విద్యా వాలంటీర్లు ఉంటారా? లేదా?
close

ప్రధానాంశాలు

విద్యా వాలంటీర్లు ఉంటారా? లేదా?

ఈసారి వారి సేవలు అవసరం లేదని భావిస్తున్న అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త విద్యా సంవత్సరం(2021-22)లో విద్యా వాలంటీర్ల సేవలు అవసరం లేదని విద్యాశాఖ భావిస్తోంది. రాష్ట్రంలో 25 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. శాశ్వత ఉపాధ్యాయుల కొరత నేపథ్యంలో ఏటా తాత్కాలిక పద్ధతిన విద్యా వాలంటీర్లను నియమిస్తున్నారు. వేసవి సెలవులను మినహాయించి మిగిలిన 10 నెలలకుగాను నెలకు రూ.12 వేల చొప్పున వేతనాలిస్తారు. 2019-20 విద్యా సంవత్సరం వరకు దాదాపు 12 వేల మంది పనిచేశారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో 2020 మార్చిలో బడులు మూతపడ్డాయి. అప్పటినుంచి వారికి జీతాలు లేవు. గత విద్యా సంవత్సరం (2020-21)లో విధుల్లోకి తీసుకోలేదు. అధిక శాతం మంది కూలి పనులు చేసుకుంటున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదవీ విరమణ, ఖాళీల స్థానంలో ఎంతమంది విద్యా వాలంటీర్లు అవసరమో వివరాలు పంపాలని ఫిబ్రవరి 15న డీఈఓలను పాఠశాల విద్యాశాఖ లిఖితపూర్వకంగా ఆదేశించింది. తాజా పరిస్థితిపై మాత్రం సమాచారం అడగలేదు. గత ఏడాది ప్రత్యక్ష తరగతులకు 50 శాతం మంది విద్యార్థులే హాజరయ్యారని, విద్యా వాలంటీర్ల అవసరమేమిటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈసారి ప్రాథమిక పాఠశాలలనూ మూడో విడతలో ప్రారంభించాలని భావిస్తున్నా విద్యా వాలంటీర్ల ఊసెత్తడం లేదు. దీనిపై త్వరలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విన్నవించనున్నట్లు విద్యా వాలంటీర్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మఠం శివానంద స్వామి తెలిపారు. ప్రభుత్వం ఆపత్కాల సాయం కింద రూ.2 వేలు, సన్న బియ్యం ఇవ్వలేదని.. ఏళ్ల తరబడి వేతనాలు లేకుండా ఎలా బతకాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని