
కేకును అలంకరించేయండి!
యూట్యూబ్ ఛానెళ్లు ఎక్కువయ్యాక, ఓవెన్లు అందుబాటులోకి వచ్చాక కేకు చేయడం ఎంత సులభమయిపోయిందో. కేకుల్లో కూడా రకరకాల ఫ్లేవర్లనూ ఇప్పుడు ఇంట్లోనే చేసుకుంటున్నాం. కానీ కేకు మీద అందంగా ఐసింగ్ చేయడం మాత్రం కేకు తయారు చేసినంత తేలిక కాదు. దానికి కాస్త కళా, చేసే విధానం రెండూ తెలిసి ఉండాలి. అయితే మనం చేసిన సాదా కేకుకూ ఆర్టిస్టిక్ లుక్ వచ్చేలా చేస్తాయి ‘సిల్హౌటే ఎడిబుల్ కేక్ స్టిక్కర్స్’. పేపర్ వేఫర్తో లేదా ఫాండెంట్తో చేసిన ఇవి రకరకాల ఆకృతుల్లో దొరుకుతున్నాయి. మనకు నచ్చిన థీమ్‌తో వాటిని కొనుక్కుని కేకు తయారీ పూర్తయ్యాక ఫాండెంట్ మీద వీటిని అతికించేస్తే కేకు అలంకరణ అదిరిందన్నమాటే.
ఇస్త్రీ సులభం!
ఇస్త్రీ చేయడం వంట చేయడం దాదాపు ఒకే కోవ కిందకి వస్తాయంటారు రెండింటితో తంటాలు పడ్డవాళ్లు. వంటల్లో పాళ్ల లెక్క తెలియాల్సినట్టే ఇక్కడ ఏ బట్టకు ఎంత వేడి కావాలి, ఏ చోట ఇస్త్రీ పెట్టె పెట్ట కూడదు లాంటివి తప్పక తెలిసుండాలి. అది తెలియకపోతే ఇక ఆ దుస్తుల మీద ఆశ వదులుకోవల్సిందే. అయినా ప్రయోగాలు చేసి బట్టలకు చిల్లులు పెట్టుకున్న వాళ్లు ఎంత మందో. ఇక మీదట ఇలాంటి ఇబ్బంది లేకుండా ‘నైలాన్ ఐరనింగ్ మెష్’లు మార్కెట్లోకి వస్తున్నాయి. నెట్లా ఉండే దీన్ని మనం ఇస్త్రీ చేయాలనుకున్న దుస్తుల మీద ఉంచి దాని మీదుగా ఇస్త్రీ చేస్తే వేడి ఎక్కువై దుస్తులు పాడవుతాయన్న బాధే ఉండదు. మంచి ఆలోచన కదూ!
మాస్క్ జారదు!
కరోనా కారణంగా ఇప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరయిపోయింది. చెవుల మీదుగా పెట్టుకుంటున్న ఇవి కాస్త వదులుగా ఉంటే మాటి మాటికీ జారి పోతుంటాయి. పోనీ కరెక్ట్ సైజువే దొరికినా రోజంతా ఉంచుకోవాల్సి రావడం వల్ల చెవులూ ముక్కుల మీద ఒత్తిడి అధికమవుతోంది. ఆ ఇబ్బందులు లేకుండా మాస్కును ధరించడం సులభతరం చేస్తూ ‘అడ్జస్టబుల్ మాస్క్ స్ట్రాప్’లు తయారవుతున్నాయి. ఒక పట్టీ మాదిరి ఉండే వీటిలో మాస్కును తగిలించేందుకు ఏర్పాటు ఉంటుంది. రకరకాల సైజులకు సరి పోయేలా ఈ స్ట్రాప్లను రూపొందిస్తున్నారు. తల వెనుకగా దీన్ని ఉంచి మనకు సౌకర్యంగా ఉండేలా మాస్క్‌ను తగిలించామంటే జారిపోయే ఇబ్బందే కాదు ముక్కూ చెవుల మీద ఒత్తిడి కూడా ఉండదు. పెద్దలతోపాటు పిల్లలకూ ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
పిండి కిందపోదిక!
మామూలుగా పిండీ, పసుపూలాంటివి జల్లెడ పట్టాలంటే పెద్ద పళ్లెం అవసరం. అయినా జల్లించేప్పుడు పళ్లెం చుట్టూ పడిపోతూ ఉంటాయి. అదంతా నేల మీద పడకుండా పేపరు వేసుకుంటుంటాం. పట్టడం పూర్తయ్యాక ఆ పిండిని మనం కావాలనుకున్న గిన్నెలోకి మార్చుకుంటాం. ఇలాంటి ఇబ్బందులేమీ లేకుండా, నేరుగా ఏ గిన్నెలోకి కావాలంటే ఆ గిన్నెలోకి, ఎంత కావాలంటే అంత, అది కూడా పిండి కింద పడకుండా జల్లెడ పట్టే అవకాశాన్ని కల్పిస్తుంది ‘కప్ సిఫ్టర్’. ఒక డబ్బాలా ఉండే దీని అడుగున జల్లెడ ప్లేట్లు ఉంటాయి. మనం జల్లెడ పట్టాలనుకున్న పిండిని ఆ గిన్నెలో పోసి హ్యాండిల్‌ను నొక్కుతూ ఉంటే పిండి కిందకు వస్తూ ఉంటుంది. అవసరాన్ని బట్టి మార్చుకునేలా మూడు ప్లేట్లు వస్తాయిందులో. ఇక, జల్లెడతో లొల్లి లేదన్న మాటే!
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్