Afghanistan Team inT20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ ఆడదా?

తాజా వార్తలు

Published : 23/09/2021 10:15 IST

Afghanistan Team inT20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ ఆడదా?

దిల్లీ: ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో ఎదుగుతున్న అఫ్గానిస్థాన్‌పై తాలిబన్ల రూపంలో గట్టి దెబ్బ పడింది. దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్ల కారణంగా ఇప్పుడా జట్టు వచ్చే నెలలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనడం సందేహంగా మారింది. క్రికెట్‌ బోర్డుల వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఐసీసీ ఆ బోర్డులపై నిషేధం విధిస్తుంది. ఇప్పటికే అఫ్గనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) పాలక వర్గంలో తాలిబన్లు మార్పులు చేశారు. క్రికెట్‌ ఆడకుండా తమ దేశ అమ్మాయిలను నిషేధించారు. ఇక తాలిబన్ల రాజ్యంలో శక్తిమంతమైన హక్కానీ నెట్‌వర్క్‌కు చెందిన నసీబుల్లా హక్కానీ.. హమీద్‌ స్థానంలో ఏసీబీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆ దేశ జాతీయ పతాకానికి బదులుగా తాలిబన్ల జెండా పెట్టాలనే డిమాండ్‌ వచ్చే అవకాశముందని ఐసీసీ భావిస్తోంది. ఒకవేళ అలాంటి విజ్ఞప్తి వచ్చినా ఐసీసీ దాన్ని తిరస్కరిస్తుంది. ఇతర జట్లు కూడా తాలిబన్ల జెండా కిందా అఫ్గాన్‌తో ఆడేందుకు ఒప్పుకుంటారో లేదో అనే విషయంపై స్పష్టత లేదు. ‘‘ఇప్పటికైతే తాలిబన్ల జెండా కిందా అఫ్గాన్‌ క్రికెట్‌ ఆడాలనే విజ్ఞప్తి ఏం రాలేదు. ఒకవేళ ఏదైనా క్రికెట్‌ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించినా ఆటగాళ్లపై ఆ ప్రభావం పడకుండా చూసుకుంటుంది. ఐసీసీ సభ్య దేశంగా ఉండాలంటే.. ఆ దేశంలో పురుషులతో పాటు మహిళల క్రికెట్‌ కూడా ఉండాలి’’ అని ఓ ఐసీసీ బోర్డు సభ్యుడు తెలిపాడు. ఇప్పటికే అఫ్గాన్‌లో మహిళల  క్రికెట్‌ను నిషేధించడంతో ఐసీసీ నిబంధనలు అతిక్రమించినట్లయింది.

పాక్‌తో సిరీస్‌: తమ దేశంలో అంతర్జాతీయ సిరీస్‌ల నిర్వహణ దిశగా అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు అడుగులు వేస్తోంది. తమ దేశంలో పాకిస్థాన్‌తో  వన్డే సిరీస్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఏసీబీ కొత్త ఛైర్మన్‌ అజీజుల్లా ఫాజిల్‌ బుధవారం తెలిపాడు. భారత్, బంగ్లాదేశ్, యూఏఈ క్రికెట్‌ బోర్డుల అధికారులతోనూ సమావేశమవుతానని అజీజుల్లా వెల్లడించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని