close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఇవి కరోనా వడగళ్లు

మెక్సికోలోని మోంటేమెరేలోస్‌ మున్సిపాలిటీలో ఇటీవల వచ్చిన భారీ వర్షానికి వడగళ్లు కూడా పడ్డాయి. ఓస్‌ అంతేనా అనుకుంటున్నారేమో ఆ వడగళ్లు మంచుముద్దల్లానో, గుండ్రంగానో ఉంటే చెప్పుకోవాల్సిన పనిలేదు. అవి అచ్చం కరోనా వైరస్‌ ఆకృతిని పోలి ఉండటంతో జనాలు వాటిని ప్రత్యేకంగా చూడటంతోపాటు అవి కరిగిపోయేలోపే సెల్ఫీలు దిగారు, ఫొటోలు తీసుకున్నారు. అలానే సోషల్‌ మీడియోలో కూడా పోస్ట్‌ చేయడంతో కరోనా వడగళ్లు వైరల్‌ అయిపోయాయి. అసలు విషయం ఏంటంటే... సాధారణ రోజుల్లో కూడా కొన్నిచోట్ల అలాంటి వడగళ్లు పడుతుంటాయి. కరోనా నేపథ్యం కావడంతో ప్రస్తుతం వాటికి ఎంతో ప్రాధాన్యం వచ్చింది. బలమైన గాలులూ, ఒత్తిడి వల్ల మంచు ముద్దలు ఒకదాన్ని ఒకటి ఢీకొని భిన్న ఆకృతులు సంతరించుకుని కిందపడతాయి. మెక్సికోలో పడిన వడగళ్లు కూడా అలాంటివేనంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. 


ఒళ్లా... విల్లా?

ఎవరన్నా పొరబాటున వేలినో చేతినో కాస్త మెలి తిప్పితే విపరీతమైన నొప్పి పుడుతుంది. అయితే సూరత్‌కు చెందిన యశ్‌ షా ఎటంటే అటు శరీరాన్ని వంచే విధానం చూస్తే ఒళ్లుగగుర్పొడుస్తుంది. నరాలు తెగిపోయి, ఎముకలు విరిగిపోతాయేమో అనిపిస్తుంది. కానీ ఆ కుర్రాడికి ఏ నొప్పీ పుట్టదు. అతని చేతుల్నీ, కాళ్లనీ 360 డిగ్రీల్లో, తలని 180 డిగ్రీల కోణంలో చటుక్కున తిప్పేస్తాడు. అమెరికా కార్టూనిస్టు డేనియల్‌ బ్రోయింగ్‌ స్మిత్‌ను ఆదర్శంగా తీసుకుని అతనిలా శరీరాన్ని రబ్బరులా వంచడం మొదలుపెట్టాడు.  ఈ విషయంలో గిన్నిస్‌లోకూడా చోటు సంపాదించుకున్న డేనియల్‌ రికార్డును బద్దలుకొట్టాలని నిర్ణయించుకున్న యశ్‌ దాదాపు మూడేళ్లు కష్టపడి శరీరాన్ని విల్లులా వంచుతున్నాడు. అతని తాత కూడా దగ్గరుండి గైడ్‌ చేయడంతో గిన్నిస్‌కెక్కే పనిలో ఉన్నాడు.


ఐఫోనుతో గోడ

ఐఫోన్‌ చేతిలో ఉంటే ఆ హుందాతనమే వేరు. అందుకు వాటికి డిమాండు కూడా ఎక్కువే. అందుకే ఆపిల్‌ సంస్థ అందించే ఆ ఫోన్‌ ధర కూడా బాగానే పలుకుతుంది. మరి అలాంటి రెండువేల ఐఫోన్లను టైల్స్‌లా మార్చేసి ఇంటి ప్రహరీ గోడకు అతికించేశాడు ఓ వ్యక్తి. అబ్బే ఇవి ఐఫోన్లు కావు, వాటి డమ్మీలని అనుకుంటున్నారేమో... అవన్నీ ఆపిల్‌ సంస్థ ఎప్పుడో నిలిపేసిన ఐఫోన్‌-6 మోడల్‌ ఫోన్లు. ఆ ఫోన్ల అప్‌డేట్లు కూడా రావడం లేదు. ప్రస్తుతం ఆ మోడల్‌ ఫోన్లను వాడుతున్నవారు పాత ఫీచర్లతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక టైల్స్‌ విషయానికొస్తే వియత్నాంకు చెందిన ఓ టిక్‌టాక్‌ యూజర్‌ ఈ మధ్య ఆ ప్రహరీ గోడను వీడియో తీసి షేర్‌ చేశాడు. చాలామంది అవి ఫేక్‌ అనీ, స్టిక్కర్లనీ అనుకుంటున్నారు. నిజానికి అవి స్క్రాప్‌ నుంచి కొనుగోలు చేసి పెట్టినవట. అంతేకాదు వియత్నాం ప్రజలు ఇలాంటి ప్రయోగం చేయడంలో ముందుంటారు. గతంలో ఒకతను ఏకంగా పాత టీవీలతో గోడల్ని కట్టేసి వార్తల్లోకి ఎక్కాడు. బహుశా ఈ ఇంటి యజమాని కూడా అదే బాపతు అయి ఉంటుంది.


నీటి చెట్టు!

చెట్లు గాలినీ, పూలనీ, పండ్లనీ, కలపనీ ఇస్తాయి. టెర్నినాలియా ఎలిప్టికా అనే చెట్టు మాత్రం వీటితోపాటు నీళ్లని కూడా ఇస్తుంది. చెట్టు నీళ్లనివ్వడమేంటని ఆశ్చర్యంగా ఉంది కదూ... నిజమే, మొసలి బెరడు చెట్టు అని కూడా పిలిచే ఆ వృక్షం బెరడుని కాస్త తొలగిస్తే చాలు పైపుకి చేయి అడ్డుపెట్టినప్పుడు ఎంత బలమైన ధార వస్తుందో అంత వేగంతో నీళ్లు బయటకు చిమ్ముకొస్తాయి. తమిళనాడులోని ఓ అడవిలో ఫారెస్ట్‌ అధికారులకు ఈ చెట్టు కంటబడటంతో వారు బెరడును గొడ్డలితో తొలగించి నీళ్లు చేతులతో పట్టుకుంటూ వీడియోలు తీశారు. ఆ వీడియోను  దిగ్విజయ్‌ సింగ్‌ ఖాటే అనే అటవీ శాఖ రిటైర్డ్‌ అధికారి ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది. వర్షపు నీటినీ, భూమిలోని నీటినీ కాండాల్లో నిల్వ ఉంచుకునే ఈ చెట్లు భారతదేశంతోపాటు నేపాల్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, థాయ్‌లాండ్‌, లావోస్‌, కంబోడియా, వియత్నాంలో ఎక్కువగా ఉంటాయి. మన దగ్గర దక్షిణ భారతదేశంలోని పొడి, తేమ, ఆకురాల్చే అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయీ చెట్లు. వీటి నుంచి వచ్చే నీళ్లకి రంగూ రుచీ వాసనా ఉండవు. కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు ఈ నీళ్లతో దాహం తీర్చుకోవడంతోపాటు కడుపునొప్పిని తగ్గించే ఔషధంగానూ వాడతారట. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులకు ఇది వాణిజ్య పంట.ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు