కేసీఆర్‌ను కాదని వెళ్లిన వారు కనుమరుగే
close

ప్రధానాంశాలు

కేసీఆర్‌ను కాదని వెళ్లిన వారు కనుమరుగే

 ఈటలకూ అదే పరిస్థితి వస్తుంది

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కేసీఆర్‌ను కాదని వెళ్లిన వారు కనుమరుగయ్యారని.. ఈటల రాజేందర్‌కూ అదే గతి పడుతుందని శాసనసభ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. ఈటల భాజపాలో చేరేందుకు ఆరేళ్ల క్రితమే పథకం వేసుకున్నారని, ఇప్పుడు ఆస్తులన్నీ పోయే పరిస్థితి ఏర్పడడంతో ఆ పార్టీ శరణుజొచ్చారని దుయ్యబట్టారు.  మంగళవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకిచ్చే గౌరవం అపారమైనది.  అందరికన్నా ఎక్కువగా ప్రేమను, పదవులను ఆయన రాజేందర్‌కు పంచారు. ఈటలది ఆస్తుల ఆరాటం, అస్తిత్వ పోరాటం. తెరాస ఇంకా వందేళ్లు సుస్థిరంగా ఉంటుంది’’ అని వినయ్‌ భాస్కర్‌ చెప్పారు.
ఈటలే ఫ్యూడలిస్టు: కడియం
ఈనాడు, వరంగల్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ దిల్లీలో భాజపాలో చేరే సందర్భంలో ఫ్యూడలిస్టు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేయడాన్ని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తప్పుపట్టారు. రూ.వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు, ప్యాలెస్‌లాంటి ఇల్లు కట్టిన ఈటల రాజేందరే ఫ్యూడలిస్టు అని ధ్వజమెత్తారు. మంగళవారం హన్మకొండలో విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడుతూ, ఈటల తన సిద్ధాంతాలను పక్కన పెట్టి భాజపాలో ఎలా చేరారని ప్రశ్నించారు. ఆ పార్టీలో చేరిన మొదటి రోజే ఈటలకు పరాభవం ఎదురైందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని