T20 World Cup: నవంబర్‌ 14న ప్రపంచకప్‌ ఫైనల్‌

తాజా వార్తలు

Updated : 29/06/2021 17:26 IST

T20 World Cup: నవంబర్‌ 14న ప్రపంచకప్‌ ఫైనల్‌

యూఏఈ, ఒమన్‌ వేదికలుగా ఐసీసీ ప్రకటన

దుబాయ్: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ వేదికలు యూఏఈ, ఒమన్‌కు మారాయని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు మెగా టోర్నీ జరుగుతుందని వెల్లడించింది. కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల భారత్‌ నుంచి వేదికలను తరలించాల్సి వచ్చిందని పేర్కొంది.

‘ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్యం భారత్‌కే చెందుతుంది. దుబాయ్‌, అబుదాబి, షార్జా, ఒమన్‌ క్రికెట్‌ అకాడమీ మైదానాల్లో అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు మ్యాచులు జరుగుతాయి’ అని ఐసీసీ తెలిపింది.

టోర్నీ ప్రాథమిక దశలో ఎనిమిది అర్హత జట్లు రెండు బృందాలుగా విడిపోయి ఒమన్‌, యూఏఈలో తలపడతాయి. అందులో నాలుగు జట్లు సూపర్‌-12 రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. నేరుగా అర్హత సాధించిన ఎనిమిది జట్లతో కలిసి ఆడతాయి. బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌, నమీబియా, ఒమన్‌, పపువా న్యూగినీ ప్రాథమిక దశలో ఆడే జట్లు.

‘ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2021ను అందుబాటులో ఉన్న విండోలో సురక్షితంగా నిర్వహించడమే మా లక్ష్యం. బహుళ జట్లతో మెరుగైన బయో బుడగ వాతావరణం సృష్టించగల దేశంలోనే పోటీలు పెట్టాలని నిర్ణయించుకున్నాం. అభిమానులకు వీనుల విందైన క్రికెట్‌ వినోదం అందించేందుకు మేం బీసీసీఐ, ఎమిరేట్స్‌, ఒమన్‌ క్రికెట్‌ బోర్డులతో కలిసి పనిచేస్తాం’ అని ఐసీసీ తాత్కాలిక సీఈవో జెఫ్‌ అలార్డిస్‌ అన్నారు.

ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించడమే తమకు సంతోషకరం అయినప్పటికీ పరిస్థితుల దృష్ట్యా యూఏఈకి తరలించక తప్పడం లేదని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సోమవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని