ఐపీఎల్‌2021: జాక్‌పాట్‌ కొట్టేశారు
close

తాజా వార్తలు

Updated : 19/02/2021 07:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐపీఎల్‌2021: జాక్‌పాట్‌ కొట్టేశారు

ప్రభావం చూపని గతేడాది ప్రదర్శన

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈసారి ఐపీఎల్‌ వేలం ఊహించినదానికంటే రెట్టింపు ఉత్కంఠతో సాగింది. గతేడాది ఆటగాళ్ల ప్రదర్శనలను ఫ్రాంచైజీలు దృష్టిలో పెట్టుకోలేదు. ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచారు. అందుకే గతేడాది తీవ్రంగా నిరాశపరిచిన ఆటగాళ్లకు కూడా అనూహ్య ధర పలికింది. అందులో మోరిస్‌, మాక్స్‌వెల్‌, మొయిన్‌ అలీ, శివమ్‌ దూబె, షకిబ్‌ ముందు వరుసలో ఉన్నారు.

మోరిస్‌ రాజసం

సౌతాఫ్రికన్‌ పేస్‌ గన్‌ క్రిస్‌ మోరిస్‌ ఐపీఎల్‌ రికార్డును తిరగరాశాడు. గత సీజన్‌లో బెంగళూరు తరఫున కొన్ని మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. ఆ మ్యాచుల్లోనూ అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు విజయాలందించాడు. మెరుపువేగంతో బంతులు వేసే మోరిస్‌ జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్స్‌మన్‌గా మారి భారీ సిక్సర్లు కూడా కొట్టగలడు. అయితే.. గతేడాది బెంగళూరు మోరిస్‌ను వదులుకోవడంతో ఈసారి వేలంలోకి వచ్చాడు. కాగా.. రూ.75లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చిన మోరిస్‌ను రాజస్థాన్‌ జట్టు ఏకంగా రూ.16.25కోట్లు కుమ్మరించి సొంతం చేసుకుంది. మోరిస్‌ కోసం ముంబయి, పంజాబ్‌, రాజస్థాన్‌ తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే.. రాయల్స్‌ ఎక్కడా వెనకడుగు వేయకపోవడంతో మోరిస్‌పై ఆ జట్లు ఆశలు వదులుకోక తప్పలేదు.

జెమీసన్‌కు రికార్డు ధర..

న్యూజిలాండ్‌ పేసర్‌ కైల్‌ జెమీసన్‌ని బెంగళూరు రూ.15కోట్లకు దక్కించుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతను న్యూజిలాండ్‌ జట్టులోకి 2020 ఫిబ్రవరిలో చేరాడు. 6 టెస్టుల్లో 36 వికెట్లు తీశాడు. వైట్‌బాల్‌తోనూ వికెట్లు తీయడంలో దిట్ట. 

సిక్సర్‌ కొట్టకపోయినా జాక్‌పాట్‌ కొట్టాడు

అసలైన జాక్‌పాట్‌ అంటే మాక్స్‌వెల్‌దే. గత సీజన్‌లో ఒక్క సిక్సర్‌ కొట్టలేకపోయిన ఆస్ట్రేలియన్‌ పించ్‌ హిట్టర్ మాక్స్‌వెల్‌ ఈసారి వేలంపాటలో ఏకంగా భారీ బౌండరీ బాదాడు. గత ఏడాది పంజాబ్‌ తరఫున ఆడిన మాక్సీ కనీసం ఒక్క సిక్సర్‌ కూడా కొట్టలేకపోయి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో పంజాబ్‌ యాజమాన్యం అతడిని వదులుకుంది. మాక్స్‌వెల్‌కు ఈసారి తక్కువ ధర పలకడం ఖాయమని చాలామంది భావించారు. కానీ.. ఈసారి మాక్సీ కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోరాడాయి. చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన ఈ పోరులో చివరికి బెంగళూరు పైచేయి సాధించింది. ఏకంగా రూ.14.25కోట్లు పెట్టి బెంగళూరు మాక్స్‌వెల్‌ను సొంతం చేసుకుంది. 

రిచ్‌గా.. రిచర్డ్‌సన్‌  
మరో ఆస్ట్రేలియన్‌ పేసర్‌ రిచర్డ్‌సన్‌ మధ్యలో మెరిశాడు. పంజాబ్‌ జట్టు ఏకంగా రూ.14కోట్లు పెట్టి ఈ యువ స్పీడ్‌గన్‌ను సొంతం చేసుకుంది. రిచర్డ్‌సన్‌ను దక్కించుకోవడానికి దిల్లీ, బెంగళూరు, ముంబయి చివరివరకూ పోటీ పడ్డాయి. ఆస్ట్రేలియన్‌ టీ20 స్పెషలిస్టు మాక్స్‌వెల్‌ను వదులుకున్న పంజాబ్‌ ఆ స్థానంలో రిచర్డ్‌సన్‌ను కొనుక్కోవడం విశేషం.

ఖరీదైన ఆటగాడిగా కృష్ణప్ప రికార్డు

2019 రాజస్థాన్‌ తరఫున ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన కర్ణాటక స్పిన్‌ ఆల్‌రౌండర్‌.. గతేడాది పెద్దగా రాణించలేదు. దీంతో ఆ జట్టు కృష్ణప్పను వదులుకుంది. తాజాగా.. జరిగిన వేలంలో అతడికి ఊహించని విధంగా ధర లభించింది. చెన్నై జట్టు ఏకంగా రూ.9.25 కోట్లు ఖర్చు చేసి కృష్ణప్పను సొంతం చేసుకుంది. రూ.20లక్షల కనీస ధరతో అతను వేలంలోకి రావడం గమనార్హం. కాగా.. భారత జట్టు సభ్యుడు కాకుండానే ఎక్కువ ధర పలికిన ఆటగాడైన కృష్ణప్పగౌతమ్‌ రికార్డు సృష్ష్టించాడు. గతంలో క్రునాల్ పాండ్యా రూ.8.8 కోట్లకు ముంబయి దక్కించుకుంది. 

ఆస్ట్రేలియన్‌ పేసర్‌ మెరెడిత్‌..

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మాక్స్‌వెల్‌ను వదులుకున్న పంజాబ్‌ జట్టు మళ్లీ ఆస్ట్రేలియా ఆటగాళ్లనే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. యువ పేసర్‌ మెరెడిత్‌ను ఏకంగా రూ.8కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. అతడి కోసం దిల్లీ, పంజాబ్‌ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి దిల్లీ వెనక్కి తగ్గింది.

షాకిచ్చిన షారుఖ్‌ఖాన్‌

తమిళనాడుకు చెందిన యువ బ్యాట్స్‌మన్‌ షారుఖ్‌ఖాన్‌ అందరికీ షాకిచ్చాడు. అరంగేట్రంలోనే అతడు కోటీశ్వరడయ్యాడు. రూ.20లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చిన షారుఖ్‌ను పంజాబ్‌ యాజమాన్యం ఏకంగా రూ.5.25కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అతడు అండర్‌19 ప్రపంచకప్‌, సయ్యద్‌ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో మెరుపులు మెరిపించి అందరి దృష్టి అకర్షించాడు.

ముంబయికి కౌల్టర్‌నైల్‌
రూ.1.5కోట్లతో అందుబాటులోకి వచ్చిన ఆస్ట్రేలియన్‌ పేసర్‌ కౌల్టర్‌నైల్‌ను ముంబయి దక్కించుకుంది. అతడి కోసం ముంబయి, దిల్లీ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి ముంబయి రూ.5కోట్లిచ్చి తమ గూటిలో చేర్చుకుంది.

 

మొయిన్‌ తిప్పేశాడు

ఇంగ్లాండ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌అలీ సైతం గతేడాది బెంగళూరు తరఫున అటు బ్యాటుతోగానీ.. ఇటు బంతితోగానీ పెద్దగా రాణించింది లేదు. దీంతో బెంగళూరు యాజమాన్యం మొయిన్‌ అలీని వదులుకుంది. కాగా.. అనుభవానికి పెద్దపీట వేసే చెన్నై మొయిన్‌పై నమ్మకం ఉంచింది. రూ.7కోట్లు ఖర్చు చేసి దక్కించుకుంది.

పాత గూటికి షకీబ్‌

నిషేధం కారణంగా గత సీజన్‌కు దూరమైన బంగ్లాదేశ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ కూడా మంచి ధర పలికాడు. కోల్‌కతా జట్టు అతడిని రూ.3.2కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గతంలోనూ షకీబ్‌ కోల్‌కతా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఎన్నో మ్యాచుల్లో జట్టుకు విజయాలు అందించాడు. అందుకే ఈ బంగ్లా టైగర్‌ను కోల్‌కతా మళ్లీ ఆహ్వానించింది.

దూబెకు భారీ ధర..

అందరూ ఊహించినట్లుగానే భారత యువ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబెకు డిమాండ్‌ బాగా పెరిగింది. గతేడాది కోహ్లీ సారథ్యంలో బెంగళూరు జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈసారి రాజస్థాన్‌ జట్టు రూ.4.4కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

కాగా.. టీ20ల్లో ప్రపంచ నం.1 బ్యాట్స్‌మన్‌గా ఉన్న ఇంగ్లాండ్‌ హిట్టర్‌ డేవిడ్‌ మలన్‌కు కేవలం రూ.1.5కోట్లే దక్కింది. పంజాబ్‌ జట్టు అతడిని కొనుగోలు చేసింది. చెన్నై తరఫున అత్యంత పేలవ ప్రదర్శన చేసిన కేదార్‌జాదవ్‌ను ఎవరూ కొనుక్కోకపోవడం గమనార్హం.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని