సంక్షేమ పాలనలో కేసీఆర్‌ విఫలం: షర్మిల

తాజా వార్తలు

Published : 09/07/2021 01:19 IST

సంక్షేమ పాలనలో కేసీఆర్‌ విఫలం: షర్మిల

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాజన్న సంక్షేమ పాలన తీసుకురావడమే ధ్యేయమంటూ తెలంగాణ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన దివంగత రాజశేఖర్‌రెడ్డి తనయ షర్మిల వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. వైఎస్‌ఆర్‌ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌ రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడే ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... వైఎస్‌ఆర్‌ చెరగని చిరునవ్వు కోట్లాది ప్రజల్లో నిలిచిన సంక్షేమ సంతకమన్నారు. వైఎస్‌ఆర్‌ రాజకీయాలకతీతంగా సాయం చేశారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌ పుట్టిన రోజునే పార్టీ ప్రకటించడం ఆనందదాయకమన్నారు. సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పెట్టినట్టు చెప్పారు. సమానత్వం, స్వయం సమృద్ధి, సంక్షేమం... పార్టీ సిద్ధాంతమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఇవాళ్టికి కూడా పేదరికం పోలేదని, పేదరికం నుంచి కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బయటపడిందని విమర్శించారు. సంక్షేమ పాలనలో కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు. కేసీఆర్‌ సంక్షేమమంటే ‘గారడీ మాటల గొప్పలు.. చేతికి చిప్పలు’ అని ఎద్దేవా చేశారు.  తెలంగాణలో ప్రజలు ఇప్పటికీ వైఎస్‌ఆర్‌ పాలనను తలచుకుంటున్నారన్నారు. పేదరికాన్ని రూపుమాపడమే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ లక్ష్యమని షర్మిల స్పష్టం చేశారు. ‘‘కరోనా వల్ల ఎంతో మంది నష్టపోయారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉంటే ఎంతో మందికి భరోసా ఉండేది. సంక్షేమంలో నంబర్‌ వన్‌ అని చెప్పుకునే కేసీఆర్‌.. కరోనా వల్ల అప్పులపాలయిన వారికి ఏం చెబుతారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కేసీఆర్‌ మోసం చేశారు. కంట్లో కారం కొట్టి నోట్లో బెల్లం పెట్టినట్టు చేస్తున్నారు. కుటుంబాలతో పాటు ఏకంగా రాష్ట్రాన్ని కూడా అప్పులమయం చేశారు. రూ.4లక్షల కోట్లు అప్పు చేశారు.. ఇవి ఎవరి జేబులోకి పోయాయి’’ అని షర్మిల ప్రశ్నించారు.

వైఎస్‌ఆర్‌ వారసులం మేమే

‘‘కృష్ణానదిపై రెండు సంవత్సరాల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే.. కేసీఆర్‌కు ఇప్పుడే తెలివొచ్చిందా?. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెట్టొచ్చు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించొచ్చు. కానీ, రెండు నిమిషాలు కూర్చుని సమస్యను పరిష్కరించుకోలేరా?. మరోసారి కూర్చుని నీటి సమస్యపై ఎందుకు చర్చించరు. సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం చూస్తూ కూర్చుంది. సమస్యను పరిష్కరించుకోవాలనే చిత్తశుద్ధి ఎవరిలోనూ లేదు. న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నీటిబొట్టునూ వదులుకోం. ఇతర ప్రాంతానికి చెందిన నీటి చుక్కను కూడా మేం తీసుకోం. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలన్నదే మా సిద్ధాంతం. ఎంతోమంది నేతలకు వైఎస్‌ఆర్‌ రాజకీయ భిక్షపెట్టారు. వైఎస్‌ఆర్‌ను తిడుతుంటే ఈ కాంగ్రెస్‌ నేతలు చప్పుడు చేయటం లేదు. కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ఆర్‌ పేరు ఉచ్ఛరించే అర్హత లేదు. వైఎస్‌ఆర్‌ అసలైన వారుసులం మేమే. నేటి నుంచి 100 రోజుల తర్వాత పాదయాత్ర చేస్తా’’ అని షర్మిల తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని