కరోనాకు బలవుతున్న పేదలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాకు బలవుతున్న పేదలు

 ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేయాల్సిందే
 భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: చికిత్స ఖర్చులు భరించలేక పేదలు ఇంటివద్దే ఉంటూ కరోనాకు బలవుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాల్ని కాపాడాలన్న ధ్యాస తెరాస ప్రభుత్వానికి ఉంటే ‘ఆయుష్మాన్‌ భారత్‌’ వైద్య బీమా పథకాన్ని అమలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించేందుకు భాజపా సిద్ధంగా ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా హామీ ఇస్తున్నా. ప్రజల ప్రాణాల్ని కాపాడాలన్న ఆలోచనతో తీసుకునే నిర్ణయాలను సమర్థిస్తాం’’ అని తెలిపారు. మంగళవారం ఆయన ఆన్‌లైన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కేంద్రం తగినంత ఆక్సిజన్‌ ఇస్తున్నా, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు ఇచ్చినా..అవి బ్లాక్‌మార్కెట్‌కు వెళ్తున్నాయి. రూ.400 సిలిండర్‌ ధర రూ.4 వేలకు పెరగడం, ఒక్కో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ధర రూ.30 వేలు, రూ.40 వేలు కావడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. పాతబస్తీలో రాత్రి కర్ఫ్యూ అమలుకావట్లేదు. మజ్లిస్‌ పార్టీ అంటే కేసీఆర్‌  భయపడుతున్నారు’’ అని సంజయ్‌ విమర్శించారు.
కేంద్రం ఇచ్చినవి ఇవి..
‘‘రాష్ట్రానికి అడిగినదాని కంటే ఎక్కువగా 440 టన్నుల ఆక్సిజన్‌ని కేంద్రం కేటాయించినా తెరాస సర్కారు సరిగా తెచ్చుకోలేకపోతోంది. తెలంగాణకు 1.20 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను, 1,250 వెంటిలేటర్లను కేంద్రం ఇచ్చింది. చాలా జిల్లాల్లో వాటిని వాడకుండా పక్కనపెట్టారు. రాష్ట్రానికి 5 ఆక్సిజన్‌ ప్లాంట్లను కేటాయించింది. గత డిసెంబరులోనే నిధులు మంజూరు చేసినా రాష్ట్రం ఏర్పాటు చేయలేదు. మరో 8 ఆక్సిజన్‌ ప్లాంట్లకు నిధులివ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది’’ అని సంజయ్‌ వివరించారు. కొవిడ్‌ కేసులు, మరణాలపై సీఎం వాస్తవ నివేదికలు పంపితే కేంద్రం మరింత సాయమందిస్తుందని, ఈ విషయంలో చొరవ తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘ప్రధానికి సీఎం సలహాలిచ్చారట. మోదీ శభాష్‌ అన్నారట. ఈ ప్రచారం చూసి జనం నవ్వుకుంటున్నారు. అంతర్గత సమావేశ విషయాల్ని బయటకు చెబుతూ లీకుల సీఎంగా మారారు’ అంటూ సంజయ్‌ ఎద్దేవా చేశారు.
ప్రగతిభవన్‌తో సంబంధం ఉండొచ్చు
‘న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో పుట్ట మధును మూడురోజుల విచారణ తర్వాత విడిచిపెట్టడంపై అనుమానాలున్నాయి.. ఆయన చేసిన అరాచకాలకు ప్రగతిభవన్‌తో సంబంధం ఉందని విచారణలో తెలిసి ఉండొచ్చు’ అని సంజయ్‌ ఆరోపించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు