‘సీఎం బినామీ సంస్థలే వేలంలో పాల్గొన్నాయి’

తాజా వార్తలు

Updated : 17/07/2021 16:27 IST

‘సీఎం బినామీ సంస్థలే వేలంలో పాల్గొన్నాయి’

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: ఒకవైపు ధనిక రాష్ట్రం అని చెబుతూనే మరోవైపు ప్రభుత్వ భూములను విక్రయిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ప్రభుత్వ అవసరాల కోసం భూములు కావాలంటే ఏం చేస్తారు? ముఖ్యంగా ఆస్పత్రులు, విద్యాలయాలకు భూమి కావాలంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. భవిష్యత్‌ అవసరాలను అంచనా వేయకుండా తెలంగాణ జాతి సంపదను సీఎం కేసీఆర్‌ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విక్రయిస్తూ పోతే చివరకు శ్మశానాలకు కూడా స్థలం దొరకని పరిస్థితులు నెలకొంటాయన్నారు. గాంధీభవన్‌లో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు.

కోకాపేట భూములను వేలం వేయడం ద్వారా రూ.2వేల కోట్లు వచ్చాయని హెచ్ఎండీఏ ప్రకటించింది. ఆన్‌లైన్‌ టెండర్‌ అని చెప్తూనే.. పాలకవర్గం బినామీలు వేలంలో పాల్గొన్నాయి. తెరాస నేతల కుటుంబాల వారే భూములు కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం భూములు అమ్ముతుంటే తెరాస విమర్శించింది. ఆన్‌లైన్‌ ద్వారా జరిగే వేలంలో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటాయని.. తద్వారా ఇక్కడ ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమలను నెలకొల్పుతాయని చెప్పారు. ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మాయమాటలు చెప్పారు. చివరికి వేలంలో సీఎం కేసీఆర్‌ బినామీ సంస్థలే పాల్గొన్నాయి. భూముల వేలంలో నిబంధనలు ఉల్లంఘించారు. వేలంలో పాల్గొనవద్దని కొందరిని బెదిరించారు. టెండర్లు వేస్తే నిర్మాణాలకు అనుమతులు రావని మరి కొందరిని బెదిరించారు. ఐదు కంపెనీల వారు కలిసి రూ.వెయ్యి కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారు’’ అని రేవంత్‌ ఆరోపించారు.

ల్యాండ్ మాఫియాకు తెరలేపింది..

‘‘కోకాపేటలో ఎకరా రూ.50 కోట్లకు తక్కువ ధర లేదు.  అమ్మిన భూముల్లో 50 అంతస్తుల భవనాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతోంది. భూముల విక్రయాలతో తెరాస ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు తెరలేపింది. ఎకరం రూ.60 కోట్లు పలికిన భూమి మినహా మిగతా భూములకు మళ్ళీ టెండర్లు పిలవాలి. స్విస్‌ ఛాలెంజ్ విధానం ప్రకారం టెండర్లను ఆహ్వానించాలి. తరాల నుంచి వస్తున్న భూములను అమ్మే హక్కు సీఎంకు లేదు. నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోతే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ప్రధాని దృష్టికి తీసుకెళ్తాను. నా దగ్గర ఉన్న ఆధారాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందిస్తా. నా ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం, భాజపా స్పందిస్తుందా? లేదా? అనేది చూస్తా. తెరాస, భాజపా మధ్య రహస్య ఒప్పందం ఉందా? లేదా? అనేది ఇప్పుడు తేలిపోతుంది’’ అని రేవంత్‌ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని