ప్రభుత్వ భూముల అమ్మకాన్ని అడ్డుకుంటాం
close

ప్రధానాంశాలు

ప్రభుత్వ భూముల అమ్మకాన్ని అడ్డుకుంటాం

సీఎల్పీ నేత భట్టివిక్రమార్క

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నేటి వరకు అమ్మిన ప్రభుత్వ భూములు, తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సర్కారు భూముల వేలానికి ఎవరూ ముందుకురావద్దని కోరారు. ఒకవేళ ఇప్పుడెవరైనా కొన్నా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక వాటిని స్వాధీనం చేసుకొంటుందని హెచ్చరించారు. భూముల అమ్మకాన్ని ఆపేందుకు సీఎల్పీ పక్షాన గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు. భట్టివిక్రమార్క అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశం ఆదివారం జూమ్‌ యాప్‌ ద్వారా జరిగింది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ.లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై పడుతోందన్నారు. అప్పులు, అమ్మకాలతో కేసీఆర్‌ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని మండిపడ్డారు. భూముల అమ్మకాన్ని ఆపేందుకు జిల్లాలవారీగా కార్యాచరణ ప్రణాళిక తీసుకురానున్నట్లు భట్టి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో భూముల అమ్మకాలను వ్యతిరేకించిన తెరాస.. ఈ రోజు అమ్మకాలకు ఎందుకు తెరలేపిందో చెప్పాలన్నారు. సీఎల్పీ నేతగా విఫలమయ్యారంటూ అధిష్ఠానానికి వీహెచ్‌ ఫిర్యాదు చేయడంపై స్పందిస్తూ.. తన పనితీరుపై ఆయనకంటూ సొంత అభిప్రాయం ఉంటుందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని