ఫొటోఫ్రేమ్‌తో ఛార్జింగ్‌! - Sunday Magazine
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఫొటోఫ్రేమ్‌తో ఛార్జింగ్‌!

వైర్‌లెస్‌ ఛార్జర్లు చాలా రకాలే వచ్చాయి. అయితే, అవేవీ చూడచక్కగా ఉండవు. ‘విచిత్రం కాకపోతే ఛార్జర్లు అందంగా ఉండడమేంటీ’ అంటారా... ‘ట్వెల్వ్‌ సౌత్‌’ కంపెనీకి చెందిన ఈ ‘ఫొటోఫ్రేమ్‌ ఛార్జర్‌’ అలాంటిదే మరి. చూడ్డానికి అచ్చం మామూలు ఫ్రేములానే ఉండే దీన్లో ఆత్మీయుల ఫొటోలను పెట్టుకోవచ్చు. ఛార్జింగ్‌ పెట్టాలనుకున్నప్పుడు మాత్రం ఫ్రేముకి ఫోనుని ఆనించి నిలబెడితే ఛార్జింగ్‌ అవుతుంది. ఈ ఫ్రేముకి కరెంటు కనెక్షన్‌ వెనకభాగం నుంచి ఉంటుంది కాబట్టి ఇది ఛార్జర్‌ అన్న విషయం కూడా చెబితే కానీ తెలియదు. ఇక, మాటిమాటికీ వైర్లు తీసి పెడుతూ ఫోన్‌కి ఛార్జింగ్‌ పెట్టుకునే పనీ ఉండదు. పైగా ఆ వైర్లు టేబుల్‌ మీదా ప్లగ్‌ బోర్డుల దగ్గరా చిరాగ్గానూ కనిపించవన్నమాట.


లెగ్గింగ్‌లకూ జేబులు!

ఈ కాలం అమ్మాయిల దుస్తుల్లో లెగ్గింగ్‌లు ఓ భాగం అయిపోయాయి. బోలెడంత సౌకర్యంగా ఉండడంతో పాటు, కుర్తీ, చుడీదార్‌, అనార్కలీ, టీషర్ట్‌... ఇలా దేనిమీదికైనా దీన్ని మ్యాచింగ్‌గా వేసుకోవచ్చు. ట్రెండీగానూ ఉంటుంది. ఇప్పుడైతే యోగా కోసం కూడా ప్రత్యేకమైన లెగ్గింగ్‌లు వస్తున్నాయి. ‘ఇన్ని ప్రత్యేకతలున్న వీటికి పాకెట్లు కూడా ఉంటే బాగుంటుంది కదా...’ అని అమ్మాయిలు ఎప్పుడో అప్పుడు అనుకునే ఉంటారు. ఆ కోరిక కాస్తా డిజైనర్లకూ తెలిసిపోయిందేమో ‘పాకెట్‌ లెగ్గింగ్‌’లు ప్రాణం పోసుకున్నాయి. వీటికి కాలు పక్కభాగంలోనూ నడుము వెనకభాగంలోనూ జేబులుంటాయి. కాబట్టి, బయటికెళ్లినప్పుడూ వాకింగ్‌, రన్నింగ్‌లాంటివి చేసేటప్పుడూ ఫోనూ క్రెడిట్‌ కార్డుల్లాంటివి చేత్తో పట్టుకునే పనిలేకుండా ఎంచక్కా అందులో పెట్టేసుకోవచ్చు.


గులాబీ గోడలు

ఎంగేజ్‌మెంట్‌, పెళ్లి, రిసెప్షన్‌, పుట్టినరోజు, ఓణీల వేడుక... ఇలా ఫంక్షన్లప్పుడు రంగురంగుల తాజా గులాబీలను ఓ గోడనిండా అంటించి అలంకరిస్తారు. ఆ ఒక్క గోడను చూస్తేనే ఆ చోటు మొత్తానికీ ఎంతో కళ వచ్చినట్లుంటుంది. అందుకే, ఆ పూల గోడదగ్గరే వేడుక తంతు నిర్వహించడం, ఫొటోలు తియ్యడం చేస్తుంటారు. పెద్ద పెద్ద వేడుకలకైతే ఫ్లోరిస్ట్‌ని పిలిపించి ఇలాంటివి చేయించుకుంటాం. మరి మన ఇంట్లో జరిగే చిన్న చిన్న వేడుకలక్కూడా ఇలా అలంకరించుకోవాలనిపిస్తే... ఈ ‘ఆర్టిఫీషియల్‌ ఫ్లవర్‌ వాల్‌ బ్యాక్‌డ్రాప్‌’ ప్యానెళ్లు ఉంటే అది కూడా సులభమే. ఇవి పేరుకి కృత్రిమ పూలతో చేసిన ప్యానెళ్లే కానీ చూడ్డానికి నిజమైన పువ్వుల్లానే చాలా సహజంగా ఉంటాయి. కాబట్టి, వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలో గోడకు అమర్చేసుకోవచ్చు. పండుగ, ఫంక్షన్‌ పూర్తయ్యాక తీసి దుమ్ము పడకుండా దాచేయొచ్చు. మామూలు పువ్వులతో అన్నిసార్లు గోడల్ని అలంకరించాలంటే బోలెడంత ఖర్చు అవుతుంది. పైగా అవి సాయంత్రానికి వాడిపోతాయి. అదే ఈ పువ్వులైతే ధరా తక్కువే ఎంత కాలమైనా తాజాగా ఉంటాయి. మీకూ కావాలంటే ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు.


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు