close

ప్రధానాంశాలు

సర్కారు బడిలో ఆకలి కేకలు!

విద్యార్థులకు సరిపడా రాని భోజనం 
కొన్నిచోట్ల నాణ్యత లేక తినడం లేదు 
అధికారులు  దృష్టి సారిస్తేనే మార్పు 
న్యూస్‌టుడే, వీరన్నపేట (మహబూబ్‌నగర్‌)

* పురుగుల అన్నం : భూత్పూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వచ్చే భోజనం నాణ్యతగా రావడం లేదు. ఒక్కోరోజు పురుగుల అన్నం.. మరోరోజు పప్పు.. కూరగాయలు సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి టిఫిన్లు తెచ్చుకోవడం.. ఇంటికి వెళ్లి తిని రావడం చేస్తున్నారు. పురుగుల ఉన్నరోజు.. కూరగాయలు సరిగ్గా లేని రోజు విద్యార్థులు ఆకలితోనే తరగతులు వింటున్నారు.

* నాణ్యత సరిగ్గా లేదు : కోయిలకొండ మండల ఉన్నత పాఠశాలకు బుధవారం అక్షయపాత్ర నుంచి వచ్చిన భోజనం నాణ్యతగా లేదు. కొన్ని రోజులుగా ఇదే పరిస్థితులు ఉండటంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అయినా అదేవిధంగా నాణ్యత లేని భోజనం ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన చేశారు.

* రెండు పాఠశాలల్లో.. : బాలానగర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో 392 మంది విద్యార్థులు ఉన్నారు. 330 మంది విద్యార్థులకు మాత్రమే భోజనం పంపిస్తున్నారు. పక్కన ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలోనూ తరచూ భోజనం తక్కువ వస్తుంది. బాలుర పాఠశాలలో తక్కువ పడితే బాలికల పాఠశాల నుంచి, బాలికల పాఠశాలలో తక్కువ పడితే బాలుర పాఠశాల నుంచి సర్దుబాటు చేసుకుంటారు. రెండు పాఠశాలలకు ఒక్కోసారి తక్కువ వస్తే పెద్ద సంఖ్యలో విద్యార్థులు పస్తులుంటున్నారు.

* భోజనం తింటలేరు.. : జడ్చర్ల సెయింట్‌ ఆగ్నెస్‌ ఉన్నత పాఠశాలలో భోజనం సరిగ్గా రావడం లేదని వంద మంది విద్యార్థులు భోజనం చేయడం లేదు. వసతి గృహంలో తింటున్నారు. ఇక ఇదే పాఠశాల ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలలో 232 మంది విద్యార్థులు ఉండగా ప్రతిరోజు 20 మంది విద్యార్థులకు భోజనం తక్కువగా వస్తుంది. చాలామంది విద్యార్థులు అర్ధాకలితో ఉంటున్నారు.

విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు.. దీనిలో నాణ్యత పెంచేందుకు అధికారులు అక్షయ పాత్రకు బాధ్యతలు అప్పగించారు.. కాని అధికారులు అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు.. నాణ్యత లేని భోజనం.. రుచి లేని కూరగాయలు.. పప్పు సరఫరా చేస్తున్నారు.. ఇక కొన్ని పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అన్నం.. పప్పు.. కూరగాయలు ఇవ్వడం లేదు.. దీంతో విద్యార్థులు అర్ధాకలితో చదువు సాగిస్తున్న పరిస్థితి.. అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు పోషకాహారం అటుంచితే కడుపునిండా భోజనమే దొరకని పరిస్థితులు ఉన్నాయి..

సరిపడా రావడం లేదు..  : అక్షయపాత్ర ద్వారా పాఠశాలలకు సరఫరా అవుతున్న భోజనం విద్యార్థులకు సరిపడా రావడం లేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరఫరా చేయడం లేదు. కొన్నిచోట్ల ఒకే ప్రాంగణంలో, పక్కపక్కన పాఠశాలలు ఉంటే తక్కువ వచ్చినా సర్దుబాటు చేసుకుంటున్నారు. మిగతాచోట్ల ఉన్నంతవరకు విద్యార్థులకు భోజనం పెట్టి తరవాత అయిపోయిందని చెబుతున్నారు. దీంతో ఇంటికి వెళ్లి తిని వచ్చే వారు తినివస్తున్నారు. లేదంటే ఆకలితోనే చదువులు సాగిస్తున్నారు. ఒకచోట అన్నం తక్కువ వస్తే మరో చోట పప్పు.. కూరగాయలు తక్కువ వస్తున్నాయి. నాణ్యత సరిగా లేక విద్యార్థులు చాలాచోట్ల తినడం లేదు. కొందరు విద్యార్థులు ఇంటి నుంచి టిఫిన్లు తెచ్చుకుంటుండగా.. మరికొందరు ఇంటి నుంచి కూరగాయలు తెచ్చుకుని ఇక్కడ భోజనం చేస్తున్నారు. భోజనం సరిపోకపోవడం, నాణ్యతపై ఇటీవల కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు ప్రస్తావించారు. దీంతో తన పరిశీలనలో సైతం ఇదే విషయాన్ని గమనించానని, మార్పు చేయాలని అక్షయపాత్ర వారికి సూచించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇప్పటి వరకు మార్పులు మాత్రం కనపడటం లేదు.

సమస్య పరిష్కరిస్తాం 
అక్షయపాత్ర ప్రతినిధులు.. ప్రధానోపాధ్యాయులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రధానోపాధ్యాయులు మా దృష్టికి కూడా కొన్ని సమస్యలు తెస్తున్నారు. పురుగులు ఉంటున్నాయని.. నాణ్యత లేదనే విషయం ఇప్పుడే మా దృష్టికి వచ్చింది. వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందజేస్తాం. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం.

- రాజేశ్‌, జిల్లా విద్యాశాఖ అధికారి, మహబూబ్‌నగర్‌

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.