పరిస్థితులు చేయిదాటిపోతేనే.. అలా ఆలోచిస్తా
close

తాజా వార్తలు

Published : 25/07/2020 00:19 IST

పరిస్థితులు చేయిదాటిపోతేనే.. అలా ఆలోచిస్తా

అదే నా చివరి కోరికగా ఉండాలి : విరాట్‌ కోహ్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక కెప్టెన్‌గా తానెప్పుడూ జట్టు విజయాల గురించి మాత్రమే ఆలోచిస్తానని.. ఆ విషయంలో రాజీపడడం తనకు ఇష్టం ఉండదని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. అదే తన కెప్టెన్సీ విజయానికి ముఖ్య కారణమని చెప్పాడు. కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌తో తాజాగా ముచ్చటించిన సందర్భంగా కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ విజయవంతమవ్వడానికి ముఖ్య కారణం ఏంటని అడగ్గా.. ‘ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ఫలితం కోసం రాజీపడను. మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం నాకు చివరి అవకాశంగా ఉండాలి’ అని టీమ్‌ఇండియా సారథి పేర్కొన్నాడు.

‘ఒకవేళ భారత్‌ గెలవడానికి చివరి రోజు ప్రత్యర్థి జట్టు 300 పరుగులు లక్ష్యంగా నిర్దేశిస్తే ఆటగాళ్లకు ఒకటే చెబుతా. మనం ఆ స్కోరు కోసం ప్రయత్నిద్దామని అంటా. సెషన్‌కు వంద పరుగుల చొప్పున బాదితే సరిపోతుందని, ఒకవేళ తొలి సెషన్‌లో వికెట్లు కోల్పోయి 80 పరుగులే చేసినా చివరి సెషన్‌లో 120 పరుగులు చేద్దామని వివరిస్తా. అలాగే డ్రా చేసుకోవడం నాకు నచ్చదు. పరిస్థితులు మరీ చేయిదాటిపోతే తప్ప దాని గురించి ఆలోచించను. చివరి గంటలో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు డ్రా చేసుకోవాలని అనుకుంటా’ అని కోహ్లీ వివరించాడు. 

ఒక ఆటగాడికి ఓడిపోతామనే భయమే అత్యంత ప్రతికూల అంశమని, అది ఆ ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని చెప్పాడు. అలాగే మ్యాచ్‌ను మలుపు తిప్పే ఘటనలు చోటుచేసుకుంటే ఆటగాళ్లు వావ్‌ అంటారన్నాడు. తన లక్ష్యం ఒక్కటేనని, టీమ్‌ఇండియాను చూసి ఎవరైనా ఎంత మంచి జట్టు అని మెచ్చుకోవాలని తెలిపాడు. 2014లో ధోనీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక కోహ్లీ ఆ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచీ ఇప్పటివరకు 55 టెస్టులకు నాయకత్వం వహించిన అతడు 33 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. దీంతో భారత్‌ తరఫున అత్యంత విజయవంతమైన టెస్టు సారథిగా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అలాగే కెప్టెన్‌గా 61.21 సగటుతో 5142 పరుగులు చేసిన అతడు 20 శతకాలు, 12 అర్ధ శతకాలు నమోదు చేశాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని