ఇలా వదిలేస్తే కష్టమే..
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 19/12/2020 07:43 IST

ఇలా వదిలేస్తే కష్టమే..

ఫోర్త్‌ అంపైర్‌

తొలి టెస్టులో 53 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో భారత జట్టు రేసులో ముందు నిలిచింది. పేలవమైన ఆరంభం లభించినా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, పుజారా, రహానెలు చక్కని ఇన్నింగ్స్‌తో జట్టును నిలబెట్టారు. అయితే టెయిలెండర్ల బ్యాటింగే నిరాశపరిచింది. వాళ్లు కాస్తయినా పోరాడి ఉంటే భారత్‌ ఇంకా బలమైన స్థితిలో నిలిచేదే.  రెండో రోజు భారత్‌...మరో 11 పరుగులే జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. వికెట్‌ కీపర్‌ సాహా తర్వాత కొద్దోగొప్పో ఆడగలడన్న బ్యాట్స్‌మన్‌ టెయిలెండర్లలో కనిపించట్లేదు. అశ్విన్‌ ఒకప్పుడు బాగానే ఆడేవాడు. కానీ గత మూడేళ్లుగా అతడు బౌలర్‌ పాత్రకే పరిమితమవుతున్నాడు. ఆఖర్లో 30, 40 పరుగులు చేయగలడన్న ధీమాను ఇవ్వలేకపోతున్నాడు. ఇక్కడ జడేజా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా జడేజా నాణ్యమైన ఆల్‌రౌండర్‌లా సత్తాచాటుతున్నాడు. ఇటీవలి వన్డే, టీ20 సిరీస్‌లలోనూ అతడు ఆకట్టుకున్నాడు. షమి, ఉమేశ్‌, బుమ్రాల నుంచి పరుగులు ఆశించలేం కాబట్టి అశ్విన్‌ తన బ్యాటింగ్‌పై ఇంకాస్త దృష్టిసారించాల్సిన అవసరముంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా టెయిలెండర్లు 40, 50 పరుగులు జోడించగలిగితే ఆ బ్యాటింగ్‌కు తిరుగుండదు.

వదిలేశారిలా...

ఇప్పటివరకు బ్యాట్స్‌మెన్‌ ఫర్వాలేదనిపించినా.. బౌలర్లు మాత్రం అదరగొట్టారు. టెస్టు సిరీస్‌లో అదిరిపోయే ఆరంభం ఇచ్చి నూటికి నూరు మార్కులు సంపాదించారు. పేసర్లు ఉమేశ్‌యాదవ్‌, బుమ్రా.. స్పిన్నర్‌ అశ్విన్‌లు తెలివిగా బౌలింగ్‌ చేసి కంగారూలకు కళ్లెం వేశారు. షమికి వికెట్లు దక్కకపోయినా తోటి బౌలర్లకు మంచి సహకారం అందించాడు. మొత్తంగా తమ అద్వితీయ ప్రదర్శనతో బ్యాటింగ్‌ లోపాల్ని బౌలర్లు సరిదిద్దారు. కానీ పేలవమైన ఫీల్డింగే ఆందోళన కలిగిస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నా.. మన ఫీల్డింగ్‌ది గల్లీ స్థాయే. 72 ఓవర్ల ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా 5 క్యాచ్‌ల్ని నేలపాలు చేశారంటే వైఫల్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదకర లబుషేన్‌ (0, 12, 21) క్యాచ్‌ను మూడు సార్లు విడిచిపెట్టడం దారుణం. లబుషేన్‌ డకౌట్‌గా వెనుదిరిగి ఉంటే ఆసీస్‌ పరిస్థితి ఎలా ఉండేదో! సాహా, పృథ్వీ షా, బుమ్రా క్యాచ్‌లు విడిచిపెట్టడంతో అతడు 47 పరుగులు చేయగలిగాడు. ఇక 26 పరుగుల వద్ద ఉన్నప్పుడు పైన్‌ క్యాచ్‌ను మయాంక్‌ వదిలేశాడు. దీనివల్ల అదనంగా 47 పరుగులు చేసిన పైన్‌ 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. జీవనదానాలు లభించాక లబుషేన్‌, పైన్‌లు చేసిన పరుగులు 94. ఈలెక్కన ఆసీస్‌ 100లోపు ఆలౌటయ్యేదే! ఫీల్డింగ్‌ ప్రమాణాలు దారుణంగా పడిపోవడం భారత్‌కు చాలా నష్టం చేసేదే. ఆసీస్‌ లాంటి పటిష్టమైన జట్టుతో పోరాడుతున్నప్పుడు ఏమరుపాటు పనికిరాదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లలో మెరుగ్గా ఉన్నప్పుడే మేటి జట్టును ఓడించడం సాధ్యం. ఆసీస్‌ 191 పరుగులకు ఆలౌటైంది కాబట్టి క్యాచ్‌ల వైఫల్యం ప్రభావం పెద్దగా తెలియట్లేదు. ఒకవేళ అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని ఉంటే ఆసీస్‌ 300 నుంచి 400 స్కోరు చేసేదే. అప్పుడు తొలి టెస్టు చేజారేది. సిరీస్‌ కూడా ప్రమాదంలో పడేది. పృథ్వీ, మయాంక్‌ లాంటి యువ ఆటగాళ్లు కూడా ఫీల్డింగ్‌లో విఫలమవుతుండటం ఆందోళనకరం. పృథ్వీ తేలికైన క్యాచ్‌ను వదిలిపెట్టాడు. తొలి టెస్టే కాదు ఆసీస్‌ పర్యటన ఆరంభం నుంచి కోహ్లీసేన ఫీల్డింగ్‌ నాసిరకంగానే ఉంది. వన్డే, టీ20 సిరీస్‌లలో గణనీయ సంఖ్యలో క్యాచ్‌లు వదిలేశారు. అందులో కోహ్లి, జడేజా వంటి ఉత్తమ ఫీల్డర్లు కూడా ఉన్నారు. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ ఇతరత్రా కారణాలతో ఫీల్డింగ్‌లో విఫలమవుతున్నారంటే అర్థంచేసుకోవచ్చు. రెండున్నర నెలల పాటు ఐపీఎల్‌ సాగింది. ఒకొక్కరు కనీసం డజను మ్యాచ్‌లు ఆడారు. ఆసీస్‌లో ఇప్పటికే ఆరు అంతర్జాతీయ, రెండు సన్నాహక మ్యాచ్‌లు ఆడారు. అయినా క్యాచ్‌లు వదిలేస్తుండడం.. ఫీల్డింగ్‌లో విఫలమవుతుండటం క్షమార్హం కాదు. తక్షణమే భారత ఫీల్డింగ్‌ కోచ్‌ పనితీరును సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇవీ చదవండి..

విరుష్క.. ఆసీస్‌లో బిడ్డను కనండి!

ఈ రోజు నిలిస్తే..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన