KL Rahul: కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్

కోల్‌కతా చేతిలో భారీ ఓటమితో లఖ్‌నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది.

Published : 06 May 2024 12:12 IST

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా చేతిలో ఘోర ఓటమితో లఖ్‌నవూ ప్లేఆఫ్స్ రేసులో కాస్త వెనుకబడింది. భారీ లక్ష్య ఛేదనలో విఫలమైన లఖ్‌నవూ 98 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన 235/6 స్కోరు సాధించగా.. లఖ్‌నవూ 137 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలం కావడంపై కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ పేసర్లు యుధ్విర్‌ సింగ్‌, యశ్‌ ఠాకూర్, మోసిన్‌ ఖాన్ 8 ఓవర్లు వేసి 98 పరుగులు ఇచ్చారు. అనుభవ లేమి కారణంగా హిట్టర్లను ఎదుర్కోవడంలో విఫలమైనట్లు రాహుల్ పేర్కొన్నాడు. 

‘‘రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ ఇంకా ఈజీగా ఉంటుంది. భారీ లక్ష్యాలను ఛేదించేటప్పుడు హిట్టింగ్‌ చేయాల్సిందే. ఒక్కోసారి వికెట్లు పడినా ఆగకూడదు. అయితే, మేం ఈ మ్యాచ్‌లో ఘోర ప్రదర్శన చేశామని అనుకుంటున్నా. ఇటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ విఫలమయ్యాం. సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడారు. వారు బ్యాటింగ్‌ చేసిన తీరుకు ఎలాంటి బౌలరైనా ఒత్తిడికి గురవుతాడు. ఇక మా కుర్రాళ్లు కూడా దానికి అతీతులు కాదు. వారు ఇంకా నేర్చుకోవాలి. ఒత్తిడిని హ్యాండిల్ చేయడం అలవాటు చేసుకోవాలి. మ్యాచ్‌కు ముందు మేం పక్కాగా సిద్ధమై బరిలోకి దిగాం. కానీ, కోల్‌కతా బ్యాటర్లు మాత్రం ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ప్రణాళిలను తయారు చేసుకోవడమే కాకుండా సరిగ్గా అమలు చేసినప్పుడే ఫలితం అనుకూలంగా వస్తుంది. మా యువ బౌలర్లు శ్రమను తక్కువ చేయడం లేదు. చాలా కష్టపడ్డారు. మరిన్ని విషయాలను త్వరలోనే నేర్చుకోవాలి. అది జట్టుకు ఎంతో ప్రయోజనం. 

కోల్‌కతా జట్టులో హిట్టర్లు ఎక్కువ. వారిని ఎదుర్కొనే క్రమంలో కొన్ని పొరపాట్లు చేశాం. మా తప్పులను సరి చేసుకుని మిగతా మ్యాచుల్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం. మా సొంతమైదానంలో ఇదే మా చివరి మ్యాచ్‌. మిగతా మూడింటిని ప్రత్యర్థి జట్ల స్టేడియాల్లోనే ఆడాల్సి ఉంటుంది. టాప్‌ -4లో ఉండాలంటే అన్ని మ్యాచుల్లోనూ గెలవాలనే దానిపై మాకు స్పష్టత ఉంది. మున్ముందు నిర్భయంగా ఆడేందుకు మాకు స్వేచ్ఛ లభించినట్లే. విజయం సాధించి మళ్లీ ప్లేఆఫ్స్ రేసులోకి వస్తాం’’ అని కేఎల్ రాహుల్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని