Ap Politics: రాజీనామా చేస్తానని గోరంట్ల ఎప్పుడూ చెప్పలేదు: చినరాజప్ప

తాజా వార్తలు

Updated : 19/08/2021 19:18 IST

Ap Politics: రాజీనామా చేస్తానని గోరంట్ల ఎప్పుడూ చెప్పలేదు: చినరాజప్ప

రాజమహేంద్రవరం: తెదేపా సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెదేపాకు రాజీనామా చేయనున్నారంటూ వస్తున్న ప్రచారం నేపథ్యంలో తెదేపా నేతలు ఒక్కొక్కరిగా ఆయనతో సమావేశమవుతున్నారు. తాజాగా మాజీ మంత్రులు చినరాజప్ప, జవహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమహేంద్రవరంలోని బచ్చయ్య చౌదరి నివాసంలో ఆయనను కలిసి మాట్లాడారు.

అనంతరం చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆవిర్భావం నుంచి గోరంట్ల పార్టీలో ఉన్నారు. ఆయన చెప్పిన విషయాలను పార్టీ అధినేత చంద్రబాబుకు వివరించాం. తనకు కొన్ని సమస్యలు ఉన్నాయని బుచ్చయ్య చెప్పారు. రాజమహేంద్రవరంలో ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నా్యి. తనను కొందరు గౌరవించడం లేదని అంటున్నారు. రాజీనామా చేస్తానని గోరంట్ల ఎప్పుడూ చెప్పలేదు. తెదేపా సీనియర్‌ నేతగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా గోరంట్లకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది’’ అని చినరాజప్ప వెల్లడించారు.

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గోరంట్ల పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సుశిక్షిత నేత అని.. ఆయన రాజీనామా చేయరన్నారు. పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలు పరిష్కరించుకుంటామని నల్లమిల్లి స్పష్టం చేశారు.

అన్ని విషయాలు త్వరలో చెబుతా: బుచ్చయ్య చౌదరి

తెదేపా నేతలు కలిసిన అనంతరం బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ‘‘పార్టీకి సంబంధించి ప్రజలకు చెప్పాల్సినవి చెప్తాను. స్థానికంగా ఉన్న ఇబ్బందులు పెద్ద సమస్య కాదు. వాటిని లెక్క చేయను. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల సమస్యలు, అభిప్రాయాలు, పార్టీ నిర్మాణానికి సంబంధించి నా దృష్టికి వచ్చిన విషయాలు మాట్లాడతాను. త్వరలోనే అన్ని విషయాలు మీడియాకి తెలియజేస్తాను. ఇవన్నీ వ్యక్తిగత సమస్యలు కాదు. నన్ను కలిసిన నాయకులే చంద్రబాబును కలిసి మాట్లాడుతారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ అంతర్గత విషయాలు.. బయట మాట్లాడలేను. ఇది ఎవరినీ ప్రమోట్ చేయడానికి చేస్తున్నది కాదు. ముక్కుసూటిగా మాట్లాడే నైజం నాది.. ఏదైనా ఉంటే అందరినీ పిలిచి చెబుతాను. నాకు తెలుగుదేశం పార్టీతో 30 ఏళ్ల అనుబంధం ఉంది. సీనియర్ కార్యకర్తగా నీతివంతమైన పరిపాలన నుంచి వచ్చాను. ఆత్మగౌరవం, క్రమశిక్షణతో ఉన్నాను. రామారావు గారు అదే నేర్పించారు. ఈరోజు వరకు దాన్నే పాటించాను. రేపు ఆత్మగౌరవం కోసమే పోరాడతాను. పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నాను. నా వారసులు కుటుంబ సభ్యులు ఎవరూ పార్టీలో లేరు’’ అని బుచ్చయ్య చౌదరి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని