబ్బ తీసింది.

లఖ్‌నవూ తడబాటు: ఛేదనలో లఖ్‌నవూ తేలిపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుని ఓటమిపాలైంది. నిజానికి మొదట్లో లఖ్‌నవూ కాస్త మెరుగ్గానే కనిపించింది. ఓపెనర్‌ అర్షిన్‌ (9) వికెట్‌ను త్వరగా కోల్పోయినప్పటికీ స్టాయినిస్‌ దూకుడుతో 7.2 ఓవర్లలో 70/1తో నిలిచింది. స్టార్క్‌ ఓవర్లో స్టాయినిస్‌ మూడు ఫోర్లు కొట్టాడు. ధాటిగా ఆడకున్నా.. మరోవైపు రాహుల్‌ (25; 21 బంతుల్లో 3×4) నిలబడ్డాడు. కానీ రాహుల్‌ను ఔట్‌ చేయడం ద్వారా రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని హర్షిత్‌ విడగొట్టడంతో లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ గతి తప్పింది. ఆ తర్వాత ఆ జట్టుకు ఏ దశలోనూ గెలుపు అవకాశాలు ఉన్నట్లు కనపడలేదు. లఖ్‌నవూ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోగా.. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయింది. దీపక్‌ హుడా (5), స్టాయినిస్‌, పూరన్‌ (10), బదోని (15), టర్నర్‌ (16) పెవిలియన్‌కు క్యూకట్టారు. స్టాయినిస్‌, పూరన్‌లను రసెల్‌ ఔట్‌ చేయగా.. హుడా, టర్నర్‌లను వరుణ్‌ చక్రవర్తి వెనక్కి పంపాడు. 14 ఓవర్లలో స్కోరు 125/7. అప్పటికే లఖ్‌నవూ ఓటమి ఖాయమైపోయింది. మిగతా ఆట ఓటమి అంతరాన్ని తగ్గించుకోవడానికే. టెయిలెండర్లేమీ అద్భుతాలు చేయలేదు.

నరైన్‌ విధ్వంసం: నరైన్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో అంతకుముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. జోరు కొనసాగించిన నరైన్‌.. సిక్స్‌ల మోతతో మరోసారి పరుగుల వరద పారించాడు. రెండు సార్లు ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం అతడికి కలిసొచ్చింది. ఇతర బ్యాటర్లు కూడా తలో చేయి వేశారు. కోల్‌కతా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. ముందు సాల్ట్‌ (32; 14 బంతుల్లో 5×4, 1×6) ఉతుకుడు మొదలెట్టాడు. స్టాయినిస్‌ బౌలింగ్‌లో బౌండరీతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన అతడు.. మోసిన్‌ ఓవర్లో సిక్స్‌ దంచేశాడు. సాల్ట్‌, నరైన చెరో రెండు ఫోర్లు కొట్టడతో ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో నవీనుల్‌ 19 పరుగులు సమర్పించుకున్నాడు. వీర బాదుడుకు అది ఆరంభం మాత్రమే..ఆ తర్వాత నరైన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అలవోకగా సిక్స్‌లు, ఫోర్లు బాదేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మోసిన్‌ ఓవర్లో మూడు ఫోర్లు, సిక్స్‌ బాదేసిన అతడు.. సాల్ట్‌ ఔటైనా రఘువంశీ అండగా నిలవడంతో ధనాధన్‌ షాట్లతో విధ్వంసాన్ని కొనసాగించాడు .కృనాల్‌ బౌలింగ్‌లో సిక్స్‌, యశ్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో సిక్స్‌ దంచేసిన అతడు.. బిష్ణోయ్‌ బంతిని బౌండరీకి తరలించి 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. స్టాయినిస్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్లో  ఏకంగా మూడు సిక్స్‌లు బాదేశాడు. కోల్‌కతా 129/1తో తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ తర్వాతి ఓవర్లో బిష్ణోయ్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన నరైన్‌.. మరో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ సహకరించిన రఘువంశీ (32; 26 బంతుల్లో 3×4, 1×6)తో రెండో వికెట్‌కు అతడు 79 పరుగులు జోడించాడు. ఆ తర్వాత.రసెల్‌ (12), రింకు (16) ఎక్కువసేపేమీ నిలవలేదు. ప్రమాదకర రసెల్‌ను నవీనుల్‌ ఔట్‌చేయగా.. రఘువంశీని యుధ్‌వీర్‌ వెనక్కి పంపాడు. ఆ తర్వాత రింకును కూడా నవీనుల్‌ పెవిలియన్‌ చేర్చాడు. 18 ఓవర్లు మగిసే సరికి కోల్‌కతా 200/5తో నిలిచింది. కోల్‌కతా ఇన్నింగ్స్‌కు రమణ్‌దీప్‌ సింగ్‌ (25 నాటౌట్‌; 6 బంతుల్లో 1×4, 3×6) మెరుపు ముగింపునిచ్చాడు .అతడు చెలరేగిపోవడంతో ఆఖరి రెండు ఓవర్లలో ఆ జట్టుకు 35 పరుగులు వచ్చాయి. యుధ్‌వీర్‌ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన రమణ్‌సింగ్‌.. ఆఖరి ఓవర్లో యశ్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్స్‌ దంచేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (23; 15 బంతుల్లో 3×4)తో ఆరో వికెట్‌కు అతడు 24 పరుగులు జోడించాడు .లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ (1/33) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.

కోల్‌కతా ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) రాహుల్‌ (బి) నవీనుల్‌ 32; నరైన్‌ (సి) పడిక్కల్‌ (బి) రవి బిష్ణోయ్‌ 81; రఘువంశీ (సి) రాహుల్‌ (బి) యుధ్‌వీర్‌ 32, రసెల్‌ (సి) గౌతమ్‌ (బి) నవీనుల్‌ 12; రింకు సింగ్‌ (సి) స్టాయినిస్‌ (బి) నవీనుల్‌ 16; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) రాహుల్‌ (బి)  యశ్‌ ఠాకూర్‌ 23; రమణ్‌దీప్‌ సింగ్‌ నాటౌట్‌ 25; వెంకటేశ్‌ అయ్యర్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 235;  వికెట్ల పతనం: 1-61, 2-140, 3-167, 4-171, 5-200, 6-224; బౌలింగ్‌: స్టాయినిస్‌ 2-0-29-0; మోసిన్‌ ఖాన్‌ 2-0-28-0; నవీనుల్‌ హక్‌ 4-0-49-3; యశ్‌ ఠాకూర్‌ 4-0-46-1; కృనాల్‌ పాండ్య 2-0-26-0; రవి బిష్ణోయ్‌ 4-0-33-1; యుధ్‌వీర్‌ సింగ్‌ 2-0-24-1

లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) హర్షిత్‌ 25; అర్షిన్‌ కులకర్ణి (సి) రమణ్‌దీప్‌ (బి) స్టార్క్‌ 9; స్టాయినిస్‌ (సి) హర్షిత్‌ (బి) రసెల్‌ 36; దీపక్‌ హుడా ఎల్బీ (బి) వరుణ్‌ 5; పూరన్‌ (సి) సాల్ట్‌ (బి) రసెల్‌ 10; బదోని (సి) స్టార్క్‌ (బి) నరైన్‌ 15; టర్నర్‌ (సి) అండ్‌ (బి) వరుణ్‌ 16; కృనాల్‌ (సి) సాల్ట్‌ (బి) హర్షిత్‌ 5; యుధ్‌వీర్‌ (సి) రసెల్‌ (బి) వరుణ్‌ 7; రవి బిష్ణోయ్‌ ఎల్బీ (బి) హర్షిత్‌ 2; నవీనుల్‌ నాటౌట్‌ 0 ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (16.1 ఓవర్లలో ఆలౌట్‌) 137; వికెట్ల పతనం: 1-20, 2-70, 3-77, 4-85, 5-101, 6-109, 7-125, 8-129, 9-137; బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 2-0-21-0; స్టార్క్‌ 2-0-22-1; నరైన్‌ 4-0-22-1; హర్షిత్‌ రాణా 3.1-0-24-3; వరుణ్‌ చక్రవర్తి 3-0-30-3; రసెల్‌ 2-0-17-2

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని