దానికి ధోనీనే కారణం.. స్టీవ్‌స్మిత్‌ కాదు 
close

తాజా వార్తలు

Published : 01/04/2021 14:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దానికి ధోనీనే కారణం.. స్టీవ్‌స్మిత్‌ కాదు 

ఐపీఎల్‌ మాజీ ఆటగాడు రజత్‌ భాటియా

ఇంటర్నెట్‌డెస్క్‌: 2017 ఐపీఎల్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ ఫైనల్‌ చేరడంలో అప్పటి కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ పాత్ర ఏమీలేదని, అందుకు మహేంద్రసింగ్‌ ధోనీయే కారణమని ఆ జట్టు ఆటగాడు రజత్‌ భాటియా పేర్కొన్నాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌ కేసుల నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లను 2015లో రెండేళ్లు నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ రెండు జట్లు 2016, 2017 సీజన్లలో ఐపీఎల్‌లో ఆడలేదు.

అయితే, ఆయా ఆటగాళ్లు మాత్రం గుజరాత్‌ లయన్స్‌, రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ జట్లలో ఆడారు. ఈ క్రమంలోనే ధోనీ పుణె తరఫున ఆడాడు. అప్పుడా జట్టుకు స్టీవ్‌స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక ఆ సీజన్‌లో పుణె ఫైనల్‌ చేరింది. లీగ్‌ దశలో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 5 ఓటములతో ప్లేఆఫ్స్‌కు చేరగా అక్కడి నుంచి ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌తో తలపడింది. ఈ నేపథ్యంలోనే ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 129/8 స్వల్ప స్కోరే నమోదు చేసినా పుణె 128/6కే పరిమితమైంది. అయితే, అప్పుడు తమ జట్టు ఫైనల్‌ చేరడానికి ధోనీ కారణమని రజత్‌ పేర్కొన్నాడు.

‘స్టీవ్‌స్మిత్‌ను మీరెప్పుడూ ధోనీతో పోల్చిచూడకూడదు. నా దృష్టిలో టాప్‌ 10 కెప్టెన్ల జాబితాలోనూ స్మిత్‌ ఉండడు. మేం 2017లో ఫైనల్‌కు చేరడంలో ధోనీ పాత్ర కీలకం. అలాగే రాజస్థాన్‌ రాయల్స్‌ గతేడాది స్మిత్‌ను కెప్టెన్‌గా చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే కీలక సమయాల్లో అతడు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండవు’ అని మాజీ ఐపీఎల్‌ ఆటగాడు వివరించాడు. ఇదిలా ఉండగా 2017తో నిషేధం పూర్తి చేసుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరుసటి ఏడాది వచ్చీ రావడంతోనే టైటిల్‌ సాధించింది. దాంతో మూడోసారి ఐపీఎల్లో ట్రోఫీ నెగ్గిన జట్టుగా నిలిచింది. ఇక గతేడాది మరీ ఘోరమైన ప్రదర్శన చేసిన చెన్నై వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే 14వ సీజన్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని