Vehicles: కరోనా కాలంలో.. వాహనాలకూ సుస్తీ!

ప్రధానాంశాలు

Vehicles: కరోనా కాలంలో.. వాహనాలకూ సుస్తీ!

‘ఉప్పల్‌లో నివాసం ఉంటూ మాదాపూర్‌కు రోజూ కార్లో వెళ్లి వచ్చే అనిరుధ్‌ రెండు నెలలుగా వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు. సెల్లార్‌లో నిలిపి ఉంచిన కారును ఇటీవల స్టార్ట్‌ చేద్దామని ప్రయత్నిస్తే ఎంతకూ వీలుకాలేదు. షోరూం మెకానిక్‌ వచ్చి పరిశీలించగా సెల్ఫ్‌ మోటారు పట్టేసిందని, బెల్టులు చెడిపోయాయని చెప్పారు. బాగుచేయిస్తే రూ.8 వేల బిల్లు వచ్చింది.

‘విద్యా సంస్థలు మూతపడినప్పటి నుంచి వ్యాన్‌కు గిరాకీ లేక ఇబ్బంది పడుతున్నారు హయత్‌నగర్‌కు చెందిన నర్సింగ్‌. కొన్నాళ్లు కూరగాయలు, ప్రయాణికుల రవాణాకు ఉపయోగించారు. రెండోదశ కరోనా ప్రభావంతో మూడు నెలలుగా షెడ్‌ నుంచి తీయలేదు. రెండు రోజుల క్రితం వ్యాన్‌ను తీద్దామని తాళం చెవి పెట్టగా స్టార్ట్‌ కాలేదు. మెకానిక్‌కు చూపించగా బ్యాటరీ పోయిందన్నారు.

వరంగల్‌లో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసే స్వర్ణ రెండు నెలలుగా తన స్కూటర్‌ను పక్కన పెట్టేయడంతో బ్యాటరీ పోయింది. సర్వీసింగ్‌తో కలిపి రూ.2500 ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

కరోనా ప్రభావం వాహనాలపై పడుతోంది. ఎక్కువ కాలంపాటు వినియోగించకుండా పక్కన నిలిపివేసిన వాహనాలు మొరాయిస్తున్నాయి.  ఇంజిన్‌లో సమస్యలు, బ్యాటరీ ఛార్జింగ్‌ దిగిపోవడం, సెల్ఫ్‌ మోటారు పట్టేయడం, కందెనలు పాడవ్వడం లాంటి సమస్యలు ఎదురవుతుండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రూ.వేలల్లో ఖర్చు పెట్టాల్సి వస్తోంది. వాహనాల నిర్వహణపై సరైన అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇంజినీరింగ్‌ నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఒకసారైనా వాటిపై దృష్టి పెడితే ఎక్కువ కాలం మన్నికతోపాటు ఏ సమస్యలూ రావని సూచిస్తున్నారు. లాక్‌డౌన్‌ మినహాయింపు సమయం చాలా తక్కువగా ఉండడంతో వాహనాల మరమ్మతులు వేగంగా పూర్తికావడం లేదు. ఒక్కో వాహనం రెండు రోజులకుపైగా సమయం తీసుకుంటోందని యజమానులు చెబుతున్నారు. ఉదయం ఆరు గంటలకు షెడ్‌ తెరవగా 1 గంటకే మూతవేయాల్సి వస్తోందని, ఈ సమయంలో ఏం చేయగలుగుతామని మెకానిక్‌లు చెబుతున్నారు. ప్రధాన రహదారులపై ఉన్న షెడ్లకు ఈ సమస్య తీవ్రంగా ఉంది. విడిభాగాల దుకాణాలు మూతవేసి ఉండడంతో రిపేరు కోసం వచ్చిన వాహనాలు పేరుకుపోతున్నాయని షెడ్ల యజమానులు చెబుతున్నారు.

ఇలా చేస్తే మేలు...

* వారానికి ఒక రోజు ఇంజిన్‌ స్టార్ట్‌ చేసి 30 నిమిషాలు ఉంచాలి.
* వీలైతే కొంత దూరం నడిపే ప్రయత్నం చేయాలి.
* ఆక్సిలేటర్‌ను కొంచెం పెంచుతూ ఇంజిన్‌ వేడెక్కేలా చూడాలి. బ్యాటరీ కూడా ఛార్జ్‌ అవుతుంది.
* సెల్ఫ్‌ స్టార్ట్‌ పనిచేయకపోతే పదేపదే ఆన్‌ చేయొద్దు. దీనివల్ల సెల్ఫ్‌మోటారు చెడిపోయే ప్రమాదం ఉంది.
* ఇంజిన్‌, బ్రేక్‌ ఆయిల్స్‌ను పరిశీలించాలి.
* బెల్టులు చెడిపోకుండా చూసుకోవాలి.
* ఒకే చోట నిలిపి ఉంచే వాహనాలకు ఎలుకల బెడద ఉంటుంది.
* ద్విచక్ర వాహనాల ఆక్సిలేటర్‌ పట్టేసే ప్రమాదం ఉంది. దాన్ని సరిచూసుకోవాలి.

వారానికి ఒక అరగంట కేటాయిస్తే చాలు
- అహ్మద్‌ అజార్‌, బ్యాటరీలు, సెల్ఫ్‌మోటార్ల నిపుణుడు

వారానికి ఒకసారి ఇరవై నిమిషాలో.. అరగంట సమయమో స్టార్ట్‌ చేసి ఉంచాలి. లేదంటే ఇంజిన్‌లో బేరింగ్స్‌, సెల్ఫ్‌ మోటారు పట్టేస్తాయి. బెల్టులు చెడిపోతాయి. బ్యాటరీ ఛార్జింగ్‌ పోతుంది. ఎక్కువ కాలం తేమ ప్రాంతాల్లో నిలిపి ఉంచితే వైరింగ్‌ కూడా దెబ్బతింటుంది.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని