
తాజా వార్తలు
ధోనీ రికార్డులా.. అలాంటివి పట్టించుకోం: కోహ్లీ
‘36’ చేదు జ్ఞాపకం మాకుంటే ఇంగ్లాండ్‌కు 58
ఇంటర్నెట్‌డెస్క్: పిచ్ పేస్‌కు అనుకూలిస్తే డే/నైట్ టెస్టులో ఇంగ్లాండ్ పైచేయి సాధిస్తుందన్న వాదనలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యతిరేకించాడు. స్వింగ్‌కు అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్‌లపై వారినే ఓడించామని గుర్తుచేశాడు. ఇక పేస్ విషయానికొస్తే ప్రపంచంలోనే ఉత్తమ పేస్‌దళం తమకి ఉందని కోహ్లీ అన్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొతెరా వేదికగా రేపటి నుంచి భారత్×ఇంగ్లాండ్ మధ్య డే/నైట్ టెస్టు జరగనుంది. ఈ సందర్భంగా విరాట్ మీడియా సమావేశంలో మాట్లాడాడు.
‘‘ఇంగ్లాండ్ జట్టు బలాలు, బలహీనతల గురించి ఆలోచించట్లేదు. పేస్‌కు అనుకూలించే వాళ్ల సొంతమైదానంలోనే వాళ్లని ఓడించాం. జట్టుగా పోరాడి విజయాలు సాధించాం. ఇక బలహీనతలు గురించి మాట్లాడితే ప్రత్యర్థి జట్టులో అవి చాలానే ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పేస్పిచ్ వాళ్లకు అనుకూలంగా ఉంటే అది మాకు లాభమే. ఎందుకంటే ఇతర జట్ల కంటే బలమైన బౌలింగ్ దళం మా వద్ద ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా గొప్ప ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని కోహ్లీ అన్నాడు.
‘‘గులాబి బంతితో ఆడటం సవాలే. ముఖ్యంగా సాయంత్రం బ్యాటింగ్ చేసే జట్టుకు లైట్లు వెలుతురులో తొలి గంటన్నర ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. అయితే బంతిపై షైన్ ఉన్నంతవరకు ఫాస్ట్ బౌలర్లకు కూడా సహకరిస్తుంది’’ అని విరాట్ పేర్కొన్నాడు. మరో విజయం సాధిస్తే స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన భారత సారథి ధోనీ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘‘ఇవి అస్థిరమైనవి. బయటినుంచి ఇద్దరు వ్యక్తులను పోల్చడం బాగుంటుంది. కానీ అలాంటి విషయాల్ని మేం అసలు పట్టించుకోం. సహచర ఆటగాళ్లుగా మాజీ సారథిపై మాకు ఎంతో గౌరవం, ప్రేమ, అభిమానం ఉంటాయి’’ అని అన్నాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ గురించి మాట్లాడుతూ..‘‘ఒక మ్యాచ్ డ్రాగా ముగించి, మరొకటి విజయం సాధించాలని మేం భావించట్లేదు. రెండు మ్యాచ్‌లూ గెలవాలని ప్రయత్నిస్తున్నాం. ఫలితం గురించి తర్వాత ఆలోచిస్తాం’’ అని విరాట్ తెలిపాడు. సిరీస్‌ను భారత్ 2-1 లేదా 3-1తో గెలిస్తే ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ చెరో విజయం సాధించాయి. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన గత డే/నైట్ టెస్టులో టీమిండియా 36 పరుగులకు కుప్పకూలింది. ఆ ఫలితం ఏమైనా ప్రభావితం చూపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు.. ‘‘45 నిమిషాల పేలవమైన ఆటతో అలా జరిగింది. అలాంటి చేదు జ్ఞాపకమే ఇంగ్లాండ్‌కు కూడా ఉంది’’ అని అన్నాడు. 2018లో న్యూజిలాండ్‌తో జరిగిన డే/నైట్ టెస్టులో ఇంగ్లాండ్ 58 పరుగులకు ఆలౌటైంది.