మిషన్‌ 2024
close

ప్రధానాంశాలు

మిషన్‌ 2024

నేడు దిల్లీలో ప్రతిపక్షాల భేటీ 
సంయుక్తంగా నిర్వహిస్తున్న పవార్‌, సిన్హా
ప్రశాంత్‌ కిశోర్‌తో మరాఠా నేత మంతనాలు
మూడో కూటమి ఏర్పాటు దిశగా అడుగులు

ఈనాడు, దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జాతీయ రాజకీయాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ప్రస్తుతం భాజపా, కాంగ్రెస్‌లు కేంద్రాలుగా రాజకీయాలు సాగుతున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి ఏర్పాటుకు చాలారోజుల తర్వాత విభిన్న రాజకీయ పార్టీలు ఒక వేదిక మీదికి వస్తున్నాయి. రాజకీయాల్లో అత్యంత సీనియర్లుగా ఉన్న ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, ఇటీవల తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాలు సంయుక్తంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. మిషన్‌ 2024 పేరుతో భాజపాను ఉమ్మడిగా ఎదుర్కోవాలన్న లక్ష్యంతో అన్ని పక్షాలను ఏకం చేసే పనిని ఈ సమావేశం ద్వారా మొదలుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం సాయంత్రం దిల్లీలోని పవార్‌ నివాసంలో సమావేశం జరగనుంది. ఈ నెల 11న తొలిసారి ముంబయిలో పవార్‌ను కలిసి రాజకీయ ఏకీకరణపై చర్చించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సోమవారం మరోసారి ఆయన్ని కలిశారు.

బెంగాల్‌లో గెలుపు.. సరికొత్త ఊపు

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ హోరాహోరీ పోరులో భాజపాను మమతా బెనర్జీ ఓడించడం ప్రతిపక్షాలకు ఉత్సాహాన్నిచ్చింది. అలాంటి పట్టుదలతో ఉన్న పార్టీలన్నీ మంగళవారం నాటి సమావేశంలో పాల్గొనడానికి సుముఖత వ్యక్తంచేసినట్లు సమాచారం. తొలుత మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడిగా పోరాటం మొదలుపెట్టి క్రమంగా ఆయనను ఢీకొట్టే నేతను ఎంపికచేసే దిశగా ప్రతిపక్షాలు పయనించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాపై ప్రత్యామ్నాయ కూటమిని నిలబెట్టి అక్కడి ఫలితాలను భవిష్యత్తు కార్యాచరణకు వేదికగా మలచుకొనే ఆలోచనతోనే ఈ సమావేశానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. యశ్వంత్‌సిన్హా వ్యవస్థాపకునిగా ఉన్న రాష్ట్రమంచ్‌ ద్వారా నేతలకు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), యశ్వంత్‌ సిన్హా (తృణమూల్‌), సంజయ్‌ సింగ్‌ (ఆప్‌), డి.రాజా (సీపీఐ) వంటి 15 మంది నేతలతో పాటు మాజీ సీఈసీ ఎస్‌.వై.ఖురేషి, సీనియర్‌ న్యాయవాది కె.టి.ఎస్‌.తులసి, బాలీవుడ్‌ ప్రముఖులు జావేద్‌ అఖ్తర్‌, ప్రీతీష్‌ నంది, ప్రముఖ పాత్రికేయుడు కరణ్‌థాపర్‌ తదితరులు దీనికి హాజరవుతారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ ముంబయిలో తెలిపారు.--


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని